భారత్‌లో కరోనా అలర్ట్.. 7వేలు దాటిన యాక్టివ్ కేసులు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మళ్లీ కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఒక్కో దేశానికి విస్తరిస్తుండడం ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది. ఇక మన దేశంలో సైతం చాపకింద నీరులా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
కాగా భారత్‌లో మే 20 తర్వాత కరోనా కేసుల పెరుగుదల అధికంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న కొత్త వేరియంట్ ప్రభావం తక్కువే అయినప్పటికీ.. వయసు మీద పడిన వారిపై అధిక ప్రభావం చూపుతుండటంతో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఆరుగురు మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. అలాగే ఈ ఏడాదిలో ఇప్పటివరకు కరోనా మహమ్మారి కారణంగా 74 మంది మృతి చెందారు.

మరోవైపు గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 306 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ప్రస్తుతం 7,121 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఒక్క కేరళలోనే 2,223 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్‌లలో కూడా యాక్టీవ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అలానే తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం ఏపీలో 72, తెలంగాణలో 11 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.












Click it and Unblock the Notifications