స్మగ్లింగ్: ఎయిర్‌పోర్టులో 40కిలోల బంగారం సీజ్
చెన్నై: బంగారం అక్రమ రవాణాకు స్మగ్లర్లు ఎక్కువగా దక్షిణాది విమానాశ్రయాలనే ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్, చెన్నై, మధురై, కేరళ, కర్ణాటకల్లోని విమానాశ్రయల ద్వారా స్మగ్లర్లు తమ అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని హైదరాబాద్ విమానాశ్రయంలో తరచూ పట్టుకుంటున్న విషయం తెలిసిందే.
తాజాగా, తమిళనాడులోని మదురై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాత్రి రెండు విమానాలు అప్పుడే దిగాయి. శ్రీలంక నుంచి సింగపూర్, బ్యాంకాక్ మీదుగా భారత్ వచ్చే మిహిన్ లంక విమానం, మరోటి దుబాయ్ నుంచి వచ్చిన స్పైస్‌జెట్ విమానం.
ఆ రెండు విమానాల్లో ఏకంగా 40 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. అక్షరాల పది కోట్ల రూపాయల పైచిలుకు విలువ. కాగా, దీనిపై రహస్య సమాచారం అందుకున్న కస్టమ్స్ అధికారులు ప్రయాణికుల లగేజీని తనిఖీ చేశారు.

మిహిన్ లంక విమానంలో.. ఓ సీటు కింద ఉంచిన బ్యాగులో 33 కిలోల బంగారం. ఆ తర్వాత దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికులను తనిఖీ చేశారు. అంతే వారి దగ్గరా మరో 7 కిలోల బంగారం లభించింది.
ఉంగరాలు, చైన్లు, గోల్డ్ బార్లు, బిస్కెట్‌లు, బంగారు ‘చాక్లెట్లు'.. తోచిన రూపాల్లో తెచ్చేశారు. వాటి విలువ రూ.10 కోట్ల పైగానే ఉంటుంది. గట్టి నిఘా పెట్టిన అధికారులు ఆ అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఆ పసిడిని సీజ్ చేసింది. పదిమందిని విచారించిన అధికారులు ముగ్గురిపై కేసు పెట్టి అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications