అమ్మాయి మౌనంగా ఉంటే పెళ్లికి ఒప్పుకున్నట్లే.. భలే కిరాతక చట్టం సామీ!

ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబన్లు మహిళల హక్కులను కాలరాస్తూ మరో క్రూరమైన చట్టాన్ని తీసుకువచ్చారు. తాలిబన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంజాదా ఆమోదించిన ఈ కొత్త కుటుంబ చట్టం ప్రకారం.. పెళ్లి ప్రాస్తావన వచ్చినప్పుడు ఓ పెళ్లికాని అమ్మాయి మౌనంగా ఉంటే.. ఆ మౌనాన్నే ఆమె అంగీకారంగా భావించి పెళ్లి జరిపించవచ్చు. తుపాకీ నీడలో, భయంతో బతుకుతున్న అమాయక బాలికల మౌనాన్ని అంగీకారంగా మార్చే ఈ నల్ల చట్టంపై అంతర్జాతీయ సమాజం, మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా దీనిని లైంగిక వర్ణ వివక్షగా అభివర్ణిస్తున్నారు.

మొత్తం 31 ఆర్టికల్స్‌తో కూడిన ఈ వివాదాస్పద చట్టానికి 'భార్యాభర్తల మధ్య విడిపోయే సూత్రాలు' అని పేరు పెట్టారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ చట్టం ప్రకారం ఒక అబ్బాయి లేదా ఇదివరకే పెళ్లయిన మహిళ పెళ్లి విషయంలో మౌనంగా ఉంటే దానిని అంగీకారంగా పరిగణించరు. కానీ ఒక మైనర్ లేదా అవివాహిత బాలిక మౌనాన్ని మాత్రం పెళ్లికి సమ్మతిగానే చెల్లుబాటు చేస్తారు. ఈ చట్టం ద్వారా తండ్రి, తాతలకు మైనర్ బాలికల వివాహాలపై అపరిమితమైన అధికారాలు లభించాయి. ఆర్టికల్ 5 ప్రకారం.. తండ్రి, తాత కాకుండా ఇతర బంధువులు మైనర్ వివాహం నిశ్చయించినా, అది సామాజికంగా అనుకూలంగా ఉంటే చెల్లుబాటు అవుతుందని తాలిబన్లు పేర్కొన్నారు.

ఈ కిరాతక చట్టంపై ముస్లిం మేధావులు, రాజకీయ విశ్లేషకులు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రముఖ విశ్లేషకురాలు ఫహీమా మహ్మద్ మాట్లాడుతూ.. "బాల్య వివాహం అనేది ఏ రకంగానూ సరైన వివాహం కాదు. ఒక చిన్నపిల్ల పెళ్లికి సరైన సమ్మతిని ఇవ్వలేదు. అలాంటిది మౌనాన్ని అంగీకారంగా మార్చడం వల్ల వారి గొంతును పూర్తిగా నొక్కేసినట్లవుతుంది. ఒక ముస్లింగా నేను ఈ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. పవిత్ర ఖురాన్ ఎప్పుడూ మహిళలపై బలవంతాన్ని, వేధింపులను అంగీకరించదు. కాబట్టి తాలిబన్ల ఈ కిరాతక వైఖరిని 'ఇస్లామిక్ చట్టం' గా ప్రపంచానికి చూపించకూడదు" అని స్పష్టం చేశారు.

Taliban Shocking Marriage Law Silence Means Consent for Minor Girls in Afghanistan Global outrage follows

ఆఫ్ఘనిస్తాన్‌లో చిన్నతనంలోనే పెళ్లయిన అమ్మాయి పెద్దయ్యాక ఆ వివాహాన్ని రద్దు చేసుకునే అవకాశం ఈ చట్టంలో కల్పించినట్లు తాలిబన్లు చెబుతున్నప్పటికీ.. దాని కోసం బాధితులు తాలిబన్ కోర్టుల చుట్టూనే తిరగాల్సి ఉంటుంది. అక్కడ మహిళలకు న్యాయం జరిగే అవకాశం శూన్యమని నిపుణులు తేల్చి చెబుతున్నారు. 2021లో అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుంచి తాలిబన్లు మహిళలను సజీవ శవాలుగా మార్చారు. బాలికలకు 6వ తరగతి దాటిన తర్వాత చదువుపై నిషేధం విధించారు. మహిళలు విశ్వవిద్యాలయాలకు వెళ్లడం, ఉద్యోగాలు చేయడం, ఒంటరిగా ప్రయాణించడం, బహిరంగ ప్రదేశాలకు రావడంపై ఇప్పటికే పూర్తి ఆంక్షలు ఉన్నాయి.

ప్రస్తుతం 'గర్ల్స్ నాట్ బ్రైడ్స్' అనే అంతర్జాతీయ సంస్థ గణాంకాల ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్‌లో ఇప్పటికీ దాదాపు మూడో వంతు (1/3) మంది అమ్మాయిలకు 18 ఏళ్లు నిండకుండానే వివాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు తాలిబన్ల సుప్రీం లీడర్ తెచ్చిన ఈ కొత్త చట్టం వల్ల మైనర్ బాలికల జీవితాలు మరింత అంధకారంలోకి నెట్టబడతాయని, బాల్య వివాహాల సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చుతుందని అంతర్జాతీయ వేదికలపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+