వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిడ్: ఆంధ్రప్రదేశ్‌లో క్రైస్తవులకు శ్మశానాల కొరత

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
క్రైస్తవ సమాధులు

కరోనా సమయంలో వేల మంది ప్రాణాలు పోతున్న నేపథ్యంలో శ్మశానాల్లో ఒత్తిడి పెరిగింది. కొన్ని సందర్భాల్లో క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మత విశ్వాసాల ఆధారంగా దహన సంస్కారాలు నిర్వహించే వారికే ఇలాంటి సమస్య ఏర్పడితే ఇక ఖననం చేసి, సమాధులు నిర్మించాలనుకునే వారికి అదనపు చిక్కులు తప్పడం లేదు.

కొందరైతే రోజుల తరబడి వేచి చూసి అష్టకష్టాల మీద అంత్యక్రియలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అనేక చోట్ల ఇలాంటి సమాధులకు స్థల సమస్య తీవ్రంగా ఉంది. నగరాల్లో అయితే మరీ ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సమస్య పరిష్కరించాలని క్రైస్తవ సంఘాలు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చి, నిరసనలు కూడా తెలిపాయి. పలు ప్రభుత్వాలు కూడా హామీలు ఇచ్చాయి.

ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవుల శ్మశానాలకు వందేళ్ల క్రితం ఉన్న స్థలాలు తప్ప అదనంగా కేటాయింపులు లేకపోవడంతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆ మత సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా సమస్యను అంగీకరిస్తూనే పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని అంటోంది.

గతంలో సమాధుల కోసం నిరసనలు చేసిన క్రైస్తవులు

చాలాకాలంగా సమస్య ఉంది

ఆంధ్రప్రదేశ్ లోని 15 కార్పోరేషన్లు, 76 మునిసిపాలిటీలు, 31 నగర పంచాయతీలున్నాయి. వాటిలో అత్యధిక ప్రాంతాల్లో ఈ సమస్య ఉంది. ముఖ్యంగా భూమి విలువ పెరిగిన చోట స్థలాల కొరత కారణంగా ఎక్కువగా కనిపిస్తోంది.

కోస్తా జిల్లాల్లో ఈ సమస్య కారణంగా క్రైస్తవులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. అందులోనూ విశాఖ, రాజమహేంద్రవరం , విజయవాడ, గుంటూరు సహా అన్ని ప్రధాన నగరాల్లో నిత్యం సమస్యను ఎదుర్కొంటున్నారు.

ఏపీలో 1.5 శాతం మంది మాత్రమే అధికారికంగా క్రైస్తవులుండగా వాస్తవంలో ఆ మత విశ్వాసుల సంఖ్య దానికి అనేక రెట్లు ఉంటుంది. సుమారుగా 12 నుంచి 15 శాతం మంది క్రైస్తవ ఆచారాలను పాటిస్తున్నారని అనధికార అంచనా. దాంతో వారందరికీ మత సంప్రదాయాలను అనుసరించి మరణించిన వారిని సమాధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

సమాజంలో ఒకప్పుడు స్వల్ప సంఖ్యలో ఉన్న వారికి కేటాయించిన స్థలాలు రానురాను ఆ మతాన్ని అనుసరించే వారి సంఖ్య పెరగడంతో ఏమాత్రం సరిపోవడం లేదని చెబుతున్నారు. చివరకు సమాధి చేసేందుకు స్థలం కోసం పెద్ద స్థాయిలో రికమండేషన్లు చేయించే పరిస్థితి కొన్ని చోట్ల వచ్చిందంటే తీవ్రత అర్థమవుతుంది.

క్రైస్తవ సమాధులు

బ్రిటిష్ హయంలో కేటాయించిన స్థలాలే...

క్రైస్తవుల సమాధుల కోసం బ్రిటిష్ వారి హయంలో సుమారు వందేళ్ల నాడు కేటాయించిన స్థలాలే తప్ప ఆ తర్వాత కొత్తగా ఇచ్చిన దాఖలాలు లేవు. దాంతో అనేక చోట్ల సమాధులతో నిండిపోయి వారు సతమతం అవుతున్నారు. కొన్ని సార్లు తమ బంధువుల సమాధులు తొలగించి కొత్తగా చనిపోయిన వారిని సమాధి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తోందని విజయవాడకు చెందిన ఎం విజయ్ పాల్ అన్నారు.

క్రైస్తవుల సమాధుల విషయంలో ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టడం లేదు. సమస్య తీవ్రంగా ఉంది. అందరికీ తెలుస్తూనే ఉంది. అయినా స్పందించడం లేదు. అర్బన్ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేయాలసిన అవసరం లేకుండా ఇటీవల ప్రభుత్వం ఇళ్ల స్థలాల పేరుతో వందల ఎకరాలను సేకరించింది. వాటిలో పేదల ఇళ్ల కోసం కేటాయించినవి పోగా మిగిలిన భూముల్లో కొంత భాగమైనా కేటాయిస్తే మేలు జరుగుతుంది.

నగర పరిధిలోనే కాకుండా సమీప గ్రామాల్లో తక్కువ విలువ ఉన్న స్థలాలు ఇచ్చినా కొంత ఉపశమనం దక్కుతుంది. లేదంటే ఇప్పుడు కరోనా లాంటి విపత్తులు వచ్చినప్పుడు ఊపిరిసలపడం లేదు. ఇంట్లో శవాన్ని పెట్టుకుని రోజంతా ఎదురుచూసినా స్థలం లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో కొందరు ఉంటున్నారు అంటూ వివరించారు.

గతంలో సమాధుల కోసం నిరాహారదీక్షలు చేసిన క్రైస్తవులు

మా నాన్న అంత్యక్రియల కోసం పడిన అవస్థలు అన్నీ ఇన్నీ కావు...

"మా నాన్నగారు చనిపోయినప్పుడు సమాధికి ఖాళీ లేదని చెప్పారు. రోజంతా తిరిగాం. ఎక్కడికి వెళ్లినా మృతదేహాన్ని తీసుకురావడానికి అంగీకరించలేదు. మా నాన్న పాస్టర్‌ గా పనిచేశారు. పాస్టర్ కే ఇంత సమస్య ఉంటే మా లాంటి వారి పరిస్థితి ఏమిటని చర్చికి వచ్చే వారంతా ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చింది. చాలా చోట్లా ఇలాంటి సమస్య ఉంది. ప్రభుత్వం కొత్తగా స్థలాలు మంజూరు చేస్తేనే మేలు జరుగుతుంది. అప్పటి వరకూ మా పరిస్థితి ప్రశ్నార్థకమే" అంటున్నారు రాజమహేంద్రవరం నగరానికి చెందిన డేవిడ్ రాజు.

డేవిడ్ రాజు మాత్రమే కాకుండా ఇటీవల అదే నగరంలో ఓ రాజకీయ నాయకుడు తండ్రి చనిపోయిన సమయంలో క్రైస్తవ మతాచారం ప్రకారం ఖననం చేయమని కోరడంతో క్రైస్తవులు కాని వారి కుటుంబం అనేక అవస్థలు పడాల్సి వచ్చిందని బహిరంగంగానే వాపోవాల్సి వచ్చింది.

అందరూ అంగీకరించారు. కానీ ఎవరూ తీర్చలేదు..

క్రైస్తవుల సమాధుల కోసం అదనపు స్థలాలు కేటాయించాలని కోరుతూ చాలాకాలంగా పలు సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. మాజీ ఎంపీ హర్షకుమార్ వంటి వారు నిరాహారదీక్షలు కూడా చేశారు. క్రైస్తవ సంఘాలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి వరుసగా అందరి ముఖ్యమంత్రులను కలిసి విన్నవించారు. వివిధ సందర్భాల్లో బహిరంగ కార్యక్రమాల్లోనే వారిని నిలదీశారు. అయినప్పటికీ సమస్యకు మాత్రం మోక్షం కలగడం లేదని వాపోతున్నారు.

"మండల కేంద్రాల్లో కొన్ని చోట్ల కనీసం కూడా స్థలాలు కేటాయించలేదు. అక్కడ కూడా సమస్య ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న సమాధుల ప్రాంతాలన్నీ నిండిపోయాయి. ఈ సమస్యను అనేక మంది నేతల దృష్టికి తీసుకెళ్ళాం. అందరూ సానుకూలంగా స్పందించారు. సమస్య తీరుస్తామని చెప్పారు. ముఖ్యమంత్రుల నుంచి అన్ని స్థాయిల్లోనూ అధికారులు, నేతలను కలుస్తూనే ఉన్నాం. స్పందన బాగుంటుంది. కానీ కొత్తగా సమాధి స్థలం కేటాయించడంలో ఉదారంగా వ్యవహరించడం లేదు. కొన్ని చోట్ల స్థలాలు లేకపోవడంతో చివరకు ఎంతో ప్రయత్నించిన తర్వాత దహనం చేసేస్తున్న వారు కూడా ఉన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కేటాయిస్తున్నట్టుగానే క్రైస్తవుల సమాధుల సమస్యను పరిష్కరించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం అంటూ ఏపీ ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు బిషప్ కే ప్రతాప్ సిన్హా అభిప్రాయపడ్డారు.

క్రైస్తవ సమాధులు

ఆధునిక పద్ధతిలో ఆలోచిస్తూ, తక్కువ స్థలంలో సమాధి చేసుకోవాలి...

"మారుతున్న కాలానికి అనుగుణంగా సమాధుల కోసం వినియోగిస్తున్న స్థలాలు కూడా పరిమితం చేయాలి. తక్కువ స్థలంలోనే సమాధి చేసేలా క్రైస్తవులు అంతా ఆలోచించాలి. దానికి అనుగుణంగా ప్రభుత్వాలు స్థలాలు మంజూరు చేయాలి" అని ఆంద్రా ఇవలాంజికల్ యూత్ డైరెక్టర్ రెవరెండు గునుపల్లి సతీష్ బాబు కోరారు.

"సుదీర్ఘకాలంగా సమాధుల కోసం స్థలాల కేటాయించకపోవడం వల్ల ఎదురవుతున్న సమస్యలను గమనంలో ఉంచుకోవాలి. లూథరన్ మిషనరీలకు వందేళ్ల క్రితం కేటాయించిన స్థలాలన్నీ నిండిపోయాయి. ఈ సమస్య కారణంగా మానసిక క్షోభ అనుభవించాల్సి వస్తోంది".

"రాష్ట్రమంతా ఇదే పరిస్థితి. ఉద్యమాలు కూడా చేశాం. వైఎస్సార్ హయంలో జీవో ఇచ్చారు. కానీ స్థలాలు ఇవ్వలేదు. పట్టణాలకు దూరంగా ప్రభుత్వ నిరుపయోగ స్థలాలు కేటాయించినా అభ్యంంతరం ఉండదని ప్రభుత్వం చెప్పింది".

"ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అన్ని మతాల వారికి శ్మశానాల కోసం వైఎస్సార్ ప్రభుత్వం అక్టోబర్ 2008లో జీవో నెం. 1235 ని విడుదల చేసింది. వాటి ప్రకారం అన్ని ప్రాంతాల్లోనూ భూమి కొనుగోలు చేసి శ్మశానాలకు కేటాయించాలని ఉంది" అని సతీష్ బాబు చెప్పారు.

సమస్య పరిష్కరిస్తాం

క్రైస్తవుల సమాధుల సమస్య ఉందని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు.

"సమస్యను ప్రభుత్వం గుర్తించింది. పరిష్కారానికి ప్రయత్నిస్తున్నాం. రెవెన్యూ, మైనార్టీ సంక్షేమం శాఖ అధికారులతో సంప్రదించి ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తాం. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అన్ని చోట్లా సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకుని చర్యలుంటాయి. మా ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంది" అని వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Covid19: There is a shortage of cemeteries for Christians in Andhra Pradesh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X