భారత్ లో క్షీణిస్తున్న కరోనా కొత్త కేసులు, యాక్టివ్ కేసులు, రోజువారీ కేసుల నమోదులో టాప్ 5 రాష్ట్రాలివే !!
భారతదేశంలో కరోనా మహమ్మారి కేసుల కొనసాగింపు జరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో భారతదేశంలో 18,132 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 20 వేల కంటే తక్కువ కరోనా కేసులు నమోదు కావడం భారతదేశానికి ఊరటనిస్తుంది. క్రియాశీల కేసులు కూడా క్రమంగా తగ్గుతున్న పరిస్థితి భారత దేశంలో కరోనా క్షీణతను సూచిస్తుంది.
ఇదిలా ఉంటే గత 24 గంటల్లో భారతదేశంలో 193 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం దేశంలో మరణాల సంఖ్య 4,50,782 కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 227347 గా ఉంది. గత 24 గంటల్లో కరోనా మహమ్మారి బారినుండి 21,563 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో నమోదైన కొత్త కేసుల కంటే, కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం రికవరీ రేటు 98 శాతం గా ఉంది. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 1.75 శాతంగా ఉంది .ఇక వీక్లీ పాజిటివిటీ రేటు 1.53 శాతంగా ఉంది. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల రేటు 0.67 శాతంగా ఉంది. ఇదిలా ఉంటే కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత దేశంలో జోరుగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 95,19,84,373 వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లుగా అధికారిక డేటా చెపుతోంది.

ఇదిలా ఉంటే దేశంలో ఇప్పటి వరకు మొత్తం కేసులు 3.39 కోట్లకుపైగా ఉన్నట్లుగా సమాచారం. మొత్తం రికవరీలు 3.32 కోట్లను దాటినట్లుగా తెలుస్తుంది. దేశంలోనే రోజువారి కేసుల్లో అత్యధిక కేసులు నమోదు చేస్తున్న కేరళ రాష్ట్రంలో గత 24 గంటల్లో 10,691 కరోనా కేసులు నమోదు కాగా 85 మంది మరణించారు. ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో ఒక లక్షా 1,11,147 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలోనే అత్యంత ప్రభావితమైన మహారాష్ట్రలో గత 24 గంటల్లో 2294 కరోనా కేసులు నమోదు కాగా 28 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు.ఇక మహారాష్ట్రలో ప్రస్తుతం 33,449 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
ఆ తర్వాత అత్యధిక కేసులు నమోదు చేస్తున్న తమిళనాడు రాష్ట్రంలో 1329 కొత్త కేసులు నమోదు కాగా 15 మంది మహమ్మారికి బలయ్యారు. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో 16,130 యాక్టివ్ కేసులున్నాయి. ఆ తర్వాత స్థానంలో ఈశాన్య రాష్ట్రం మిజోరాం అత్యధిక కేసులను నమోదు చేసింది . గత 24 గంటల్లో కరోనా మహమ్మారి కారణంగా 1,170 కరోనా కేసులు నమోదు కాగా 9 మంది కరోనా కారణంగా మరణించారు.
మిజోరాం తర్వాత స్థానంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నిలిచింది.
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 760 కరోనా కేసులు నమోదు కాగా 11 మంది మరణించారు. పశ్చిమ బెంగాల్ లో కరోనా యాక్టివ్ కేసులు ప్రస్తుతం 7,649 ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలలో ఎక్కువ కరోనా కేసులు నమోదు చేస్తున్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో కేసులు క్రమంగా తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 624 కరోనా కేసులు నమోదు కాగా నలుగురు మరణించారు. కర్ణాటక రాష్ట్రంలో 406 కరోనా కేసులు నమోదు కాగా 10 మంది మృత్యువాత పడ్డారు.












Click it and Unblock the Notifications