కాంగ్రెస్ పార్టీలో కరోనా కలకలం.. ప్రియాంకా గాంధీకి కరోనా పాజిటివ్!!
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కోవిడ్ పాజిటివ్ వచ్చిన ఒక రోజు తర్వాత, ప్రియాంక గాంధీ కూడా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఈ మేరకు ప్రియాంకా గాంధీ వాద్రా శుక్రవారం ట్వీట్ చేశారు. తేలికపాటి లక్షణాలతో తనకు కూడా పాజిటివ్ గా తేలిందని, అన్ని ప్రోటోకాల్‌లను అనుసరించి, తాను ఇంట్లో హోం ఐసోలేషన్ లో ఉన్నట్టు పేర్కొన్నారు. నాతో సంప్రదించిన వారిని అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తాను అభ్యర్థిస్తున్నాను అని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ట్వీట్ చేశారు.
Recommended Video


ప్రియాంకా గాంధీకి కరోనా పాజిటివ్
సోనియా గాంధీకి కోవిడ్ పాజిటివ్ వచ్చిన తర్వాత ప్రియాంక గాంధీ గురువారం లక్నో పర్యటన నుండి ఢిల్లీకి తిరిగి వచ్చారు. ఉత్తరప్రదేశ్ లక్నో లో కాంగ్రెస్ పునరుద్ధరణ వ్యూహంపై చర్చించేందుకు రెండు రోజుల నవ సంకల్ప చింతన శిబిర్ కు హాజరైన ప్రియాంక గాంధీ తన పర్యటనను అర్ధంతరంగా ముగించుకున్నారు. తల్లికి కరోనా సోకడంతో ముందు జాగ్రత్త చర్యగా ఆమె లక్నో నుండి సమావేశాలను అర్ధాంతరంగా ముగించుకొని ఢిల్లీకి చేరుకున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆమెకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

కాంగ్రెస్ పార్టీలో కరోనా కలకలం
సోనియా గాంధీకి బుధవారం సాయంత్రం తేలికపాటి జ్వరం వచ్చింది . గురువారం ఆమెకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత వారం రోజులుగా సోనియా గాంధీ పలువురు నేతలను కలిశారని, వారిలో కొందరికి కోవిడ్ పాజిటివ్‌గా తేలిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా తెలిపారు. ఇక ప్రస్తుతం ప్రియాంక గాంధీ కూడా కరోనా మహమ్మారి బారిన పడడంతో కాంగ్రెస్ పార్టీ లో కరోనా కలకలం నెలకొంది. పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి కూడా ఈడీ సమన్లు
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ నెల 8వ తేదీన ఈడీ ముందు హాజరు కావాల్సి ఉండగా సోనియా గాంధీ కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇక ఇదే కేసులో విచారణ ఎదుర్కోవలసిన పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీకి కూడా ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తాను విదేశీ పర్యటనలో ఉన్నానని విచారణ తేదీని మార్చాలని రాహుల్ గాంధీ కోరారు. దీంతో తాజాగా ఈడీ మరోసారి విచారణ తేదీని నిర్ణయించింది. ఈ నెల 13వ తేదీన హాజరవ్వాలని సమన్లు ఇచ్చింది.

సోనియా గాంధీ కోలుకోవాలని మోడీ ట్వీట్
ఇదిలా ఉంటే సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రధాని మోదీ గురువారం ట్వీట్ చేశారు. సోనియాగాంధీ త్వరగా కోలుకోవాలని తెలంగాణలోని దేవాలయాలు, చర్చిలు, మసీదులు, గురుద్వారాల్లో ప్రార్థనలు నిర్వహించాలని జిల్లా కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించింది. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉన్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications