భారత్ లో కరోనా క్షీణత: తాజాగా 13,596 కొత్త కేసులు,166 మరణాలు; యాక్టివ్ కేసులు ఎన్నంటే !!
భారతదేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 24 గంటల్లో భారతదేశంలో 13,596 తాజా కోవిడ్ -19 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. 230 రోజుల్లో అత్యల్ప రోజువారీ కేసులు ఈరోజు నమోదయ్యాయి. క్రియాశీల కేసుల్లో కూడా గణనీయంగా తగ్గుదల కనిపిస్తుంది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసులు 1,89,694 కి తగ్గాయి, 221 రోజుల్లో అత్యల్పంగా క్రియాశీల కేసులు నమోదైనట్టు తెలుస్తుంది.
సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం గత 24 గంటల్లో భారతదేశంలో 166 మంది మరణించడంతో మరణాల సంఖ్య 4,52,290 కి పెరిగింది. మరణాల రేటు 1.33 శాతంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో ఇప్పటివరకు 3,40,81,315 కోవిడ్ కేసులు నమోదయ్యాయని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. గత 24 గంటల్లో యాక్టివ్ కేసులు 6,152 తగ్గాయి . ప్రస్తుతం మొత్తం ఇన్ఫెక్షన్లలో యాక్టివ్ కేసులు 0.57 శాతం ఉన్నాయి. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98.10 శాతం గా నమోదైంది
ఇక దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి నుండి కోలుకున్న వారి సంఖ్య 3,34,39,331 కు పెరిగింది. ఇదిలా ఉంటే వీక్లీ పాజిటివిటీ రేటు 1.37% శాతం కాగా, రోజువారీ పాజిటివిటీ రేటు కూడా 1.37 శాతం గా నమోదైంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ నేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. దేశవ్యాప్త టీకా డ్రైవ్ లో భాగంగా దేశంలో ఇప్పటి వరకు మొత్తం 97.79 కోట్లకు పైగా కోవిడ్ వ్యాక్సిన్ మోతాదులు ఇవ్వబడ్డాయి. దేశవ్యాప్తంగా, ఈ ఏడాది చివరి నాటికి 108 కోట్ల మంది పెద్దలకు పూర్తిగా టీకాలు వేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించినట్లు తెలుస్తోంది.

కరోనా మహమ్మారి ప్రారంభమైన తర్వాత ఆదివారం, ముంబైలో మొదటిసారిగా కోవిడ్‌తో ఎలాంటి మరణాలు నమోదు కాలేదు. ముంబైలో ప్రజలందరికీ ఇది గొప్ప వార్త అని ముంబై పౌర కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ పేర్కొన్నారు. ఇక కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.దేశంలోనే రోజువారి కేసులలో అత్యధిక కేసులు నమోదు చేస్తున్న కేరళ రాష్ట్రంలో గత 24 గంటల్లో 7,555 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా గత 24 గంటల్లో 74 మంది కేరళ రాష్ట్రంలో మరణించారు. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో 87,657 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇదిలా ఉంటే భారత దేశంలో కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న మహారాష్ట్రలో గత 24 గంటల్లో 1715 కరోనా కేసులు నమోదు కాగా 29 మంది మరణించారు . మహారాష్ట్రలో 28,631 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. తమిళనాడు రాష్ట్రంలో గత 24 గంటల్లో 1218 కరోనా కేసులు నమోదు కాగా 15మంది కరోనా కారణంగా మృత్యు వాత పడ్డారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 24 కోట్ల కరోనా కేసులు నమోదు కాగా 48.98 లక్షల కరోనా మరణాలు నమోదైన్నట్టుగా సమాచారం. ప్రపంచంలో అత్యధిక కేసులను కలిగి ఉన్న యునైటెడ్ స్టేట్స్, వచ్చే నెల నుండి పూర్తిగా టీకాలు వేసిన విదేశీ పర్యాటకులను అనుమతించాలని నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications