వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనావైరస్: పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కరోనా పరీక్ష

కరోనావైరస్ పిల్లల్ని కూడా వదిలిపెట్టడం లేదు. చిన్నారులకు కోవిడ్ సోకుతున్న కేసులు ఇటీవల భారీగా పెరుగుతున్నాయి. కరోనా మొదటి దశలో పిల్లల్లో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు.

కానీ ప్రస్తుతం చిన్నారుల్లో కూడా కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది పిల్లలు, టీనేజర్లు కరోనా బారిన పడిన దాఖలాలు చాలా తక్కువగా కనిపించాయి.

ఇప్పుడు 18 సంవత్సరాల లోపు వారికి ఇన్ఫెక్షన్ సోకుతున్న కేసులు భారీగా పెరుగుతున్నాయి.

దీనికి కారణాలేంటి?

ఈ ఏడాది ప్రారంభంలో కోవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. దాంతో పిల్లలు బయటకు వెళ్లి ఆడుకోవడం మొదలుపెట్టారు. యువత బయటకు వెళ్లడం, ఆఫీసులకు వెళ్లడం ప్రారంభించారు.

ఇంతలోనే కరోనావైరస్‌లో కొత్త మ్యుటేషన్లు పుట్టుకొచ్చాయి.

బహిరంగ ప్రదేశాల్లో రద్దీ పెరగడం, సామాజిక దూరం పాటించకపోవడం, వైరస్ కొత్త మ్యుటేషన్‌‌లకు వేగంగా సోకే లక్షణం ఉండటం.. కేసుల పెరుగుదలకు కొన్ని కారణాలుగా భావిస్తున్నారు.

కరోనా పరీక్ష

కరోనా సోకిన పిల్లలు, టీనేజర్లలో ఉండే లక్షణాలేంటి?

పిల్లల్లో జ్వరం, పొడి దగ్గు, గొంతు నొప్పి కరోనా లక్షణాలుగా కనిపిస్తున్నాయి.

అయితే వీటితో పాటు వాంతులు, విరోచనాలు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఉంటే కచ్చితంగా కరోనావైరస్ సోకిందని అనుమానించాలి.

పసివాళ్లు నొప్పిగా ఉందని చెప్పలేరు కాబట్టి వాళ్లు నిరంతరం ఏడుస్తున్నా లేదా విచిత్రంగా ప్రవర్తిస్తున్నా నొప్పితో బాధపడుతున్నారని అనుమానించాలి.

“తల్లిదండ్రులు లేదా సమీప బంధువుల నుంచి పిల్లలకు వ్యాధి సోకుతుంది. ఇప్పటివరకు చాలామంది పిల్లల్లో తేలికపాటి వ్యాధి లక్షణాలే కనిపించాయి. కొందరిలో జ్వరం ఎక్కువగా ఉంది. కొన్ని ఇతర లక్షణాలను కూడా గమనించాం. రుచి, వాసన కోల్పోయామని చిన్నపిల్లలు చెప్పలేరు. పిల్లలు సరిగా తినకపోతే వారు రుచి, వాసన కోల్పోయారని మనం అనుమానించాలి. అయితే పిల్లలు చాలా వేగంగా కోలుకుంటారు. చాలా కేసుల్లో వారిని ఐసీయూల్లో పెట్టాల్సిన అవసరం రాదు” అని ముంబయిలోని బాంబే ఆస్పత్రిలో కన్సల్టెంట్ పిడియాట్రిషన్‌గా పని చేస్తున్న డాక్టర్ ముకేశ్ సంక్లేచా చెప్పారు.

పిల్లల్లో అంటువ్యాధులపై ఆయన పరిశోధన చేశారు.

పిల్లల్లో సాధారణ లక్షణాలు

  • జ్వరం
  • పొడి దగ్గు
  • గొంతు నొప్పి
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు
  • రుచి, వాసన కోల్పోవడం

సెకండ్ వేవ్‌లో కనిపిస్తున్న ఇతర లక్షణాలు

  • వాంతులు
  • విరోచనాలు
  • తలనొప్పి
  • సృహ కోల్పోవడం
  • ఉన్నట్టుండి పడిపోవడం
  • చర్మంపై దద్దుర్లు
  • కళ్లు ఎర్రబడటం
  • వేలు గోర్లు లేదా బొటనవేలు నీలం రంగులోకి మారడం

పిల్లలకు ఎప్పుడు పరీక్షలు చేయించాలి?

“పసిపిల్లలు తల్లిదండ్రులకు, ముఖ్యంగా తల్లికి దగ్గరగా ఉంటారు. ఒకవేళ తల్లిదండ్రులకు కోవిడ్ సోకితే వారి నుంచి పిల్లలకు వచ్చే అవకాశం ఉంది. అందుకనే కరోనా లక్షణాలు ఏ మాత్రం కనిపించినా వెంటనే టెస్ట్ చేయించుకోమని పెద్దలకు చెబుతున్నాం. అయితే, చాలామటుకు పిల్లలకు పెద్దగా చికిత్స అవసరం ఉండదు. అందుకే పిల్లలకు టెస్ట్ చేయించడం మరీ అంత అవసరం కాదు. కానీ వారిలో వ్యాధి లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే కోవిడ్ పరీక్ష చేయించాలి. కుటుంబంలో ఒకరికి కోవిడ్ సోకిందని ఇంట్లో ఉన్న పిల్లలందరికీ టెస్ట్ చేయించాల్సిన అవసరం లేదు. కానీ ఆ పిల్లలు ఆడుకోవడానికి బయటకు వెళ్తే, వారి నుంచి ఇతరులకు కోవిడ్ వ్యాపించొచ్చు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే కచ్చితంగా పరీక్ష చేయించాలి” అని డాక్టర్ సంక్లేచా వివరించారు.

కరోనా పరీక్ష

పిల్లల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి?

జ్వరం ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.

వాతావరణ మారడం వల్ల లేదా చల్లని పదార్థాలు తినడం వల్ల జ్వరం వచ్చిందని అస్సలు అనుకోకండి.

ఎందుకంటే, కరోనా లక్షణాల్లో జ్వరం ప్రధానమైంది. జ్వరం ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

పిల్లలకు కరోనా సోకి తేలికపాటి వ్యాధి లక్షణాలు ఉంటే వారిని ఇంట్లోనే ఉంచండి. ఆస్పత్రికి తీసుకెళ్తే అక్కడుండే వారి వలన వ్యాధి సోకే అవకాశం ఉంది. అందుకే ఇంట్లో నుంచే ఆన్‌లైన్‌లో డాక్టర్‌ను సంప్రదించండి.

చిన్నారులకు జ్వరంగా ఉంటే ఎప్పుడెప్పుడు, ఎంతెంతుందో రాసిపెట్టండి. అలాగే ఆక్సిజన్ లెవల్స్, పల్స్ రేట్, వాంతులు, విరోచనాలలాంటి ఇతర వ్యాధి లక్షణాలు ఉంటే అవి కూడా రాసిపెట్టండి.

ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వీటిని ఒక చార్టులో నమోదు చేయాలి.

ఆక్సిజన్ లెవల్ 94 కంటే దిగువకు పడిపోతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

చిన్నారుల్లో వ్యాధి లక్షణాలు కనిపించినా తల్లిదండ్రులు భయపడాల్సిన పని లేదని, పిల్లలు చాలా వేగంగా కోలుకుంటారని డాక్టర్లు చెబుతున్నారు.

కోవిడ్ సోకిన తల్లి, బిడ్డకు పాలివ్వొచ్చా

తేలికపాటి లక్షణాలున్న మహిళ తన బిడ్డను దగ్గరకు తీసుకోవచ్చు. మాస్క్ పెట్టుకుని బిడ్డకు పాలు ఇవ్వొచ్చు.

"తల్లిపాలు ఇవ్వడం మంచిదే. తల్లిపాల నుంచి వైరస్ సోకే అవకాశం ఉంది. కానీ దానివల్ల పెద్దగా లక్షణాలు కనిపించవు. పైగా తల్లిపాల వలన కలిగే రిస్క్‌తో పోలిస్తే ప్రయోజనాలే ఎక్కువ" అని డాక్టర్ ముకేశ్ చెప్పారు.

కరోనా సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

  • పిల్లాకు మసాజ్ చేయించడానికి, స్నానం చేయించడానికి వచ్చే ఆయాల ద్వారా వ్యాధి సోకవచ్చు. మీరే స్నానం, మసాజ్ చేయిస్తే మంచిది.
  • పసిపిల్లలకు వాడే దువ్వెన, బాడీ లోషన్, సబ్బు వగైరాలను వేరుగా ఉంచండి.
  • పాలు పట్టే ముందు, డైపర్, బట్టలు మార్చే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోండి.
  • మీ కారు శానిటైజ్ చేసుకోండి.
  • మీ పిల్లల బొమ్మలన్నీ శానిటైజ్ చెయ్యండి.
  • డాక్టర్‌ను సంప్రదించకుండా విటమిన్ మాత్రలు, సిరప్‌లు, ప్రొటీన్ ప్రత్యామ్నాయాలను పిల్లలకు ఇవ్వకండి. పిల్లల వయసు, ఎత్తు, బరువుకు తగ్గట్టు వారికి ఇవ్వాల్సిన డోసును డాక్టర్లు నిర్ణయిస్తారు. వారి సలహా పాటించడం ఉత్తమం.

'ఎంఐఎస్ - సీ' అంటే ఏంటి?

ఎంఐఎస్ - సీ అంటే పిల్లలకు సోకే మల్టీ ఇంఫ్లమేటరీ సిండ్రోం

"ఇది కోవిడ్ సోకిన తరువాత కనిపించే వ్యాధి లక్షణం. దీని లక్షణాలు కోవిడ్ సోకిన తరువాత 2 నుంచి 4 వారాల లోపు కనిపిస్తాయి. కరోనా సోకిన కారణంగా పిల్లల శరీరంలో పాజిటివ్ యాంటీబాడీస్ తయారవుతాయి. దీని వలన శరీరం అతిగా స్పందిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థ ఉండాల్సిన స్థాయి కన్నా చాలా ఎక్కువగా స్పందిస్తుంది.

అయితే, పిల్లల్లో ఈ సిండ్రోం లక్షణాలు అరుదుగానే కనిపిస్తాయి. దీని గురించి తల్లిదండ్రులు భయపడి, బెంగపడక్కర్లేదు. అలాగని అజాగ్రత్తగా కూడా ఉండకూడదు. కోవిడ్ సోకిన పిల్లల్లో లక్షణాలను నిత్యం కనిపెట్టుకుంటూ ఉండాలి. ఇలా జరగవచ్చని తెలుసుకోవడమే నివారణకు ఒక మార్గం. కోవిడ్ వచ్చి, తగ్గిపోయిందిలే అని ధీమాగా ఉండకూడదు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి" అని ముంబైకి చెందిన పిల్లల డాక్టర్ గీతాంజలి షా తెలిపారు.

"విపరీతమైన కడుపు నొప్పి లేదా నీళ్ల విరేచనాలు, వాంతులు, మగతగా ఉన్నట్టు ఉండడం, మనం పిలిచినా పలకపోవడం, స్పందించకపోవడం, శరీరం రంగు కాస్త బూడిద రంగులోకి మారడం, ఊపిరి సరిగ్గా అందకపోవడం.. ఇవన్నీ అత్యవసర సంకేతాలు. కోవిడ్ సోకిన రెండు మూడు వారాల తరువాత కడుపు నొప్పి, శరీరంపై దద్దుర్లు, కళ్లు, నాలుక ఎర్రబారడం, పెదాల వాపు, మెడ నొప్పి, వాంతులు, విరేచనాలు.. వీటిల్లో ఏవి కనిపించినా ఎంఐఎస్ - సీ అని అనుమానించవచ్చు. దీనికి వెంటనే చికిత్స అందించాలి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి" అని డాక్టర్ షా తెలిపారు.

కరోనా

ఈ సిండ్రోం గుండె, ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థ, కిడ్నీలు, కళ్లు, మెదడు, శరీరం.. ఇలా ముఖ్య భాగాలను ప్రభావితం చేస్తుంది.

ఎంఐఎస్ - సీ లక్షణాలు పసిపిల్లల్లో వచ్చే కవసాకి సిండ్రోంను పోలి ఉంటాయి.

ఎంఐఎస్ - సీకి తక్షణ చికిత్స అవసరం. దీనికి వైద్యం చేయాలంటే పిల్లలకు కోవిడ్ సోకిందో లేదో డాక్టర్‌కు తెలియాలి.

ఒకవేళ కోవిడ్ టెస్ట్ చేయించకపోతే, ఇంట్లో ఎవరికైనా కోవిడ్ సోకిందా లేదా అనే విషయం డాక్టర్‌కు తెలియజేయాలి.

పిల్లల్లో కోవిడ్ లక్షణాలు కనిపించకుండా ఉండొచ్చు.

వెంటనే డాక్టర్లు యాంటీబాడీ టెస్ట్ చేసి కోవిడ్ సోకిందో లేదో తెలుసుకుంటారు.

"కొన్ని రోజుల క్రితం 12 ఏళ్ల చిన్నారిని చికిత్స కోసం తీసుకువచ్చారు. గత కొద్ది నెలలుగా బాబులో ఎలాంటి కోవిడ్ లక్షణాలు కనిపించలేదు. ఆస్పత్రికి వచ్చే 3-4 రోజు ముందు జ్వరం వచ్చింది. ఉష్ణోగ్రత బాగా ఎక్కువ ఉండడం, వాంతులు, శరీరంపై దద్దుర్లు, బీపీ పడిపోవడంతో ఆస్పత్రికి తీసుకొచ్చారు. వెంటనే ఆస్పత్రిలో చేర్చుకున్నాం. పరీక్ష చేస్తే బాబు శరీరంలో అధిక స్థాయిలో యాంటీబాడీస్ కనిపించాయి. ఇలాంటి లక్షణాలకు అధిక స్థాయిలో చికిత్స అందించాలి. లేకపోతే ప్రాణాంతకం కావొచ్చు" అని డాక్టర్ సంక్లేచా తెలిపారు.

పిల్లలకు వ్యాక్సీన్ ఎప్పుడు వేస్తారు?

ప్రస్తుతం ఏ దేశంలో కూడా పిల్లలకు వ్యాక్సీన్ అందుబాటులో లేదు. ప్రపంచవ్యాప్తంగా ఫార్మా కంపెనీలు దీనిపై నిర్విరామంగా పరిశోధనలు చేస్తున్నాయి.

తమ వ్యాక్సీన్ వేసుకుంటే 12 -15 సంవత్సరాల మధ్య వయసు పిల్లలకు కరోనా నుంచి వంద శాతం రక్షణ లభిస్తుందని ఫైజర్ ప్రకటించింది.

దీనికోసం అమెరికాలో 2260 మంది పిల్లలపై పరిశోధనలు చేశారు.

6 నుంచి 17 సంవత్సరాల వయసు పిల్లలకు వ్యాక్సీన్ అందించేందుకు బ్రిటన్‌లో పరిశోధన చేస్తున్నామని ఆస్ట్రాజెనెకా తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Coronavirus: Consult a doctor immediately if these symptoms appear in children
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X