బంగాళాఖాతంలో సూపర్ సైక్లోన్: ఎయిర్‌పోర్ట్ మూత: తీరం అల్లకల్లోలం
Cyclone Remal: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ బెంగాల్‌ను వణికిస్తోంది. దీని ప్రభావంతో అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. కోల్‌కత సహా తీర ప్రాంత జిల్లాల్లో శనివారం రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బలమైన ఈదురుగాలులు దీనికి తోడయ్యాయి.
బంగాళాఖాతం నైరుతి, పశ్చిమ- మధ్య ప్రాంతంలో ఈ నెల 23వ తేదీన ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయుగుండంగా మారింది. క్రమంగా తుఫాన్‌గా ఆవిర్భవించింది. దీనికి రెమాల్ అని పేరు పెట్టారు. ఈ తుఫాన్ ఈ మధ్యాహ్నానికి మరింత ఉధృత రూపాన్ని సంతరించుకుంటుందని కోల్‌కతలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.

దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. జగత్‌సింగ్‌పుర, కేంద్రపారా, భద్రక్, బాలాసోర్, మయూర్‌భంజ్, జాజ్‌పూర్.. వంటి జిల్లాలపై తుఫాన్ ప్రభావం పడింది. పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణా, ఉత్తర 24 పరగణా, సౌత్ మేదినిపూర్, నార్త్ మేదినిపూర్, హౌరా, హుగ్లీ జిల్లాలు సహా కోల్‌కతలో ఏకధాటిగా వర్షాలు ముంచెత్తుతున్నాయి.
బలమైన ఈదురుగాలులు వణికిస్తోన్నాయి. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. తీరం అల్లకల్లోలంగా మారింది. ముందుజాగ్రత్త చర్యగా మత్స్యకార గ్రామాలను ఖాళీ చేయించారు అధికారులు. జాతీయ, రాష్ట్రీయ విపత్తు నిర్వహణ బలగాలను మోహరింపజేశారు. తీర ప్రాంతాలను మూసివేశారు. మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లకూడదంటూ ఆదేశాలు ఇచ్చారు.
ఈ రాత్రి లేదా సోమవారం తెల్లవారు జామున రెమాల్ తుఫాన్ తీరం దాటొచ్చని వాతావరణం కేంద్రం తెలిపింది. పశ్చిమ బెంగాల్- బంగ్లాదేశ్ మధ్య తీరం దాటుతుందని పేర్కొంది. ఆ సమయంలో 140 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. అత్యవసర పరిస్థితులు తప్ప ప్రజలెవరూ బయటికి రావొద్దని సూచించింది.
తుఫాన్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కోల్‌కతలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేయనున్నారు అధికారులు. ఈ మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఎయిర్‌పోర్ట్ మూత పడనుంది. సోమవారం ఉదయం 9 గంటలకు దీన్ని పునరుద్ధరిస్తారు. అప్పటివరకు విమానాల రాకపోకలన్నీ స్తంభించిపోనున్నాయి. కోల్‌కత శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఓడరేవు కూడా మూతపడనుంది.












Click it and Unblock the Notifications