కరోనా కొత్త రకం ఊహించిందే! కోవాగ్జిన్ దాన్నీ ఎదుర్కొంటుంది: భారత్ బయోటెక్
హైదరాబాద్: నగరానికి చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్‌పై కూడా 'కోవాగ్జిన్' టీకా పనిచేస్తుందని స్పష్టం పచేసింది. మ్యూటేషన్ చెందిన కరోనావైరస్ నుంచి కోవాగ్జిన్ రక్షణ కల్పిస్తుందని భారత్ బయోటెక్ ఛైర్మన్, ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల తెలిపారు.

కరోనా కొత్త రకం ఊహించనిది కాదు..
కోవాగ్జిన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం లైసెన్స్ ఇవ్వాలని నియంత్రణ సంస్థలను ఇప్పటికే సంప్రదించినట్లు ఆయన వెల్లడించారు. ఐఐసీటీ ఏర్పాటు చేసిన వర్చువల్ సమావేవంలో డాక్టర్ కృష్ణ ఎల్ల ఈ మేరకు వివరాలను తెలిపారు.
బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్త కరోనావైరస్‌పైనా ఈ టీకా పనిచేస్తుందా? అని అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానమిచ్చారు. ఇది ఊహించని విషయం కాదని, వైరస్ మానవులకు సంక్రమిస్తున్నా కొద్ది మార్పులకు గురవుతుందని ఆయన తెలిపారు.

కోవాగ్జిన్ కొత్త రకాన్ని ఎదుర్కొంటుంది..
కరోనా వైరస్‌లో చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని, అయితే, వైరస్‌లో ఎన్ని మార్పులు చోటు చేసుకున్నప్పటికీ రెండు అంశాల కారణంగానే టీకా రక్షణ కల్పిస్తుందని చెప్పారు. పూర్తి రక్షణ కల్పించే ఈ రెండు విభాగాలు కూడా క్రియారహితం చేసిన ఈ వ్యాక్సిన్‌లో ఉంటాయన్నారు. వైరస్‌లో సంభవించే మార్పులను కూడా అవే ఎదుర్కొంటాయన్నారు.

మూడో దశలో కోవాగ్జిన్ ప్రయోగాలు
కాగా, భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ)తో కలిసి భారత్ బయోటెక్ కోవాగ్జిన్‌ను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలు కొనసాగుతున్నాయి. దాదాపు 20వేల మంది వాలాంటీర్లపై ప్రయోగాలు జరుపుతున్నారు.

భారత్ లోనూ కరోనా కొత్త రకం వైరస్..
మరోవైపు బ్రిటన్‌లో వ్యాపిస్తున్న కరోనా కొత్త రకం వైరస్.. ఇప్పుడు మరిన్ని దేశాలకు విస్తరిస్తోంది. డెన్మార్క్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఇటలీ, స్వీడన్, ఫ్రాన్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్, జర్మనీ, కెనడా, జపాన్, సింగపూర్, లెబనాన్ దేశాలకు ఈ కొత్త రకం వైరస్ వ్యాపించింది. భారత్‌లో కూడా ఈ కొత్త రకం కరోనా వైరస్ వెలుగుచూడటం గమనార్హం. యూకే నుంచి వచ్చిన పలువురిలో ఈ కొత్త రకం వైరస్ గుర్తించారు. ఈ క్రమంలో విదేశాల నుంచి వచ్చే వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.