
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆ సీనియర్ నేత??.. సమావేశమైన సోనియాగాంధీ
శతాబ్దానికి పైబడి చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి గాంధీయేతర వ్యక్తి అధ్యక్షుడయ్యే అవకాశం కనపడుతోంది. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తమ కుటుంబానికి అత్యంత విధేయంగా ఉంటున్న రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్‌కు ఈ పదవి ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అశోక్ స్పందించారు. మీడియా ద్వారానే తనకు కూడా ఈ విషయం తెలిసిందని, ఇప్పుడు వార్తలు వింటున్నానని వ్యాఖ్యానించారు. తన విధులు తాను నిర్వర్తిస్తున్నానని, రాజస్తాన్‌లో తన బాధ్యతల విషయంలో ఎటువంటి రాజీ లేదని స్పష్టం చేశారు. ఇతర విషయాలన్నీ తనకు కేవలం మీడియాద్వారానే తెలుస్తున్నాయన్నారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడిగా అశోక్
త్వరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరిస్తున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించడంతోపాటు సోనియాగాంధీ ఇటీవల అశోక్‌తో సమావేశమై పార్టీ అధ్యక్ష పదవి చేపట్టాలని కోరినట్లుగా విశ్వసనీయ సమాచారం. దీనిపై ఎటువంటి ధ్రువీకరణ లేనప్పటికీ ఆయన గాంధీల కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడు. అలాగే ఆయనకున్న రాజకీయ అనుభవం కూడా అధ్యక్ష ఎన్నికకు దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

సచిన్ పైలెట్ కు అప్పగించడానికి సుముఖంగా లేరు
గాంధీయేతర కుటుంబానకి చెందిన వ్యక్తి పార్టీ పగ్గాలు చేపడితే ఎదురయ్యే కష్టనష్టాలు, ఇబ్బందుల గురించి ఆయనకు అవగాహన ఉందని, దేశవ్యాప్తంగా పార్టీ గడ్డు పరిస్థితిన ఎదుర్కొంటోందని, అంతేకాకుండా రాజస్తాన్‌లో ముఖ్యమంత్రి పదవిని సచిన్ పైలెట్‌కు అప్పగించేందుకు కూడా ఆయన సుముఖంగా లేరని సంబంధిత వర్గాలంటున్నాయి.

28న అధ్యక్షుడి ఎన్నిక తేదీ ప్రకటన
సెప్టెంబరు 20వ తేదీలోగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానానికి ఎన్నికలు ముగియనున్నాయి. ఈలోగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. అనారోగ్య కారణాలతో ఈ పదవిని చేపట్టేందుకు సోనియాగాంధీ సుముఖంగా లేరు. అయితే రాహుల్ గాంధీ పదవిని తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. 2019 ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైన తర్వాత ఆయన తన పదవికి రాజీనామా సమర్పించారు. ప్రియాంకగాంధీకి పగ్గాలు అప్పగిస్తారంటూ మరోవైపు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో రాహుల్ కాదంటే ప్రియాంక పేరును ప్రతిపాదించే అవకాశాలు కనపడుతున్నాయి. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే తేదీని ప్రకటించడానికి పార్టీ నిర్ణయాత్మక విభాగం ఈనెల 28వ తేదీన సమావేశం కాబోతోంది.