వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రప్రదేశ్: మొదలైన పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తున్న సిబ్బంది

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ఆదివారం ఉదయం 8 గంటలకు ఈ లెక్కింపు ప్రారంభమైంది.

బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నికలు జరిగాయి. దాంతో తుది ఫలితాలు వెలువడేందుకు ఎక్కువ సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 209 కేంద్రాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ కౌంటింగ్ ప్రక్రియ కోసం 11,803 కౌంటింగ్ సూపర్‌వైజర్లను నియమించారు. మరో 32,264 మంది సిబ్బందిని ఓట్ల లెక్కింపు కోసం కేటాయించారు.

జిల్లాల హెడ్ క్వార్టర్స్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న జిల్లా పరిషత్ సీఈఓలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఎస్‌ఈసీ కార్యాలయంలో 13 మంది ప్రత్యేక అధికారులను జిల్లాల వారీగా కేటాయించారు.

విజయనగరం జిల్లాలోని కురుపం కౌంటింగ్ కేంద్రం వద్ద ఇలా..

ఆలస్యంగా లెక్కింపు..

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో కౌంటింగ్ సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించి, కౌంటింగ్ సెంటర్లలో ఏర్పాట్లు చేశామని గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది ప్రకటించారు.

ఏప్రిల్ 8వ తేదీన జరిగిన పోలింగ్ తర్వాత కోర్టు ఆదేశాలతో ఓట్ల లెక్కింపు ఆలస్యమైంది.

సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ఈ ఎన్నికలు జరగడంతో, వీటిని రద్దు చేసి మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ తొలుత తీర్పునిచ్చింది.

ఈ తీర్పుపై ఎస్ఈసీ అప్పీల్ చేయడంతో డివిజన్ బెంచ్ ఈ కేసును విచారించింది. చివరకు సెప్టెంబర్ 16న ఓట్లు లెక్కించి, ఫలితాలు వెల్లడికి హైకోర్టు పచ్చజెండా ఊపింది.

విజయనగరం జిల్లాలోని కురుపం కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు

సిబ్బంది, ఏజెంట్లకు కోవిడ్ నిబంధనలు

కోవిడ్-19 పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు కేంద్రాలు, ఫలితాల ప్రకటన సమయంలో సిబ్బంది, అభ్యర్థుల తరుపున హాజరయ్యే కౌంటింగ్ ఏజెంట్లు కూడా జాగ్రత్తలు పాటించాల్సి ఉంది.

ప్రతి అభ్యర్థితో పాటుగా కౌంటింగ్ ఏజెంట్లు కూడా ర్యాపిడ్ యాంటి జెన్ టెస్ట్ లేదా ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు చేయించుకుని, నెగిటివ్ వచ్చినట్టు సర్టిఫికెట్ సమర్పించాలి. లేదా రెండు డోసుల వ్యాక్సిన్ ధ్రువీకరణ పత్రం అందించాలి. దానిని అనుసరించిన వారికి మాత్రమే కౌంటింగ్ కేంద్రాలలో అనుమతిస్తామని ఎస్ఈసీ ప్రకటించింది.

సిబ్బందికి కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల్లో కూడా మాస్కులు, శానిటైజర్లు సహా ఇతర అన్ని జాగ్రత్తలు పాటించాలని ఆదేశాలు వచ్చాయి.

ఓటేసేందుకు వస్తున్న వృద్ధురాలు

ఎన్నికలు కూడా ఆలస్యంగానే..

2020 మార్చిలో జరగాల్సిన ఎన్నికలను 2021 ఏప్రిల్‌లో నిర్వహించారు. కానీ పోలింగ్ ముగిసినప్పటికీ గడిచిన ఐదు నెలలుగా ఫలితాల కోసం ఎదురుచూసిన అభ్యర్థుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడుతోంది.

13 జిల్లాల పరిధిలోని 660 మండలాలకు గానూ 515 జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. 126 స్థానాలు ఏకగ్రీవం కాగా, వివిధ కారణాలతో 8 మండలాల్లో ఎన్నికలు జరగలేదు.

ఇక సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు మరణించిన కారణంగా 11 చోట్ల ఎన్నికల ప్రక్రియ నిలిపివేశారు. దాంతో 515 జెడ్పీసీలకు గానూ 2,058 మంది అభ్యర్థుల భవితవ్యం ఈరోజు తేలబోతోంది.

ఎన్నికలు

రాష్ట్రవ్యాప్తగా మొత్తంగా 10,047 ఎంపీటీసీ స్థానాలకుగానూ 2,371 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మరో 375 స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది.

పోటీచేసిన వారిలో 81 మంది అభ్యర్థులు మరణించడంతో ఆయా స్థానాల్లో పోలింగ్ జరగలేదు. మిగిలిన 7,220 స్థానాలకు గానూ 18,782 మంది అభ్యర్ధులు పోటీ చేశారు.

పార్టీ గుర్తుల ఆధారంగా జరిగిన ఎన్నికలు కావడంతో రాష్ట్రంలో అన్ని పార్టీల నేతలు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Counting begins for AP Parishad elections
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X