ఉత్తమ్ కుమార్ రెడ్డి కు గోల్డెన్ ఛాన్స్ : కాంగ్రెస్ లోక్‌సభాపక్ష రేసులో కెప్టెన్ : రాహుల్ తో చర్చలు..!!
తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి కోల్పోయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు కీలక పదవి రేసులో ఉన్నారు. గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న ఉత్తమ్ పేరు ఇప్పుడు కాంగ్రెస్ అధినాయకత్వం కీలక పదవి కోసం పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం. కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి స్థానంలో మరొకరిని నియమించాలని పార్టీ అధిష్ఠానం డిసైడ్ అయింది. కొద్ది నెలలగా ఈ స్థానంలో కొత్త వారిని నియమించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. అయితే, కరోనా కారణంగా ఈ నిర్ణయం వాయిదా పడుతూ వచ్చింది.
Recommended Video

కాంగ్రెస్ లోక్‌సభా పక్ష రేసులో ఉత్తమ్
ఇక, ఈ నెల 19నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనుండటంతో ఈ లోగానే లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేతను డిసైడ్ చేయటం అనివార్యంగా మారింది. ఈ మేరకు ఇప్పటికే టెన్ జన్ పథ్ లో చర్చలు సాగుతున్నాయి. కాంగ్రెస్ పక్ష నేతగా రాహుల్ గాంధీ వ్యవహరించనన స్పష్టం చేయటంతో.. ఇప్పుడు కొత్తగా బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే దాని పైన చర్చ జరుగుతోంది. అందులో భాగంగా.. గతంలో కాంగ్రెస్ అధినాయకత్వానికి తమ అసమ్మతి తెలియజేస్తూ సంస్థాగత మార్పులు చేయాలని 23 మంది నేతలు లేఖ రాసారు.

కాంగ్రెస్ పై ధిక్కార స్వరం
అప్పట్లో అది కాంగ్రెస్ లో కలకలం రేపింది. దీని పైన పార్టీలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఇక, ప్రస్తుతం తాజాగా కాంగ్రెస్ లోక్ సభ పక్ష నేతగా ఆ 23 మంది లేఖ రాసిన నేతల్లో ఎవరికైనా ఇవ్వాలనే ప్రతిపాదన పైన కొద్ది రోజులుగా చర్చలు సాగుతున్నాయి. అయితే, అసమ్మతిని లేఖ ద్వారా తెలియచేయటం ఒక రకంగా తమకు ధిక్కరించినట్లుగా కాంగ్రెస్ అధినాయకత్వం భావించింది. వారి పైన చర్చలకు నిర్ణయం తీసుకొనే పరిస్థితులు లేకపోయినా...కీలక పదవుల్లో వారికి అవకాశం ఇస్తారా అనేది మాత్రం సందేహమే. ఇదే సమయంలో పలువురి పేర్లు ఈ పదవి కోసం రేసులో ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఒక వ్యక్తికి ఒకే పదవి
ప్రధానంగా.. శశిథరూర్, మనీశ్ తివారీ ఉన్నట్టు తెలుస్తోంది. వీరితో పాటుగా గౌరవ్ గొగొయి, రన్‌వీత్ సింగ్ బిట్టూ, ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్లు కూడా వినబడుతున్నాయి. శశిథరూర్, మనీశ్ తివారీ జీ-23 నేతల జాబితాలో ఉన్నారు. దీంతో..వీరిద్దరిని కాదనుకుంటే మిగిలిన ముగ్గురిలో ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. పార్టీలో ఒక వ్యక్తికి ఒకే పదవి నిబంధన ఇప్పుడు కఠినంగా అమలు జరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో.. అధిర్ రంజన్ చౌదరిని తొలగింపు ఖాయంగా కనిపిస్తోంది.

బెంగాల్ పీసీసీ అధ్యక్షుడిగా అధిర్ రంజన్
అధిర్ ప్రస్తుతం పశ్చిమబెంగాల్ పీసీసీ అధ్యక్షుడిగా ఉండటంతో పాటు లోక్‌సభలో కాంగ్రెస్‌సభాపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. రెండు పదవులు నిర్వహిస్తున్న మిగతా వారిని కూడా ఒకదాన్నుంచి రిలీవ్ చేయనున్నారు. ఈ సమయంలో తెలంగాణ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు సైతం పరిశీలనలో ఉండటంతో పాటుగా ..ఈ మధ్య కాలంలోనే రాహుల్ గాంధీతో చర్చలు జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, ఉత్తమ్ కు పార్లమెంటరీ వ్యవహారాల్లో అంతగా అనుభవం లేకపోవటం మైనస్ గా మారే అవకాశం ఉంది.
దీంతో పాటుగా..బలమైన బీజేపీని లోక్ సభలో ఎదుర్కోవాలంటే సభా వ్యవహారాల పైన పట్టు...ఫ్లోర్ మేనేజ్ మెంట్.. మంచి వాగ్దాటి అవసరం ఉన్న నేతను ఎంపిక చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో..ఉత్తమ్ పేరు రేసులో ఉన్న ఆయన ఎంపిక అంత సులువు కాదనే వాదన తెలంగాణ కాంగ్రెస్ లో వినిపిస్తోంది. దీని పైన ఈ నెల 15వ తేదీన కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకోనుంది.












Click it and Unblock the Notifications