• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిడ్-19: మా అమ్మను డాక్టర్లు గినియా పిగ్‌లా భావించి ప్రయోగాలు చేశారు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఐరీన్

కాటియా కాస్టిలో, తనకున్న బాధ కారణంగా రాత్రిళ్లు కూడా నిద్రపోవడం లేదు.

బ్రెజిల్‌లో సెకండ్ వేవ్ విజృంభించిన సమయంలో ఆమె, ఒకే నెలలో తన తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయారు. ఆ సమయంలో అక్కడ రోజువారీగా 4,000 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి.

మరికొన్ని రోజుల్లో ఆమె తల్లిదండ్రులు, 54వ పెళ్లి వార్షికోత్సవం జరుపుకోవాల్సి ఉంది. అంతలోనే వారు కన్నుమూశారు.

కోవిడ్-వ్యాప్తి విస్తృతంగా ఉన్న సమయంలో జరిగిన అతిపెద్ద ఆరోగ్య కుంభకోణంలో తమ కుటుంబం కూడా బలి అవుతుందని అప్పుడు కాటియాకు తెలిసి ఉండకపోవచ్చు. కరోనా చికిత్స పేరిట నకిలీ వైద్యం, నిరూపితం కాని చికిత్స విధానాలు వాడటం, రోగుల అనుమతి లేకుండానే వారిపై ప్రయోగాలు చేయడం తదితర అంశాలు ఈ ఆరోగ్య కుంభకోణంలో వెలుగుచూశాయి.

తొలి లక్షణాలు

మొదట ఆమె తండ్రి నోర్బెర్టో, మార్చి నెలలో అనారోగ్యానికి గురయ్యారు. '' ఊపిరితిత్తుల్లో ఇబ్బంది కారణంగా ఆయన శ్వాస తీసుకోలేకపోయారు. అలాంటి వ్యాధి తనకు వస్తుందని ఆయనెప్పుడూ అనుకొని ఉండరు'' అని బీబీసీతో కాటియా చెప్పారు.

సావో పాలో నగరంలోని ప్రభుత్వాసుపత్రికి నోర్బెర్టోను తరలించారు. అక్కడికి 3000 కి.మీ దూరంలో నివసిస్తోన్న కాటియా మళ్లీ ఆయనను చూడలేకపోయారు. ఆసుపత్రిలో చేర్చిన 5 రోజుల తర్వాత నోర్బోర్టో కన్నుమూశారు.

''ఆయన గుడ్‌బై చెబుతూ పంపిన చివరి వీడియా ఇంకా నా దగ్గర ఉంది. ఆ వీడియోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక నీ ఆహారం అంతా నేనే తింటాను అని ఆయన నాతో చెప్పారు'' అని కాటియా గుర్తు చేసుకున్నారు.

నోర్బెర్టో ఆసుపత్రిలో చేరిన సమయంలో, కాటియా తన తల్లి ఐరీన్‌ను చూసుకునేందుకు వచ్చారు. ఐరీన్‌కు అప్పటికే స్వల్ప స్థాయిలో కరోనా లక్షణాలు ఉన్నాయి.

వారు 'ప్రివెంట్ సీనియర్' అనే ప్రైవేటు ఆసుపత్రిని సంప్రదించారు. అక్కడ వారికి వివాదాస్పద ఔషధాలైన హైడ్రాక్సీక్లోరోక్విన్, అజిత్రోమైసిన్, ఐవర్‌మెక్టిన్‌లతో కూడిన కోవిడ్ కిట్‌ను ఇచ్చారు.

కోవిడ్-19 చికిత్సలో ఈ ఔషధాలు పనికొస్తాయని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అవి రోగుల ఆరోగ్య పరిస్థితిని మరింతగా దిగజార్చగలవని కొన్ని ఆసుపత్రుల అధ్యయనాలు వెల్లడించాయి.

వాటి వాడకం తర్వాత ఐరీన్ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ''ప్రతీరోజు నేను, ఆమె శరీర ఉష్ణోగ్రత, రక్తపోటు, ఆక్సీజన్ స్థాయిలను పరీక్షించేదాన్ని. ఆదివారం (మార్చి 21) రోజు ఆమె ఆక్సీజన్ స్థాయిలు చాలా హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాం'' అని కాటియా చెప్పారు.

ఐరీన్‌

సాంటా మాజియోరి ఆసుపత్రి యాజమాన్యానికి చెందిన ప్రివెంట్ సీనియర్ వైద్యులు ఆమెను పరీక్షించకుండానే ఇంటికి తిరిగి పంపారు. రాత్రి ఆమె పరిస్థితి మరింత సీరియస్‌గా మారడంతో కాటియా తన సోదరి సహాయంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఆ సమయంలో ఆక్సిజన్ సిలిండర్ సహాయం ఉన్నప్పటికీ కూడా ఐరీన్ శ్వాస తీసుకునేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చుకున్నారు.

ఆ తర్వాతే, ఆ కుటుంబానికి మరింత గడ్డు సమయం ఎదురైంది.

ఐరీన్ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన రోజే, మరో ఆసుపత్రిలో నోర్బెర్టో మరణించారు. '' మా నాన్న మృతదేహం కోసం నా సోదరి, మాగ్ (ఊరు, పేరు తెలియని మృతదేహాలను భద్రపరచు ప్రదేశం)లో వెతకాల్సి వచ్చింది'' అని కాటియా చెప్పారు. అక్కడి మృతదేహాలను నగ్నంగా ఒక నల్లటి సంచిలో చుట్టి పాతిపెడుతున్నారు అని ఆమె చెప్పారు.

మాగ్‌లో ఉన్న వ్యక్తి... అక్కడి మృతదేహాల్లో నోర్బెర్టో ఎవరో తనకు తెలియదని, ఆయనను వెతకడంలో సహాయం చేయాల్సిందిగా కాటియా సోదరిని కోరారు.

దీంతో ఆమె కరోనా కిట్‌ను ధరించి అతని వెంట నడిచింది. '' నా సోదరి, అక్కడి అన్ని మృతదేహాలను పరిశీలిస్తూ వెళ్లింది. వాటిలో కొన్ని పెద్దగా, మరికొన్ని చిన్నవిగా ఉన్నాయంట. మా డాడీ సన్నగా ఉంటారు. కాబట్టి ఈ సంచి అయి ఉండొచ్చు అని ఆమె చెప్పగానే ఆయన దాన్ని తెరిచారు. అది మా నాన్నే'' అని కాటియా వివరించారు.

మార్చి, ఏప్రిల్ నెలల్లో బ్రెజిల్‌లో రికార్డు స్థాయి కోవిడ్ మరణాలు నమోదయ్యాయి.

అదే సమయంలో తాను, ప్రివెంట్ ఆసుపత్రిలోని చిన్న వార్డులో తన తల్లి వద్ద ఉన్నానని కాటియా చెప్పారు. ఆమెను పరీక్షించడానికి నర్సులు అక్కడికి అరుదుగా వచ్చేవారని, ఆక్సీజన్ మాస్క్ సరిగా ఉందో లేదో మాత్రం సిస్టర్స్ చూసి వెళ్లేవారని గుర్తు చేసుకున్నారు.

ఐరీన్‌కు నర్సులు చిక్కటి ద్రవాన్ని ఇస్తున్నట్లు ఒకరోజు కాటియా గమనించారు. అది ఫ్లూటమైడ్ అని నర్సులు ఆమెతో చెప్పారు. ప్రోస్టేట్ క్యాన్సర్‌లో ఉపయోగించే ఒక రకమైన హార్మోన్ లాంటిదని వివరించారు.

ఫ్లూటమైడ్ వినియోగం వల్ల కొంతమంది రోగుల్లో కాలేయం పాడయ్యే అవకాశం ఉంటుంది. పైగా ఐరీన్ గతంలో కాలేయ క్యాన్సర్‌ బారిన పడ్డారు. దీంతో ఆమె ఆరోగ్యాన్ని మరింత ఆందోళనకరంగా మార్చే ఎలాంటి చికిత్స చేయవద్దని కాటియా, ఆమె సోదరి ఆసుపత్రి వర్గాలకు తెలిపారు.

''మరణం తర్వాత మా నాన్నకు జరుగుతోన్న ప్రతీదాని పట్ల నేను కలత చెందాను. దీని గురించి నేను ఏ డాక్టర్‌తో కూడా మాట్లాడలేకపోయా. ఆ తర్వాత మళ్లీ మా అమ్మ ఆరోగ్య పరిస్థితి దిగజారడం కూడా నేను గమనించాను'' అని కాటియా తెలిపారు.

ఐసీయూలోకి తరలించకముందు ఐరీన్ దాదాపు 10 రోజులుగా ఆసుపత్రిలోనే ఉన్నారు. అత్యవసర యూనిట్‌లోని తరలిస్తోన్న సమయంలో ఆమె శరీరంలోని అవయవాలు ఒక్కొక్కటి విఫలం కావడం ప్రారంభమైంది. డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (సిరలు ఉబ్బడం)తో పాటు, బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్‌కు కూడా గురయ్యారు. దీంతో ఆమె తుదిశ్వాస విడిచారు.

కాటియా, తన సోదరి వారి తల్లి వద్ద 20 నిమిషాలు గడపగలిగారు. ఆ తర్వాత ఆమె దహన సంస్కారాలు పూర్తయ్యాయి. ఆమె బూడిదను, నోర్బెర్టో సమాది వద్దకు తీసుకెళ్లారు.

నోర్బెర్టో మృతదేహానికి ఎలాంటి ఆచారాలు పాటించకుండానే, హడావిడిగా ఖననం చేశారు. అయితే ఆమె సోదరి, తన తండ్రికి తుది వీడ్కోలు చెప్పేవరకు సిబ్బంది కాసేపు ఆగారని కాటియా చెప్పారు.

రియలైజేషన్

''మా అమ్మ చనిపోయిన తర్వాతే, ఆమె చికిత్స కోసం పెట్టే ఖర్చు తగ్గడం ప్రారంభమైంది'' అని కాటియా చెప్పారు.

''మా నాన్న మరణంతో మేం చాలా బాధపడ్డాం. ఆ తర్వాత ఐసీయూలో మా అమ్మ పరిస్థితితో కలత చెందాం. ఆ తర్వాతే నాకు అక్కడ జరుగుతోంది ఏంటో అర్థం కావడం ప్రారంభమైంది. నేను నిద్రపోలేకపోయాను. నాకు గతంలో జరిగింది అంతా గుర్తుకు వచ్చింది. జరిగిందేదీ కరెక్టు కాదు, వారెదో తప్పు చేసినట్లు నేను గ్రహించాను.''

కోవిడ్ కిట్ పంపిన రోజు నుంచే వైద్యుల నిర్లక్ష్యం ప్రారంభమైందని కాటియా చెప్పారు. అప్పటి పరిస్థితికి అనుగుణంగా ఐసీయూలో చికిత్స అందించడానికి బదులుగా వైద్యులు, నిరూపితం కాని చికిత్స విధానాలను, ఔషధాలను వినియోగించారని ఆమె ఆరోపించారు.

బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో

అధికారికంగా ధ్రువీకరించని ఔషధాల వాడకంతో దుష్ప్రభావాలు ఉంటాయని అనేక మంది శాస్త్రవేత్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కానీ '' వైద్యులు సిఫార్సు చేసిన మందులను వాడొద్దని, వృద్ధులను ఒప్పించడం చాలా కష్టం'' అని కాటియా అన్నారు.

''ప్రివెంట్ సీనియర్ ఆసుపత్రి అందించే వైద్యాన్ని మా అమ్మ నమ్మింది. అందుకే ఆసుపత్రి వారు, తన కోవిడ్ కిట్‌ను ఎప్పుడు పంపిస్తారో కనుక్కోమని నన్నెప్పుడూ అడుగుతుండేది. కానీ వారు ఒక గినియా పందితో వ్యవహరించినట్లు, తనకు వైద్యం చేశారని ఆమె ఎప్పుడూ అనుకొని ఉండదు. త్వరలో తాను చావబోతున్నాననే సంగతి కూడా ఆమెకు తెలిసి ఉండదు.''

సెనెట్ విచారణ

'ప్రివెంట్ సీనియర్' ఆసుపత్రిలో వృద్ధులకు అందిస్తోన్న ఆమోదం లేని కోవిడ్ చికిత్స విధానాల వల్ల అనేక మరణాలు నమోదు అవుతున్నాయి.

బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోతో సంబంధం ఉన్న 'మిరాకిల్ క్యూర్స్'ను ఎండార్స్ చేయడానికి ప్రివెంట్ సీనియర్ కంపెనీ, ఎలాంటి అనుమతి తీసుకోకుండానే వృద్ధులపై ప్రయోగాలు చేస్తున్నట్లు... మహమ్మారిని కట్టడి చేయడంలో ప్రభుత్వ పనితీరుపై బ్రెజిల్ సెనెట్ నిర్వహిచిన దర్యాప్తులో తేలింది. ఈ ప్రయోగాల వల్ల చాలామంది మరణించినట్లు తెలిసింది.

65 ఏళ్ల, టౌడె ఫ్రెడెరికో డి ఆండ్రడి కూడా ఈ బాధితుల్లో ఒకరు. కరోనా చికిత్సలో భాగంగా తనకు తొలుత 'కోవిడ్ కిట్'తో పాటు ఫ్లూటమైడ్ ఇచ్చారని ఆయన విచారణ సందర్భంగా వెల్లడించారు. తమ సమ్మతి తీసుకోకుండానే ఫ్రెడెరికోను వైద్యులు, పాలియేటివ్ కేర్‌కు తరలించాలని చూసినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. ''నేను ఈ దారుణమైన కుట్ర నుంచి బతికి బయటపడ్డాను'' అని ఫ్రెడెరికో అన్నారు.

ప్రివెంట్ సీనియర్ ఆసుపత్రికి చెందిన 12 మంది వైద్యులకు లాయర్ బ్రూనా మొరాటో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సెప్టెంబర్ 28న జరిగిన విచారణ సందర్భంగా మాట్లాడుతూ కంపెనీ, అధికారికంగా నిరూపితం కాని చికిత్స విధానాలను వ్యతిరేకించిన వైద్యులను బెదిరించి, విధుల నుంచి తొలిగించినట్లు వెల్లడించారు.

''చాలా దారుణం. మంచి చికిత్స అందిస్తామంటూ అక్కడ చేరే వృద్ధులకు చెబుతున్నారు. కానీ అక్కడ వారిని గినియా పందుల్లా భావిస్తున్నారన్న సంగతి వారికి తెలియదు'' అని ఆమె చెప్పారు.

సమస్య తీవ్రతను దాచిపెట్టేందుకు కోవిడ్ మరణాల సంఖ్యను వెల్లడించడం లేదని 'ప్రివెంట్ సీనియర్' ఆసుపత్రిపై ఆరోపణలు ఉన్నాయి.

రెండు వారాల తర్వాత, రోగి రికార్డుల నుంచి కోవిడ్ అనే పదాన్ని తొలిగిస్తామని, వ్యాధి నయమయ్యాక వారిని కోవిడ్ రోగులుగా పరిగణించలేమని ప్రివెంట్ సీనియర్ ఆసుపత్రి సీఈవో పెడ్రో బాటిస్టా సెప్టెంబర్ 22న జరిగిన విచారణలో ఒప్పుకున్నారు.

ప్రివెంట్ సీనియర్ ఆసుపత్రి వర్గాలు వృద్ధులను గినియా పందుల్లాగా భావిస్తున్నారని బ్రూనా మొరాటో, సెనెటర్లతో చెప్పారు.

కానీ రోగులకు తెలియకుండా, అధికారికంగా ధ్రువీకరించని ఔషధాలతో ప్రయోగాలు చేస్తున్నారనే ఆరోపణలను ఆయన ఖండించారు.

'' ఐరీన్, ఫ్రెడెరిక్ వారికి అవసరమైన ప్రతీ వైద్య సహాయాన్ని పొందారు. వైద్య నీతిని వేలెత్తిచూపే లేదా ఖర్చును తగ్గించే ఎలాంటి చికిత్స విధానాలను తాము ఉపయోగించలేదు'' అని బీబీసీతో ప్రివెంట్ సీనియర్ ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది.

తమపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవి, ప్రజల్నితప్పుదోవ పట్టించేవి అని ప్రివెంట్ సీనియర్ కంపెనీ వ్యాఖ్యానించింది. బోల్సోనారో ప్రభుత్వంతో గానీ లేదా మరే ఇతర రాజకీయ పార్టీతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది.

ఈ కంపెనీపై సెనెట్ మాత్రమే కాకుండా ఫెడరల్ ప్రాసిక్యూటర్స్, పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. సావో పాలో రాష్ట్ర శాసన సభ్యులు కూడా ప్రత్యేక విచారణకు ఆదేశించారు.

''రాజకీయ ప్రమేయం లేని సాంకేతిక దర్యాప్తుకు మేం పూర్తిగా సహకరిస్తాం'' అని ప్రివెంట్ సీనియర్ కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.

''ఒక చట్టపరమైన ప్రక్రియలో కచ్చితమైన ఫలితం వెల్లడి కాకముందే మనుషులను, కంపెనీలను నిందించడం, ఖండించడం దురదృష్టవశాత్తు బ్రెజిల్‌లో ఒక అలవాటుగా మారింది'' అని వ్యాఖ్యానించింది.

కోవిడ్‌ను తొలగించడం

కరోనా మహమ్మారి కట్టడి విషయంలో బోల్సోనారో ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంది.

కోవిడ్ చికిత్సకు సంబంధించిన పేలవ నిబంధనల దృష్ట్యా... దేశంలో వైద్యవృత్తి నియమ నిబంధనలు రూపొందించే ప్రభుత్వ సంస్థ 'ఫెడరల్ కౌన్సిల్ ఫర్ మెడిసిన్' (సీఎఫ్ఎం)ను రద్దు చేయాలని స్వతంత్ర వైద్యుల సంఘాలు డిమాండ్ చేశాయి.

బ్రెజిల్ అధ్యక్షుడు జైరో బోల్సోనారో సైతం చాలాసార్లు దేశంలో కరోనా పరిస్థితిని తోసిపుచ్చారు. మార్చిలో ఒక మద్దతుదారుల సమూహాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ 'ఈ గొడవలు, పెడబొబ్బలు చాలు. ఇంకా ఎంత కాలం ఇలా ఏడుస్తుంటారు'' అని అన్నారు.

నోర్బెర్టో, ఐరీన్

తన కుటుంబం నాశనం కావడానికి బోల్సోనారో కారణమని కాటియా విమర్శించారు.

''అధ్యక్షుని వల్ల కేవలం చనిపోయిన వ్యక్తులకే అన్యాయం జరగలేదు. బతికి ఉన్నవారికి కూడా జరిగింది. నా కుటుంబం తరహాలోనే నాశనమైన మరో 6 లక్షల కుటుంబాలను ఉద్దేశించి నేను మాట్లాడుతున్నా.''

''తొలి డోసు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉన్న రోజే, మా నాన్న చనిపోయారు. మా అమ్మనాన్నలిద్దర్నీ వైరస్ కారణంగా నేను కోల్పోయాను. ఆ వైరస్‌ నుంచి కాపాడే టీకా ఉన్నప్పటికీ నేను వారిని కాపాడుకోలేకపోయాను'' అని ఆమె విచారం వ్యక్తం చేశారు.

టీకా తీసుకున్న తర్వాత కూడా ప్రజలు కరోనా వైరస్ కారణంగా చనిపోతున్నారు. కానీ ఇలా అరుదుగా జరుగుతుంటుందని గణాంకాలు చెబుతున్నాయి. తీవ్రమైన కేసులను, ఆసుపత్రుల్లో చేరికను నివారించడంలో టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు వెల్లడైంది.

ఫైజర్ కంపెనీ, 70మిల్లీ లీటర్ల వ్యాక్సిన్ డోసులను అందిస్తామని పదేపదే చేసిన ఆఫర్లను బ్రెజిల్ ప్రభుత్వం పెడచెవిన పెట్టినట్లు సెనెట్ విచారణలో వెల్లడైంది. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కొనుగోలు అంశంలో జరిగిన ఆలస్యాన్ని కూడా వివరించింది. అవినీతి పరులైన అధికారులు కేవలం ఒక డాలరుకే ఒక డోసు టీకాను ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది.

''ఈ వ్యాక్సిన్లు, దేశంలో ఎంతోమంది ప్రజల ప్రాణాలు కాపాడి ఉండేవి. వ్యాక్సిన్ల కొరత సరిపోనట్లుగా, వీరు ఇలాంటి చికిత్స విధానాలను అనుసరించి మరింత నష్టాన్ని కలిగించారు'' అని కాటియా అసంతృప్తి వ్యక్తం చేశారు.

'' సైన్స్‌ను ఖండిస్తే అది మనల్ని చంపుతుంది. కానీ ఆ సైన్స్‌లో డబ్బు, వ్యక్తిగత ఆసక్తులు ఇమిడి ఉంటే దాన్ని ఖండించకుండా నేను నిశ్శబ్ధంగా ఉండలేను'' అని ఆమె వ్యాఖ్యానించారు.

సావో పాలోలోని వినిసియస్ లెమోస్ ఈ నివేదికకు సహకరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Covid-19: Our mother was treated by doctors as a guinea pig
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X