అవినీతి, బంధుప్రీతి.. దేశానికి పెను సవాళ్లు; వాటిపైనే పోరాటం చేద్దాం: పీఎం మోడీ
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అత్యంత ఘనంగా వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంటుంది. నేడు 76 స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసి జాతినుద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగం ద్వారా ఆయన ప్రజల్లో స్ఫూర్తి నింపారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుండి తన తొమ్మిదో ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం మాట్లాడుతూ అవినీతి మరియు బంధుప్రీతి భారతదేశానికి అతిపెద్ద సవాళ్ళుగా ఉన్నాయని అన్నారు. భారత దేశ అభివృద్ధికి అవినీతి, బంధుప్రీతి ప్రతిరోధకాలు గా మారాయని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. తాను ఈ రెండు ప్రధాన సవాళ్లపై దృష్టి పెట్టాలనుకుంటున్నానని ప్రధాని నరేంద్ర మోడీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో పేర్కొన్నారు.

అవినీతి మన దేశాన్ని చెదపురుగులా తినేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయం వ్యక్తం చేశారు. అవినీతి భారతదేశం యొక్క పునాదిని నాశనం చేస్తోందని పేర్కొన్న మోడీ తాను దానికి వ్యతిరేకంగా పోరాడాలనుకుంటున్నాను అని స్పష్టం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడటానికి తనకు సహాయం చేయాలని 130 కోట్ల మంది భారతీయులకు పిలుపునిస్తున్నాను అని ప్రధాని మోడీ అన్నారు. కొంతమంది అవినీతికి పాల్పడి జైల్లో గడిపిన వారిని కూడా కీర్తిస్తున్నారని, అయితే అవినీతి పట్ల, అవినీతిపరుల పట్ల కఠిన వైఖరిని కొనసాగించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ వెల్లడించారు.
ఇక బంధుప్రీతి అనేది ప్రజల నుండి అవకాశాలను లాక్కుంటుందని పేర్కొన్నారు. వంశ పారంపర్య రాజకీయాలలోను బంధుప్రీతి ప్రధాన పాత్ర పోషిస్తోందని, వంశపారంపర్య రాజకీయాలపై విరుచుకుపడిన ప్రధాని నరేంద్ర మోడీ ఇది భారతదేశానికి అతి పెద్ద సమస్య అని పేర్కొన్నారు. పరివార్ వాదీ రాజకీయాలను నివారించాల్సిన అవసరం ఉందని, దీని నుండి భారతదేశాన్ని విముక్తి చేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం అని పిఎం మోడీ పేర్కొన్నారు. దేశానికి అతిపెద్ద సమస్యగా ఉన్న ఈ రెండింటి నుండి దేశాన్ని కాపాడడానికి తన వంతు కృషి చేస్తానని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications