కరోనా విజృంభణ: చెన్నైతోపాటు ఆ నాలుగు జిల్లాల్లో పూర్తి లాక్‌డౌన్, ఎప్పట్నుంచంటే?
చెన్నై: దేశంలో మహారాష్ట్రలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత తమిళనాడులోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా విజృంభిస్తున్న నాలుగు ప్రాంతాల్లో మరిన్ని కఠిన నిబంధనలతో లాక్‌డౌన్ విధించాలని సీఎం పళనిస్వామి నిర్ణయించారు.

12 రోజులు పూర్తిస్థాయి లాక్‌డౌన్..
ఈ మేరకు చెన్నైతోపాటు కాంచీపురం, చెంగల్‌పట్టు, తిరువళ్లూరు జిల్లాల్లో జూన్ 19 నుంచి 30 వరకు కఠిన లాక్‌డౌన్ విధించనున్నారు. ఈ జిల్లాలన్నీ చెన్నై మెట్రోపాలిటన్ పోలీస్ పరిధిలోనివే కావడం గమనార్హం. తాజా లాక్‌డౌన్ కొనసాగే 12 రోజుల్లో వచ్చే రెండు ఆదివారాల్లో మాత్రం పూర్తిస్థాయి లాక్ డౌన్ ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. ఆ రెండు రోజుల్లో మాత్రం వేటికీ మినహాయింపులు ఉండబోవని స్పష్టం చేశారు.

నిబంధనలు కఠినం..
రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న వేళ ఇప్పటికే కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేయాలంటూ రాష్ట్ర ప్రజా ఆరోగ్య, వైద్య నిపుణుల బృందం ప్రభుత్వానికి సూచించింది. సచివాలయంలో సీఎం పళనిస్వామి, సీనియర్ ఉన్నతాధికారులతో ఈ నిపుణుల కమిటీ దాదాపు గంటకు పైగా చర్చించారు. కరోనా వ్యాపించకుండా అడ్డుకొనేలా నిబంధనలను ఎలా కఠినతరం చేయాలో పలు సూచనలు చేసినట్లు నిపుణుల కమిటీ సభ్యుడు డాక్టర్ కుగననంతం తెలిపారు.

దేశంలో రెండో స్థానంలో..
దేశంలో నమోదైన అత్యధిక కేసుల్లో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. తమిళనాడులో ఇప్పటి వరకు 44,661 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 19,679 యాక్టివ్ కేసులున్నాయి. 24,547 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 435 మంది మరణించారు. కాగా, ఇక దేశ వ్యాప్తంగా కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దేశంలో ఇప్పటి వరకు 3,33,257 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,53,876 యాక్టివ్ కేసులున్నాయి. 1,69,817 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు 9524 మంది కరోనాతో మరణించారు.












Click it and Unblock the Notifications