
Oh My God:హాస్పిటల్స్‌లో నో టాయ్‌లెట్స్.. నో డాక్టర్స్ : ఆవరణలోనే మలమూత్ర విసర్జన
అలహాబాద్ : కరోనా దేశాన్ని వణికిస్తోంది. పెద్ద రాష్ట్రాల్లో అయితే పగబట్టినట్లుగా వ్యవహరిస్తోంది. చిన్నా పెద్దా, ఉన్నోడు, లేనోడు అన్న తారతమ్యమే లేకుండా అజాగ్రత్తగా ఉన్న ప్రతిఒక్కరిని ఏ మాత్రం విడిచిపెట్టడం లేదు ఈ మాయదారి మహమ్మారి. ఏకంగా ప్రాణాలే తీస్తోంది. తొలి వేవ్‌లో 14 రోజుల పాటు హాస్పిటల్‌లో ఉంటే ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చేవారు.. కానీ సెకండ్ వేవ్ పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. దీని బారిన పడిన చాలామంది ఇంటికి తిరిగి రాలేదు.ఇక సెకండ్ వేవ్ దేశంలోని గ్రామీణ ప్రాంతాలపై పంజా విసిరింది. ఉత్తర్ ప్రదేశ్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.

గ్రామీణ ప్రాంతాల్లో మరణాలు
ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్‌పూర్ జిల్లాలో ఉన్న భద్రాస్ గ్రామంలో కరోనా సోకి ఏప్రిల్ నెలలో 20 మంది చనిపోయారు. అయితే చనిపోయినవారంతా కోవిడ్‌తోనే చనిపోయారా అని చెప్పలేము. ఎందుకంటే వారికెవరికీ కోవిడ్ పరీక్షలు చేయలేదని స్థానికంగా ఉండే ఓ జర్నలిస్టు చెప్పారు. అయితే లక్షణాలు మాత్రం కోవిడ్‌కు సంబంధించినవే ఉన్నాయని వెల్లడించారు. అప్పటికీ ఈ మరణాలు ప్రభుత్వ అధికారిక మరణాల సంఖ్యలో చేరలేదు. హాస్పిటల్‌కు వెళ్లాలంటే కొన్ని మైళ్ల దూరం వెళ్లాలి. గ్రామంలో కోవిడ్ పరీక్ష జరిపే సామర్థ్యం లేదు. గ్రామీణ ఉత్తర్ ప్రదేశ్‌లో దాదాపుగా ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలింది. ఇక వీటితో లాభం లేదనుకున్న గ్రామీణ ప్రాంత ప్రజలు కరోనాను వెళ్లగొట్టేందుకు పూజలు, పునస్కారాల పై ఆధారపడ్డారు.

ఆవరణలోనే బహిరంగ మలమూత్ర విసర్జన
ఉత్తర్ ప్రదేశ్‌లోని ఇతావా జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుంచే వచ్చాయి. అక్కడి ప్రజలు జిల్లాలోని అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రి బీఆర్ అంబేడ్కర్ హాస్పిటల్‌కు చేరుకునే సరికి చాలామంది మృత్యువాత పడుతున్నారు. ఇక హాస్పిటల్‌లోని 100 పడకల కోవిడ్ వార్డులో బాత్‌రూంలకు తాళం వేసేశారు. శానిటైజేషన్ వర్కర్లు కోవిడ్ వార్డుల్లో పనిచేయమని చేతులెత్తేయడంతో టాయ్‌లెట్స్‌కు తాళం పడింది. దీంతో రోగులు, రోగుల కుటుంబ సభ్యులు బంధువులు ఆస్పత్రి ఆవరణలో ఎక్కడ ఖాళీ చోటు కనిపిస్తే అక్కడే బహిరంగ మూత్ర మల విసర్జన చేస్తున్నారు. ఓ కొల్లాయి ఉన్న చోట చేతులు, పాత్రలు కడుక్కుంటామని అయితే దానికి దగ్గరలోనే చాలామంది బహిరంగ మూత్ర మల విసర్జన చేస్తున్నారని ఓ పేషెంట్ బంధువు చెప్పుకొచ్చింది.

వార్డుల్లో పేరుకుపోయిన చెత్త
ఇక వార్డుల్లో ఎక్కడ చూసిన చెత్త పేరుకొని పోయింది. భౌతిక దూరం పాటించాలన్న ప్రాథమిక సూత్రాన్ని మరిచారు. కొందరైతే వార్డు వాకిట్లోనే పడుకున్నారు. ఎవరు ఎటునుంచైనా వెళ్లొచ్చు. ఆ ఆస్పత్రిలో సెక్యూరిటీ కూడా లేదు. అంతేకాదు మెడికల్ సిబ్బంది కానీ, పాలకవర్గం సభ్యులు కానీ ఎవరూ అక్కడ కనిపించరు. పేషెంట్లను వారి కుటుంబ సభ్యులే సహాయ సహకారాలందిస్తున్నారు. సొంతంగా ఆక్సిజన్ సిలిండర్లను ఆపరేట్ చేసుకుంటున్నామని సిబ్బంది ఎవరూ లేరని పేషెంట్ల బంధువులు వాపోతున్నారు. ఓ వైపు బీపీ పరికరం లేదు. బీపీ పేషెంట్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దీనిపై పోలీసులకు సమాచారం అందగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Recommended Video

పూజలపై ఆధారపడ్డ గ్రామీణ ప్రజలు
ఇదంతా ఇలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య వ్యవస్థ దాదాపు పతనమైంది. దీంతో అక్కడి ప్రజలు భగవంతుడిపైనే భారం వేశారు. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మహరాజ్‌గంజ్ జిల్లాలోని ఓ గ్రామంలో పురుషులు మహిళలు 9 రోజుల పాటు పూజలు చేస్తున్నారు. ప్రతిరోజు చీకట్లో మరియు సాయంకాలం గ్రామ పొలిమేరలోకి వెళ్లి దుర్గామాతకు పూజలు చేస్తున్నారు. తమ గ్రామాన్ని వైరస్ నుంచి కాపాడాలంటూ వేడుకుంటున్నారు. భౌతిక దూరం పాటిస్తూనే వారు పూజలు చేస్తున్నారు. అయితే వీరిలో చాలామంది మాస్కులు ధరించడంలేదు. దేవుడిని ఇప్పటి వరకు చూడలేదు.. అసలు ఎలా ఉంటాడో తెలియదు. అయితే ఈ పూజలు చేస్తే తప్పకుండా కరోనా మాయమవుతుందంటూ ఒక మహిళ విశ్వాసం వ్యక్తం చేసింది.