మిత్రుడు మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు: కష్టకాలంలో సాయమంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ
న్యూఢిల్లీ: కరోనావైరస్ కారణంగా వణికిపోతున్న ప్రపంచానికి సంజీవని లాంటి ఔషధాన్ని అందిస్తున్న భారతదేశంపై పలు దేశాధినేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రధాని మోడీ, భారత ప్రజలకు రుణపడి ఉంటామంటూ కృతజ్ఞతలు చెబుతున్నారు.
డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు: కరోనా పోరాటంలో భారత్ పాత్రపై ప్రధాని నరేంద్ర మోడీ

భారత సాయంపై ప్రశంసలు..
కరోనావైరస్ చికిత్సలో మంచి ఫలితాలు ఇస్తున్న మలేరియా నివారణ మందు హైడ్రోక్సీక్లోరోక్విన్‌ను తమ దేశాలతోపాటు కరోనా బాధిత దేశాలకు పంపినందుకు ఇప్పటి అమెరికా, బ్రెజిల్ సహా పలు దేశాధినేతలు ప్రధాని మోడీ, భారత ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన విషయం తెలిసిందే. భారత్‌లో కరోనా కట్టడికి మోడీ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారని, అంతేగాక, ఈ కష్ట సమయంలో ప్రపంచానికి తనవంతుగా సాయం చేస్తున్నారని ప్రశంసిస్తున్నారు.

నా మిత్రుడు మోడీకి ధన్యవాదాలంటూ..
తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ భారత ప్రధాని నరేంద్ర మోడీకి, భారత ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇజ్రాయెల్‌కు క్వోరోక్విన్ పంపినందుకు భారత ప్రధాని, నా మిత్రుడు మోడీకి ధన్యవాదాలు. ఇజ్రాయెల్ పౌరులంతా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నారని నెతన్యాహూ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.

ఇజ్రాయెల్‌కు భారత సాయం..
అంతేగాక, కరోనా మహమ్మారి విజృంభణ ప్రారంభమైనప్పటి నుంచి తాను మోడీతో తరచూ చర్చిస్తున్నట్లు నెతన్యాహూ తెలిపారు. కరోనా పరిస్థితులపై ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నామని ఆయన వివరించారు. కాగా, హైడ్రాక్సీ క్లోరోక్విన్ సహా మరికొన్ని ఔషధాలతో ఎయిరిండియా విమానం మంగళవారం ఇజ్రాయెల్‌కు చేరుకుంది. సుమారు 5 టన్నుల మందుల్ని అందించినట్లు తెలిసింది. ఇజ్రాయెల్‌లో ఇప్పటి వరకు 10 వేల మంది కరోనా బారినపడగా.. 86 మంది ప్రాణాలు కోల్పోయారు.

సంజీవని అంటూ అమెరికా, బ్రెజిల్ ప్రశంసలు..
కరోనా చికిత్సకు ఉపయోగపడే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతులపై నిషేధం ఎత్తివేసినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రజలకు, ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపిన విషయం తెలిసిందే. అద్భుతమైన వ్యక్తంటూ నరేంద్ర మోడీని ప్రశంసించారు. అసాధారణ సమయాల్లో స్నేహితుల మధ్య పరస్పర సహకారం అవసరమని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు. ‘మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఇలాంటి సమయాలు మిత్రులను మరింత దగ్గర చేస్తాయి. భారత్-అమెరికా భాగస్వామ్యం ముందు కంటే మరింత బలోపేతమైంది. కొవిడ్-19కు వ్యతిరేకంగా మానవాళి చేస్తున్న పోరాటానికి తమవంతుగా భారత్ చేయగలిగినంత సాయం చేస్తుంది. కరోనాను కలిసి జయిస్తాం' అని మోడీ ట్విట్టర్ వేదికగా బదులిచ్చారు. భారత సాయంపై బ్రెజిల్ అధ్యక్షుడు జేర్ బోల్సోనారో కూడా మోడీపై కొనియాడారు. సంజీవని లాంటి హైడ్రాక్లీ క్లోరోక్విన్ అందించారంటూ మోడీని హనుమంతునితో పోల్చి ప్రశంసించారు.