కాంగ్రెస్ పార్టీకి షాక్: పార్టీ మారిన సీఎం సహా 44మంది ఎమ్మెల్యేలు, ఇక బిజెపి..!
ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్‌లో మరోసరి పెను సంక్షోభం చోటుచేసుకుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన మొత్తం 44 మంది ఎమ్మెల్యేలలో ముఖ్యమంత్రి ఫెమా ఖండూ సహా 42 మంది ఎమ్మెల్యేలు బీజేపీ కూటమిలో చేరుతున్నారు. మూడింట రెండు వంతుల మంది ఒకేసారి పార్టీ మారితే వాళ్లకు ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా దాదాపు మొత్తం పార్టీ సభ్యులంతా ఒకేసారి మారిపోతుండటంతో చట్టప్రకారం ఏమీ చేయడానికి కూడా ఉండదు. దీంతో ఆ రాష్ట్రంలో ఎన్నికలు ఏమీ లేకుండానే ఒక్క దెబ్బకు కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయినట్లయింది. అరుణాచల్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలు ఉన్నాయి. వాటిలో కాంగ్రెస్ పార్టీ 44 స్థానాలను గెలుచుకుంది.
2016, మే నెలలోనే పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్(పీపీఏ)- బీజేపీ కలిసి ఒక కూటమిగా రూపొందాయి. ఆ కూటమికి ఇప్పుడు మరింత బలం చేకూరి.. బీజేపీ అధికారంలోకి రాబోతున్నట్లే. కాగా, ప్రాంతీయ పార్టీ అయిన పీపీఏ 1979లో ప్రారంభమైంది.

ఒకేసారి వీళ్లంతా నేరుగా బీజేపీలో చేరితే ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయన్న ముందు జాగ్రత్తతో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా వీళ్లందరినీ పీపీఏలో చేరుస్తున్నట్లు తెలిసింది. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి కిరణ్ రిజిజు.. ఎమ్మెల్యేలు పార్టీ మారితే బిజెపిని నిందించడం సరికాదని అన్నారు.
కేంద్రప్రభుత్వ చర్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటున్నాయంటూ ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో చట్టపరంగా ఎలాంటి సమస్య రాకుండానే అధికారాన్ని అంది పుచ్చుకోడానికి అంతా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగా, మళ్లీ సీఎం, ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో మరోసారి కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగినట్లయింది.
ఇది ఇలా ఉండగా, గతంలో బలవంతంగా అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే కలిఖో పుల్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications