హైఅలర్ట్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
Cyclone Remal: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ బెంగాల్‌ను వణికిస్తోంది. దీని ప్రభావంతో అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. కోల్‌కత సహా తీర ప్రాంత జిల్లాల్లో శనివారం రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బలమైన ఈదురుగాలులు దీనికి తోడయ్యాయి.
బంగాళాఖాతం నైరుతి, పశ్చిమ- మధ్య ప్రాంతంలో ఈ నెల 23వ తేదీన ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయుగుండంగా మారింది. క్రమంగా తుఫాన్‌గా ఆవిర్భవించింది. దీనికి రెమాల్ అని పేరు పెట్టారు. ఈ తుఫాన్ ఈ మధ్యాహ్నానికి మరింత ఉధృత రూపాన్ని సంతరించుకుంటుందని కోల్‌కతలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.

దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. జగత్‌సింగ్‌పుర, కేంద్రపారా, భద్రక్, బాలాసోర్, మయూర్‌భంజ్, జాజ్‌పూర్.. వంటి జిల్లాలపై తుఫాన్ ప్రభావం పడింది. పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణా, ఉత్తర 24 పరగణా, సౌత్ మేదినిపూర్, నార్త్ మేదినిపూర్, హౌరా, హుగ్లీ జిల్లాలు సహా కోల్‌కతలో ఏకధాటిగా వర్షాలు ముంచెత్తుతున్నాయి.
ఈ ఉదయం 8:30 గంటల సమయానికి రెమాల్ తుఫాన్.. బంగ్లాదేశ్‌లోని ఖేపురారకు నైరుతి దిశగా బంగాళాఖాతంలో 260, మోంగ్లాకు 310, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ఐలాండ్స్‌కు 240, కెన్నింగ్ ప్రాంతానికి 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై కనిపించింది. గంటకు ఏడు కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతోంది.
ఈ తుఫాన్ తీరానికి సమీపిస్తోన్న కొద్దీ బలమైన ఈదురుగాలులు వణికిస్తోన్నాయి. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. తీరం అల్లకల్లోలంగా మారింది. ముందుజాగ్రత్త చర్యగా మత్స్యకార గ్రామాలను ఖాళీ చేయించారు అధికారులు. జాతీయ, రాష్ట్రీయ విపత్తు నిర్వహణ బలగాలను మోహరింపజేశారు. తీర ప్రాంతాలను మూసివేశారు. మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లకూడదంటూ ఆదేశాలు ఇచ్చారు. ఈ రాత్రి లేదా అర్ధరాత్రి దాటిన తరువాత ఈ తుఫాన్ తీరాన్ని తాకే అవకాశం ఉంది.
ఈ పరిణామాలపై కేంద్రం ఆరా తీస్తోంది. ఎప్పటికప్పుడు తుఫాన్ ప్రభావానికి గురయ్యే రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. తుఫాన్ కదలికలు, తీరం దాటే సమయంలో, ఆ తరువాతా సంభవించే పరిణామాలపై సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటోంది. ప్రాణనష్టాన్ని నివారించడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రాలను సూచించింది.
కేంద్ర ఎర్త్ సైన్సెస్ శాఖ మంత్రి కిరణ్ రిజిజు.. స్పందించారు. రెమాల్ తుఫాన్ పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ఐలాండ్స్, బంగ్లాదేశ్‌లోని ఖేపురార, మోగా మధ్య తీరాన్ని దాటుతుందని వెల్లడించారు. ఆ సమయంలో గంటకు 135 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అన్నారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తోన్నాయని తెలిపారు.












Click it and Unblock the Notifications