ఆక్సిజన్ లీక్... వార్డులో కమ్ముకుపోయిన గ్యాస్... బయటకు పరుగులు తీసిన కరోనా పేషెంట్లు
పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి పట్టణంలో ఉన్న మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఆక్సిజన్ లీక్ అయింది. కోవిడ్ పేషెంట్లు చికిత్స పొందుతున్న క్రిటికల్ కేర్ యూనిట్ మొత్తం ఆక్సిజన్‌తో కమ్ముకుపోయింది. దీంతో కరోనా పేషెంట్లు భయాందోళనకు గురయ్యారు. అగ్నిప్రమాదం సంభవించిందేమోనని భావించి బయటకు పరుగులు పెట్టారు.
శుక్రవారం(మే 21) ఉదయం 9.15గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. క్రిటికల్ కేర్ యూనిట్(సీసీయు)కి ఆక్సిజన్ సప్లై చేసే పైప్‌లో లోపాల కారణంగా గ్యాస్ బయటకు లీకైందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.సంజయ్ మాలిక్ తెలిపారు.ఆక్సిజన్ లీకైన సమయంలో వార్డులో ఏడుగురు పేషెంట్లు ఉన్నారని... వారందరినీ సురక్షితంగా మరో బ్లాక్‌లోకి తరలించామని చెప్పారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని,ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు.

వార్డులో ఆక్సిజన్ గ్యాస్ కమ్ముకుపోవడంతో బయటకు పరుగులు పెట్టామని పేషెంట్ల కుటుంబ సభ్యులు చెప్పారు. ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించి ఉండవచ్చునని భావించామన్నారు.
ఈ ఘటనపై ఆస్పత్రి యాజమాన్యం వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. దీంతో హుటాహుటిన రెండు ఫైరింజన్లు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయి.
ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా చాలాచోట్ల ఆక్సిజన్ లీకేజీ ఘటనలు చోటు చేసుకున్నాయి. గత నెలలో మహారాష్ట్రలోని నాసిక్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. జాకీర్ హుస్సేన్ మున్సిపల్ ఆస్పత్రి బయట ఉన్న ఆక్సిజన్ ట్యాంకర్ నుంచి గ్యాస్ లీకవడంతో.. దాదాపు 30 నిమిషాల పాటు ఆస్పత్రిలో ఆక్సిజన్ సప్లై నిలిచిపోయింది. దీంతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న 22 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. ట్యాంకర్‌లోకి ఆక్సిజన్ నింపుతుండగా గ్యాస్ లీకైందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది.












Click it and Unblock the Notifications