దేశంలో కోరలు చాస్తున్న కరోనా.. నాలుగు కొత్త వేరియంట్లు !
కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ ఒక్కో దేశానికి విస్తరిస్తుండడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇక మన దేశంలో సైతం చాపకింద నీరులా కోవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజాలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే పుణె లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) తాజా అధ్యయనంలో.. కరోనా కేసుల ఈ పెరుగుదలకి ఒమిక్రాన్‌కు చెందిన నాలుగు కొత్త సబ్ వేరియంట్లు ప్రధాన కారణమని గుర్తించారు.
జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా ఈ ఉపరకాలను గుర్తించినట్లు NIV శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. వీటి ఆధారంగా వ్యాక్సిన్ ప్రభావాన్ని విశ్లేషించేందుకు పరిశోధనలు కొనసాగుతున్నాయని వారు తెలిపారు. NIV డైరెక్టర్ డాక్టర్ నవీన్ కుమార్ వివరించిన ప్రకారం ఇప్పటివరకు భారత్‌లో గుర్తించబడిన నాలుగు కొత్త ఒమిక్రాన్ ఉపరకాలు ఏవంటే..

1. LF.7
2. XFG
3. JN.1.16
4. NB.1.8.1
ఈ వేరియంట్లలో మొదట JN.1.16 ప్రభావం ఎక్కువగా కనిపించగా.. మే నెల నుంచి XFG వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు తేలింది. LF.7, LP.81.2 అనే వేరియంట్లు కలసి XFG వేరియంట్‌గా పరిణమించాయని గుర్తించారు. ఈ సబ్ వేరియంట్లు జన్యుక్రమం మారుస్తుండటంతో వైరస్ వ్యాప్తి లక్షణాలు సైతం మారిపోతున్నాయని వైద్యులు వెల్లడించారు.
అలానే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6,483 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జనవరి 1 నుంచి ఇప్పటివరకు 113 మంది కరోనా కారణంగా మృతి చెందగా..
కేరళ, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో బాధితులకు స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయి. గొంతు నొప్పి, తేలికపాటి జ్వరం, అలసట వంటి లక్షణాలు అధికంగా ఉన్నాయని నిపుణులు చెప్పారు.
కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు వేగవంతమైన పరీక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్, జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టాలని ఆదేశించింది. వలస కార్మికులు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగులతో బాధపడేవారు జాగ్రత్తలు పాటించాలంటూ సూచనలిచ్చింది. ప్రైవేట్ ల్యాబ్‌లు, ఆసుపత్రులకు కూడా ముందస్తు హెచ్చరికలు పంపింది. వైరస్ తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ వేరియంట్లు వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అప్రమత్తత అవసరమని సూచిస్తున్నారు. ప్రజలు మాస్క్‌లు ధరించాలని.. సామాజిక దూరం పాటించాలని కోరుతున్నారు. అవసరమైతే బూస్టర్ డోసులు తీసుకోవాలని తెలిపారు.












Click it and Unblock the Notifications