ఓఖీ తుఫాను బీభత్సం: లక్షద్వీప్ కకావికలం, కన్యాకుమారిలో నీళ్లు

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్షద్వీప్/చెన్నై/తిరువనంతపురం: అరేబియా సముద్రంలో ఏర్పడి ఓఖి తుఫాను ఆదివారం నుంచి బలహీనపడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. లక్షద్వీప్‌ ప్రాంతంపై కేంద్రీకృతమై ఉన్న ఈ తుపాను వాయువ్య దిశగా గంటకు 15 కి.మీ. వేగంతో కదులుతూ మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్‌ వైపు దిశ మార్చుకుంటోందని చెప్పారు.

ఓఖి ప్రభావంతో కేరళలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తిరువనంతపురం, కొల్లామ్‌, ఎర్నాకులం, త్రిసూర్‌, మలపురం జిల్లాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి వేలాది నిరాశ్రయులను తరలించారు. లక్షద్వీప్‌లో తుపాను బీభత్సం సృష్టించింది. వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి.

 కేరళలో మత్స్యకారుల గల్లంతు

కేరళలో మత్స్యకారుల గల్లంతు

కేరళలో గల్లంతైన 117 మంది మత్స్యకారుల ఆచూకీ ఇంకా తెలియడం లేదని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కోస్ట్‌ గార్డు అధికారులు తెలిపారు. కేరళవ్యాప్తంగా వందలాది మంది మత్స్యకారులను రక్షించినట్లు సీఎం పినరయి విజయన్‌ తెలిపారు. భారత నేవీ, వైమానిక, కోస్ట్‌ గార్డు సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మరోవైపు ఈ తుపాను బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని పినరయి విజయన్‌ కేంద్రాన్ని కోరారు.

 నేలకూలిన ఇళ్లు, చెట్లు

నేలకూలిన ఇళ్లు, చెట్లు

ఓఖి తుపాను ప్రభావంతో తమిళనాడులోని కన్యాకుమారి, తిరునల్వేలి, విరుద్‌నగర్‌, తూత్తుకుడి జిల్లాలు అతాలాకుతలమయ్యాయి. ఈ ప్రాంతాల్లో వేలాది చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకు ఒరిగాయి. కన్యాకుమారి జిల్లాలోనే వేల సంఖ్యలో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలాయి.

 కుదిపేసిన ఓఖీ

కుదిపేసిన ఓఖీ

తమిళనాడులోని పలు జిల్లాలను ఓఖి కుదిపేసింది. కన్యాకుమారి జిల్లా ఇంకా ఓఖీ ప్రభావం నుంచి తేరుకోలేదు. నాలుగు రోజులుగా అంధకారంలో మునిగిపోవడంతో పాటు, నీళ్లతో నిండిపోయింది. భారీసంఖ్యలో వృక్షాలు రోడ్డుకు అడ్డంగా కూలిపోవడం, వరద ఉద్ధృతికి రోడ్లు తీవ్రంగా దెబ్బతినడం, పలు చోట్ల కాజ్‌వేలు, వంతెనలు ధ్వంసం కావడంతో పాటు నివాస ప్రాంతాలను వరదనీరు ముంచెత్తాయి.

 పలు రైళ్లు బంద్

పలు రైళ్లు బంద్

పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వెల్లింగ్టన్‌ - అరువంగాడు రైల్వేస్టేషన్ల మధ్య కూడా కొండచరియలు, చెట్లు విరిగి పట్టాలపై పడ్డాయి. కేతి-అరువంగాడు రైల్వే స్టేషన్లకు మధ్య కొండచరియలు విరిగిపడటంతో ఊటీ నుంచి కున్నూరుకు బయలుదేరిన కొండరైలును కేతి రైల్వేస్టేషన్లో నిలిపివేశారు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కున్నూర్‌-మేట్టుపాళెయం మధ్య శుక్రవారం సాయంత్రం రైలుసేవలు రద్దు చేయగా, శనివారం మేట్టుపాళెయం-టీ కొండ రైలును రద్దు చేశారు. కొడైకానల్‌ కొండమార్గంలో పలు చోట్ల కొండచరియలు విరిగిపడటంతో రవాణావ్యవస్థ దెబ్బతింది.

 తీర ప్రాంతం కోత

తీర ప్రాంతం కోత

సముద్రపు అలల తాకిడికి తీరప్రాంతం కోతకు గురికావడంతో మత్స్యకారులు సముద్రంలోకి దిగి ఆందోళన చేశారు. పుదుచ్చేరి సరిహద్దులోని తమిళనాడు ప్రాంతమైన బొమ్మైయార్‌పాళెయంలో సునామీ గృహసముదాయాలు నిర్మించి అందులో మత్స్యకారులకు ఇళ్లు కేటాయించారు. అయినప్పటికీ బొమ్మైయార్‌పాళెయంలోని మత్స్యకారుల గ్రామంలో కొద్దిమంది నివసిస్తున్నారు. ఈ ప్రాంతం తీరానికి చాలా దగ్గరగా ఉండటంతో అలల ఉద్ధృతి పెరిగినప్పుడల్లా తీరం కోతకు గురవుతోంది. పలు ఇళ్లు కూలిపోయాయి. ఇదే పరిస్థితి పెరియ ముదలియార్‌చావడి, నడుకుప్పం, తంద్రిరాయకుప్పం, చిన్న ముదలియార్‌ చావడి తదితర ప్రాంతాల్లోని మత్స్యకారుల గ్రామాల్లోనూ ఏర్పడింది. సముద్రపు తీరం కోతకు గురికావడాన్ని అడ్డుకునే విధంగా శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ శుక్రవారం సాయంత్రం బొమ్మైయార్‌పాళెయం మత్స్యకారులు సముద్రంలో దిగి మానవహారం చేపట్టారు. విషయం తెలిసి అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి హామీ ఇచ్చారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Cyclone Ockhi: Rains hit Lakshadweep islands, damage houses, uproot trees

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి