ఆపరేషన్ సింధూర్ లో నష్టాల్ని సింగపూర్ లో చెప్పాలా ? కాంగ్రెస్ ఫైర్..!
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ వెనక్కి తగ్గి కాల్పుల విరమణ ప్రకటించినట్లు చెప్పుకుంటున్న కేంద్రానికి త్రిదళాధిపతి (సీడీఎస్) అనిల్ చౌహాన్ షాకిచ్చారు. సింగపూర్ వెళ్లిన ఆయన అక్కడ ఓ బ్లూంబర్గ్ టీవీ ఇంటర్వూలో మాట్లాడుతూ తొలిసారిగా ఆపరేషన్ సింధూర్ లో భారత్ కు ఎదురుదెబ్బలు తగిలినట్లు అంగీకరించారు. దీంతో ఇప్పటివరకూ విపక్షాలు పదే పదే ప్రశ్నిస్తున్నా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతూ వస్తున్న కేంద్రం ఇరుకునపడింది.
ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత్ కూడా యుద్ద విమానాలు కోల్పోయిందని, అయితే పాకిస్తాన్ చెబుతున్నట్లు ఆరు విమానాలు మాత్రం కోల్పోలేదంటూ సీడీఎస్ అనిల్ చౌహాన్ సింగపూర్ లో చేసిన ప్రకటన కేంద్రాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేసింది. ముఖ్యంగా విపక్షాలు ప్రశ్నిస్తున్నా సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్న ప్రధాని మోడీ, విదేశాంగమంత్రి జైశంకర్ కు ఇది షాకిచ్చింది. దీంతో కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది.

సింగపూర్‌లో ఆపరేషన్ సిందూర్ గురించి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ స్పందించారు. భారతదేశ సైనిక నష్టాలను ఆయన అంగీకరించారని, అవి తీవ్రంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని, విస్తృత రాజకీయ చర్చకు ఆవశ్యకమని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ తెలిపారు. ఒక సైనిక అధికారి విదేశాలలో నష్టాలను వెల్లడించే ముందు రక్షణ మంత్రి రాజకీయ పార్టీలకు వాటి గురించి తెలియజేయాల్సిందని గుర్తుచేశారు.

కార్గిల్ సమీక్ష కమిటీ మాదిరిగానే స్వతంత్ర నిపుణుల కమిటీ ద్వారా భారతదేశ రక్షణ సంసిద్ధతను సమగ్రంగా సమీక్షించాలని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ కోరారు. సింగపూర్ నుండి ప్రకటనల కోసం మనం ఎందుకు వేచి ఉండాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. మనం ప్రజాస్వామ్యానికి తల్లిగా ఉండాలని, జనరల్ చౌహాన్ లేవనెత్తిన అంశాలు చాలా ముఖ్యమైనవని, అవి సైనిక వ్యూహంపై మాత్రమే కాకుండా విదేశాంగ విధానం, ఆర్థిక విధానం, దౌత్య వ్యూహంపై కూడా ప్రభావం చూపుతాయన్నారు.












Click it and Unblock the Notifications