'రెండాకులు' నిషేధం ఓ భారీ కుట్ర, దాని వెనక ఎవరున్నారో తెలుసు: శశికళ వర్గం
పార్టీ గుర్తును తాత్కాళికంగా నిషేధించడం వెనుక కుట్ర దాగుందన్న దినకరన్ వ్యాఖ్యలను శశికళ సమర్థించారు. ఇది అందరికి తెలిసిన విషయమేనన్నారు.
చెన్నై: అన్నాడీఎంకె పార్టీ చిహ్నాం 'రెండాకులు'ను తాత్కాళికంగా ఎవరికీ కేటాయించేది లేదని ప్రధాన ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో పార్టీ గుర్తును సెంటిమెంటుగా మార్చుకోవాలన్న చిన్నమ్మ శశికళకు, పన్నీర్ సెల్వంకు భారీ షాక్ తగిలినట్లయింది.
అయితే ఎన్నికల కమిషన్ తాత్కాళికంగా పార్టీ పేరుతో పాటు ఎన్నికల చిహ్నాన్ని నిషేధించడం వెనుక కుట్ర దాగుందని శశికళ వర్గం ఆరోపిస్తోంది. ఆ కుట్ర వెనుక ఎవరున్నారో తమకు తెలుసునని, ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణను అడ్డుకునేందుకు ఈ కుట్రకు తెరలేపారని అన్నాడీఎంకె డిప్యూటీ జనరల్ సెక్రటరీ దినకరన్ ఆరోపించారు.

ఇదంతా కుట్రపూరితం:
ఇలాంటి అడ్డంకులు ఎదురవడం సహజమేనని, ఈ పరిస్థితిని తాము సమర్థవంతంగా ఎదుర్కోగలమని ఆయన అన్నారు. ఆర్కేనగర్ ఉపఎన్నికలో తమదే విజయమని ధీమా వ్యక్తం చేసిన దినకరన్.. గురువారం సాయంత్రం మీడియా సమావేశం సందర్బంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
దినకరన్ వ్యాఖ్యలను అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ సమర్థించారు. పార్టీ గుర్తును తాత్కాళికంగా నిషేధించడం వెనుక కుట్ర దాగుందన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు.

'సెంటిమెంటు'కు దెబ్బ పడింది:
కాగా, అన్నాడీఎంకె పార్టీ పేరు గానీ చిహ్నాన్ని గానీ వాడుకునే అవకాశం లేకుండా ప్రధాని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో 'అమ్మ' సెంటిమెంటుతో లబ్ది పొందాలని చూసిన ఇరు వర్గాలకు ఇదో భారీ ఝలక్ అని చెప్పాలి. వచ్చే ఏప్రిల్ 12న జరగబోయే ఆర్కేనగర్ ఉపఎన్నిక కోసం శశికళ వర్గానికి ఎన్నికల కమిషన్ టోపి గుర్తును, పన్నీర్ వర్గానికి ఎలక్ట్రిక్ పోల్ ను కేటాయించింది.

టోపీ దూసుకెళ్తుంది:
శశికళ వర్గం నేత నంజిల్ సంపత్ కుమార్ సైతం ఎన్నికల కమిషన్ తీర్పును తప్పుపట్టారు. ఇది ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమని అన్నారు. దీని వెనకాల భారీ కుట్ర దాగుందన్నారు. అయితే ఈ ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని, టోపి గుర్తు జనాల్లోకి సులువుగా వెళ్లగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. 1966లొ వచ్చిన 'అన్బె వా' అనే తమిళ సినిమాలో ఎంజీఆర్ టోపి ధరించారని గుర్తు చేస్తూ.. ఈ తరహా ప్రచారంతో తాము విజయంతో సాధిస్తామని అన్నారు.

విజయం శశికళదే: తంబిదురై
మరో అన్నాడీఎంకె నేత తంబిదురై ఎన్నికల కమిషన్ నిర్ణయం గురించి ప్రస్తావిస్తూ ఇది తాత్కాళికమేనని గుర్తుచేశారు. ఇరుపక్షాలు భారీ వివరణలు ఇచ్చుకోవడంతో వాటిని ఇంత త్వరగా విశ్లేషించి తీర్పు ఇవ్వడం సాధ్యపడదన్నారు. ఆర్కేనగర్ ఉపఎన్నికలో తమదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications