వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిల్లలకు కోవిడ్19 వ్యాక్సిన్: టీకా ఇచ్చే ముందు, ఇచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? - 7 ముఖ్యమైన ప్రశ్నలు - జవాబులు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
న్యూదిల్లీలో పాఠశాలకు వెళ్తున్న బాలికలు

భారతదేశంలో 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు వయసు పిల్లలకు 2022 జనవరి 3వ తేదీ నుంచి కోవిడ్ వ్యాక్సీన్లు ఇస్తామని.. వీరు జనవరి 1వ తేదీ నుంచి కోవిన్ (CoWIN) యాప్ ద్వారా లేదా వెబ్‌సైట్ ద్వారా కోవిడ్ వ్యాక్సీన్లకు స్లాట్లు బుక్ చేసుకోవచ్చునని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

15-18 ఏళ్ల వయసు లోపు పిల్లలకు కోవిడ్ టీకాలు ఇవ్వటం ద్వారా.. వారు తిరిగి మామూలుగా స్కూళ్లు, కాలేజీలకు వెళ్లటానికి వీలవుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఆరోగ్య కార్యకర్తలకు, 60 ఏళ్ల వయసు దాటిన వారికి బూస్టర్ డోస్ (మూడో డోసు) కూడా ఇస్తామని ప్రధానమంత్రి గత ఆదివారం నాడు ప్రకటించారు.

నిజానికి.. చిన్నారులకు కోవిడ్ టీకాలు ఇచ్చే విషయంలో అనేక యూరప్ దేశాలు, అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, న్యూజీలాండ్ తదితర దేశాల కన్నా భారతదేశం వెనుకబడి ఉంది.

భారత్‌లో కరోనావైరస్ డెల్టా వేరియంట్ సృష్టించిన విలయం అనంతరం ఇప్పుడు ఒమిక్రాన్ పంజా విసురుతుండటంతో దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ గురించిన ఆందోళనలు పెరుగుతున్నాయి. అదే సమయంలో కొంత కాలంగా స్కూళ్లలో కోవిడ్ కేసుల సంఖ్య కూడా ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. 15 నుంచి 18 ఏళ్ల మధ్య చిన్నారులకు కోవిడ్ టీకాలు ఇవ్వాలని పలు నిపుణుల కమిటీల సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ పరిస్థితుల్లో అసలు కోవిడ్ నుంచి పిల్లలకు ఉన్న ముప్పు ఎంత? నిపుణుల అధ్యయనాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తోంది? పిల్లలకు కోవిడ్ టీకా కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? చిన్నారులకు టీకా వేయించే ముందు, వేయించిన తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలేమిటి? అనేవి చూద్దాం.

1. పిల్లలకు కోవిడ్ నుంచి ఉన్న ముప్పు ఎంత?

వయోజనులతో పోలిస్తే.. చిన్నారులు, టీనేజర్లలో లక్షణాలు కనిపించే కోవిడ్ ఇన్ఫెక్షన్లు మొత్తంగా చాలా తక్కువగానే ఉన్నాయని.. కోవిడ్ తీవ్రమయ్యే అవకాశాలూ వారికి చాలా తక్కువేనని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నవంబర్ 24న విడుదల చేసిన ఒక సవివరమైన ప్రకటనలో చెప్పింది.

ఆ ప్రకటనలోని వివరాల ప్రకారం.. 2019 డిసెంబర్ 30 నుంచి 2021 అక్టోబర్ 25 వరకూ డబ్ల్యూహెచ్ఓకు నివేదించిన కోవిడ్ కేసుల్లో.. ప్రపంచం మొత్తం నమోదైన కేసుల్లో ఐదేళ్ల లోపు చిన్నారులు 2 శాతం మంది మాత్రమే ఉన్నారు. ప్రపంచం మొత్తం నమోదైన కోవిడ్ మరణాల్లో ఐదేళ్ల లోపు చిన్నారులు 0.1 శాతంగా ఉన్నారు.

పిల్లలు

అలాగే.. ప్రపంచం మొత్తం నమోదైన కేసుల్లో 5 నుంచి 14 ఏళ్ల వయస్సు లోపు పిల్లలు 7 శాతం మంది ఉన్నారు. ప్రపంచం మొత్తం నమోదైన కోవిడ్ మరణాల్లో వీరి సంఖ్య కూడా 0.1 శాతంగా ఉంది.

ఇక 14 ఏళ్ల నుంచి 24 ఏళ్ల వయస్సు లోపు టీనేజర్లు, యువత 15 శాతంగా ఉంటే.. కోవిడ్ మరణాల్లో ఈ వయస్సు వారు 0.4 శాతంగా ఉన్నారు.

అయితే.. ఈ వయస్సు వారికి కోవిడ్ సోకినా కూడా లక్షణాలు చాలా తక్కువగా ఉండటం, అసలు లక్షణాలే కనిపించకపోవటం వల్ల.. వీరికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించే అవకాశాలు, వైద్య చికిత్సకు వెళ్లే అవకాశాలు తక్కువగా ఉంటాయని పేర్కొంది. కాబట్టి అటువంటి కేసులు లెక్కలోకి రాకుండా ఉండొచ్చని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.

వయస్సుల వారీగా చూస్తే.. ఏడాది వయస్సు లోపు ఉన్నవారు.. వారికన్నా ఎక్కువ వయస్సున్న వారితో పోలిస్తే తీవ్ర కోవిడ్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెప్తున్నట్లు వివరించింది. అలాగే.. నవజాత (పుట్టిన తర్వాత 28 రోజుల లోపు) శిశువులకు ఇతర చిన్నారులతో పోలిస్తే కోవిడ్ తీవ్రత చాలా స్వల్పంగా ఉందని పేర్కొంది.

ఇదిలావుంటే.. ఐదేళ్ల లోపు చిన్నారులకు కోవిడ్ లక్షణాల్లో కొన్ని ఉండే న్యుమోనియా, ఇతర వైరల్ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వంటి పలు అనారోగ్యాల ముప్పు ఎక్కువగా ఉంటుందని.. వీటిని కోవిడ్‌ అని తప్పుగా వర్గీకరించే అవకాశం ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ చెప్పింది.

స్కూలు విద్యార్థినులు

2. పిల్లల నుంచి ఇతరులకు కోవిడ్ వ్యాపిస్తుందా?

భారతదేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ (డెల్టా వేరియంట్) తర్వాత 2021 జూన్-జూలై మధ్య నిర్వహించిన సెరోసర్వేలో.. 6 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సున్న పిల్లల్లో ఇతర వయోజనుల తరహాలోనే సెరోపాజిటివిటీ కనిపించినట్లు వెల్లడైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉటంకించింది.

ఆ సర్వే ప్రకారం.. స్కూళ్లు తెరిచినా కానీ, మూసివేసినా కానీ.. పిల్లల్లో ఇన్ఫెక్షన్ రేటు, పెద్దల్లో ఇన్‌ఫెక్షన్ రేటు ఒకే తరహాలో ఉందని ఆ సర్వే చెప్తున్నట్లు వివరించింది. అంటే.. అన్ని వయసుల చిన్న పిల్లలకు కూడా కోవిడ్ సోకవచ్చునని, వారి నుంచి ఈ వైరస్ ఇతరులకు వ్యాపించవచ్చునని తెలుస్తోందని చెప్పింది.

అయితే.. చిన్న పిల్లలతో పోలిస్తే టీనేజర్లకు కోవిడ్ సోకుతున్న రేటు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోందని చెప్పింది.

వ్యాక్సినేషన్

3. పిల్లల తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన అంశాలేమిటి?

నిపుణులు చెప్తున్న దాని ప్రకారం.. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది. కోవిడ్-19 సహా కొత్త వైరస్‌లకు దీటుగా స్పందించే సామర్థ్యం వారి నిరోధక వ్యవస్థకు ఉంటుంది.

గత ఏడాది కోవిడ్-19 వల్ల ఆస్పత్రుల్లో చేరిన 18 ఏళ్ల లోపు చిన్నారుల సంఖ్య అతి తక్కువగా ఉండటానికి.. అసలు కోవిడ్ స్ట్రెయిన్ విషయంలో పిల్లల్లో రోగనిరోధక శక్తి బలంగా ఉండటమే కారణం.

కానీ డెల్టా, ఒమిక్రాన్ వంటి మ్యూటెంట్ రకాలు.. పిల్లలకు చాలా ప్రమాదం కలిగించవచ్చు. ఈ వేరియంట్లు ఒకరి నుంచి ఒకరికి సోకే సామర్థ్యం, వాటి తీవ్రత అధికంగా ఉండటమే దీనికి కారణం.

కరోనావైరస్ నిరంతరం మ్యుటేట్ అవుతూ కొత్త వేరియంట్లు పుట్టుకువస్తున్నాయి. ఇవి.. మన రోగనిరోధక వ్యవస్థ అందించే రక్షణను తప్పించుకోగలిగేలా రూపొందుతున్నాయి.

పిల్లలకు ముందుగా.. ఒబేసిటీ, టైప్-2 డయాబెటిస్, ఆస్తమా, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు, న్యూరాలజీ, డౌన్ సిండ్రోమ్ వంటి న్యూరోడెవలప్‌మెంటల్, న్యూరోమస్క్యులర్ అనారోగ్యాలు ఉన్నట్లయితే.. వారికి కోవిడ్ సోకినపుడు అది తీవ్రమయ్యే అవకాశం ఉందని ఇటీవలి పలు అధ్యయనాలు చెప్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ వివరించింది.

వ్యాక్సినేషన్

4. పిల్లలకు టీకాలు వేయించే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి?

మీ పిల్లలకు ఏవైనా ఎలర్జీలు ఉన్నా, లేదా ఇతరత్రా తీవ్ర అనారోగ్యాలు ఉన్నా.. కోవిడ్ టీకా స్లాట్ బుక్ చేసే ముందుగా మీ వైద్యుడిని సంప్రదించండి.

టీకా ఇవ్వటానికి ముందు - నాన్-స్టెరాయిడల్ యాంటీ-ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇవ్వటం మంచిదని నిపుణులు సిఫారసు చేస్తున్నారు. నొప్పి నుంచి ఉపశమనం కలిగించటానికి, వాపును తగ్గించటానికి, అధిక జ్వరాన్ని తగ్గించటానికి ఈ మందులు ఇవ్వటం మంచిదని సూచిస్తున్నారు.

టీకా తీసుకోవటానికి వెళ్లే ముందు.. మీ చిన్నారి తగినంత నిద్రపోయే విధంగా, వ్యాయామం చేసే విధంగా, ఆరోగ్యమైన ఆహారం తీసుకునేలా చూడాలి. ఇవి చిన్నారిలో రోగనిరోధకశక్తిని పెంపొందించటానికి దోహదపడతాయి.

టీకా తీసుకున్న తర్వాత.. జ్వరం, చేతుల మీద వాపు, కండరాల నొప్పి వంటి తేలికపాటి సైడ్ ఎఫెక్ట్స్ సాధారణంగా ఉంటాయి. ఇవి.. టీకా పని చేస్తోందని చెప్పే సూచనలు.

ఒకవేళ మీ చిన్నారికి తీవ్రమైన అలర్జిక్ రియాక్షన్ కనిపించినట్లయితే, రెండు మూడు రోజుల తర్వాత కూడా జ్వరం తగ్గకపోతే వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి.

వైద్యుడిని సంప్రదించకుండా మీ చిన్నారికి పెయిన్ కిల్లర్స్ ఇవ్వకండి. ఉపశమనం కోసం ఎక్కువ నీరు తాగించండి. టీకా ఇంజక్ట్ చేసిన ప్రాంతంలో ఐస్ వంటి చల్లటి వాటితో ఒత్తుతూ ఉండండి.

కోవిడ్ వ్యాక్సీన్లు

5. భారతదేశంలో పిల్లలకు ఇచ్చే కోవిడ్ వ్యాక్సిన్ ఏమిటి?

జనవరి 3వ తేదీ నుంచి 15-18 ఏళ్ల మధ్య వయస్సు పిల్లలకు కోవిడ్-19 వ్యాక్సీన్ అందిస్తామని.. అయతే వారికి కేవలం 'కోవాగ్జిన్' మాత్రమే అందించటం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.

నిజానికి.. భారత్ బయోటెక్ తయారు చేసిన రెండు డోసుల కోవాక్జిన్‌తో పాటు.. జైడస్ కాడిలా తయారు చేసిన మూడు డోసుల జైకోవ్-డి - ఈ రెండు వ్యాక్సీన్లనూ భారతదేశంలో 12 ఏళ్ల వయసు పైబడిన చిన్నారులకు ఇవ్వవచ్చునని డ్రగ్ కంట్రోలర్ ఆమోదం తెలిపింది.

కానీ 15 నుంచి 18 ఏళ్ల వయస్సు పిల్లలకు అత్యవసర వినియోగం కోసం కేవలం కోవాగ్జిన్‌కు మాత్రమే ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి (ఈయూఎల్) ఉందని, కాబట్టి కోవాగ్జిన్ మాత్రమే ఈ పిల్లలకు ఇవ్వటం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది.

ఇదిలావుంటే.. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తయారుచేసిన నోవావాక్స్‌ను ఏడేళ్ల నుంచి 12 ఏళ్ల లోపు వయసు చిన్నారులకు ప్రయోగాత్మకంగా ఇవ్వటానికి డ్రగ్ కంట్రోలర్ అనుమతిచ్చింది. దీనితోపాటు.. 'బయోలాజికల్ ఇ' సంస్థ తయారు చేసిన కోర్బివాక్స్ టీకాను ఐదేళ్ల వయసు దాటిన చిన్నారులకు ప్రయోగాత్మకంగా ఇవ్వటానికి ఆమోదించింది.

నోవావాక్స్ కానీ, కోర్బివాక్స్ కానీ ఉపయోగించటానికి ఇంకా అనుమతి లభించలేదు.

ప్రధాని నరేంద్ర మోదీ

6. పిల్లలకు కోవిడ్ టీకాలపై కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలేమిటి?

దేశంలో 15-18 ఏళ్ల వయస్సు పిల్లలకు కోవిడ్ టీకాలు అందించటానికి సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది.

పదిహేను సంవత్సరాలు అంతకు మించిన వయసు వాళ్లందరూ కో-విన్ (Co-WIN) యాప్ ద్వారా కానీ, వెబ్‌సైట్ ద్వారా కానీ కోవిడ్ టీకా కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. అంటే.. 2007 సంవత్సరంలో కానీ, దానికి ముందు కానీ పుట్టిన వాళ్లందరూ కోవిడ్ టీకా తీసుకోవచ్చు.

Co-WINలో ఇప్పటికే ఉన్న అకౌంట్ ద్వారా కానీ, మొబైల్ నంబరుతో కొత్తగా అకౌంట్ క్రియేట్ చేయటం ద్వారా కానీ టీకా కోసం రిజస్టర్ చేసుకోవచ్చు. అర్హులైన భారత పౌరులందరికీ ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.

టీకా వేయించుకోవటానికి ఆన్‌లైన్ ద్వారా కానీ, ఆన్‌సైట్‌లో కానీ - అంటే నేరుగా టీకా కేంద్రాలకు వెళ్లి కానీ అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు.

వ్యాక్సీన్ స్లాట్లు బుక్ చేసుకోవటానికి.. ఆధార్ కానీ, ఇతర గుర్తింపు కార్డులు లేని పిల్లలు.. తమ స్కూలు లేదా కాలేజీ ఐడీ కార్డులు, స్కూలు సర్టిఫికెట్లతోనూ రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి అవకాశం కల్పించినట్లు కోవిన్ చీఫ్ డాక్టర్ ఆర్.ఎస్.శర్మ ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు. ప్రస్తుతం కొవిన్‌లో 9 గుర్తింపు కార్డులతో రిజిస్ట్రేషన్‌కు వీలుందని, ఇప్పుడు విద్యార్థుల స్కూలు, కాలేజీ ఐడీలనూ వాటికి జత చేశామని తెలిపారు.

7. Co-Win‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవటం ఎలా?

భారత పౌరులందరూ వారి ఆదాయ స్థాయీభేదాలతో సంబంధం లేకుండా ప్రభుత్వ టీకా కేంద్రాల్లో ఉచితంగా కోవిడ్ టీకా పొందవచ్చునని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ చెప్పింది.

అయితే.. ''చెల్లించగలిగే సామర్థ్యం ఉన్నవారు ప్రైవేటు ఆస్పత్రుల్లోని వాక్సినేషన్ సెంటర్లను (డబ్బు చెల్లించి) ఉపయోగించుకోవాలని ప్రోత్సహిస్తున్నాం'' అని పేర్కొంది.

  • కోవిడ్ వ్యాక్సీన్ కోసం Co-Win మొబైల్‌ యాప్‌ లేదా https://selfregistration.cowin.gov.in// పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.
  • ఒక ఫోన్‌ నంబర్‌పై నలుగురు టీకాల రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు (ఉదాహరణకు.. గతంలో తల్లిదండ్రులిద్దరూ కోవిన్‌ యాప్‌లో రిజిస్టరైన నంబరుతో వారి పిల్లల (15-18 ఏళ్ల మధ్య వారైతేనే) పేర్లు కూడా నమోదు చేసుకోవచ్చు).
  • యాప్‌ లేదా వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయ్యాక ఫోన్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి.. ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ రూపంలో వెరిఫికేషన్ ఓటీపీ వస్తుంది.. దానిని వెబ్‌సైట్‌లో అడిగిన చోట ఎంటర్ చేయాలి.
  • వెరిఫికేషన్‌ పూర్తయిన అనంతరం రిజిస్ట్రేషన్‌ పేజీ వస్తుంది. అందులో పేరు, పుట్టిన తేదీ తదితర వివరాలను నమోదు చేయాలి.
  • గుర్తింపు కార్డు కింద ఆధార్‌ను ఎంచుకోవాలి. ఆధార్‌ లేని పక్షంలో పదో తరగతి విద్యార్థి గుర్తింపు ఐడీ నంబరును నమోదు చేయవచ్చు.
కోవిడ్ వ్యాక్సీన్

ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులకు బూస్టర్ డోస్...

దేశ ప్రజలకు ఇప్పటివరకూ 141 కోట్లకు పైగా కోవిడ్ వ్యాక్సీన్ డోసులు అందించామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజాగా తెలిపింది. వయోజన జనాభాలో 90 శాతం మంది కనీసం ఒక డోసు తీసుకున్నారని.. 62 శాతం మంది రెండు డోసులూ తీసుకున్నారని వెల్లడించింది.

అయితే.. అత్యంత ముందు జాగ్రత్తలో భాగంగా.. కోవిడ్ మీద ముందుండి పోరాడుతున్న ఆరోగ్య రంగ కార్యకర్తలకు.. ఇప్పటికే అందించిన కోవిడ్ వ్యాక్సీన్ రెండు డోసులకు అదనంగా.. జనవరి 10వ తేదీ నుంచి మూడో డోసును కూడా అందిస్తామని చెప్పింది. రెండో డోసు తీసుకుని 9 నెలల పూర్తయిన తర్వాత - అంటే 39 వారాల తర్వాత ఈ మూడో డోసు అందించటం జరుగుతుందని తెలిపింది.

అలాగే.. 60 ఏళ్లు, ఆపైన వయసుండి ఇతర తీవ్ర వ్యాధులున్న వారికి.. రెండు డోసుల కోవిడ్ వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత.. వైద్యుల సలహా మేరకు మూడో డోసు కూడా అందిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీరికి కూడా రెండో డోసు తీసుకున్న 9 నెలల తర్వాత మూడో డోసు ఇవ్వటం జరుగుతుందని చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Covid 19 vaccine for children: What precautions should be taken before and after vaccination
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X