కరోనా షాక్: 9రోజులకు రూ.10లక్షల బిల్లు.. కేంద్ర మంత్రి నిర్మల భర్త ప్రభాకర్ సంచలన ట్వీట్..
తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడంలో, రోగులకు చికిత్స అందించే విషయంలో కేసీఆర్ సర్కార్ దారుణంగా ఫెయిలైందంటూ బీజేపీ శ్రేణులు విమర్శిస్తోన్నవేళ.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. హైదరాబాద్ సిటీలోని ఓ బడా కార్పొరేట్ ఆస్పత్రిలో చోటుచేసుకున్న దారుణాన్ని ఆయన వెల్లడించారు.

వరుస ఘటనలు..
సిటీలోని ప్రఖ్యాత ఫీవర్ ఆస్పత్రిలో డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తోన్న డాక్టర్ సుల్తానా.. కరోనా లక్షణాలతో చాదర్‌ఘట్‌లోని తుంబే ఆస్పత్రిలో చేరగా, కేవలం 24గంటలకు రూ.1.15లక్షల బిల్లు వేయడం, డబ్బులు కట్టాలంటూ ఆమెను నిర్బంధించడం, తనకు జరిగిన దారుణంపై డాక్టర్ రూపొందించిన సెల్ఫీ వీడియో సంచలనంగా మారడం తెలిసిందే. కరోనా వారియర్లకే ఇలాంటి పరిస్థితి వస్తే సామాన్యుల మాటేంటనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటన మరువకముందే హైదరాబాద్ కే చెందిన మరో ఆస్పత్రి అనుచితానికి పాల్పడనట్లు పరకాల తెలిపారు.

బతిమిలాడినా ఒప్పుకోలేదు..
‘‘హైదరాబాద్‌లో బాగా పేరుపొందిన ఓ పెద్ద ప్రైవేటు ఆస్పత్రిలో కరోనా చికిత్స కోసం తొమ్మిది రోజులకుగాను ఏకంగా రూ.10.5లక్షల బిల్లు వేశారు. ఆ కరోనా బాధితుడి వయసు 83 ఏళ్లు. బిల్లు కట్టడానికి 12 గంటల సమయం కావాలని బతిమిలాడినా ఆస్పత్రి యాజమాన్యం ఒప్పుకోలేదు. బిల్లు ఇప్పుడు కట్టకుంటే... రోగిని వెంటనే తీసుకెళ్లిపోండని వారు తెగేసి చెప్పారు'' అని ప్రభాకర్ ట్వీట్ చేశారు. ఇది వైరల్ కావడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున ప్రతిస్పందించారు.

ఆక్సిజన్ తీసేస్తామని బెదిరించారు..
ప్రైవేటు ఆస్పత్రి దారుణంపై తీవ్రస్థాయిలో మండిపడ్డ నెటిజన్లు.. దాని వివరాలు వెల్లడించాల్సిందిగా ప్రభాకర్ ను కోరారు. కాసేపటి తర్వాత మరో ట్వీట్ చేసిన ఆయన.. ఆస్పత్రి పేరు చెబితే ఆ రోగి కుటుంబం ఇబ్బందుల్లో పడే అవకాశముందని అన్నారు. ‘‘లక్షల బిల్లు వేసిన ఆస్పత్రి పేరు తెలుసుకోవాలనే ఆత్రుత ఉండడం సహజమే. కానీ, ఆ ఆ వివరాలు బయటపెట్టి పేషంట్‌కు హాని తలపెట్టలేను. ఎందుకంటే, డబ్బులు కట్టకుంటే ఆక్సిజన్ పైపులు, ఇతర పరికరాలు తొలగిస్తామని వాళ్లు పేషెంట్ ఫ్యామిలీని భయపెట్టారు''అని ప్రభాకర్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications