‘నాయనమ్మ అయిపోయా’: స్పీకర్ సుమిత్రా మహాజన్
న్యూఢిల్లీ: తాను ఇప్పుడు నాయనమ్మను అయిపోయానంటూ లోకసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన సుమిత్రా మహాజన్ వ్యాఖ్యానించారు. ఐఎన్ఎల్‌డి సభ్యుడు దుష్యంత్ చౌతాలాతో ఆమె శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్త సభ్యులందరిలోకి అత్యంత పిన్న వయస్కుడైన దుష్యంత్(26).. సీనియర్ ఎంపి అయిన సుమిత్రా మహాజన్(71)ను లోకసభలో మాట్లాడుతూ అభినందనలు తెలిపారు.
చౌతాలా మాట్లాడుతూ.. ‘మీరు మా ముత్తాత చౌదరి దేవీలాల్‌తోనూ, తాతయ్య ఓం ప్రకాష్ చౌతాలాతోనూ, నాన్న అజయ్ చౌతాలాతో కూడా కలిసి ఎంపిగా పని చేశారు. ఇప్పుడు అత్యున్నత పదవికి ఎంపికయ్యారు. మీ మార్గదర్శకత్వంలో నేను నడుస్తా' అని దుష్యంత్ అన్నారు.

తనలాగే మొదటిసారి ఎన్నికైన సభ్యులకు ఎక్కువ సమయం ఇస్తారని ఆశిస్తున్నట్లు ధుష్యంత్.. ఆమెతో అన్నారు. దుష్యంత్ వ్యాఖ్యలపై స్పందించిన సుమిత్రా మహాజన్.. తాను ఇప్పుడు నాయనమ్మను అయ్యానంటూ ఛమత్కరించారు.
కాగా, శుక్రవారం వేర్వేరు పార్టీలకు చెందిన ఇద్దరు భార్యాభర్తలు ఎంపీలుగా లోకసభలో ప్రమాణం చేశారు. రాజేష్ రాజన్ అలియాస్ పప్పు యాదవ్(ఆర్జెడి), ఆయన భార్య రంజితా రాజన్ (కాంగ్రెస్) శుక్రవారం ఎంపీలుగా ప్రమాణం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి చిత్తూరు ఎంపి ఎన్ శివప్రసాద్, తెలంగాణ నుంచి జహీరాబాద్ ఎంపి బీబీ పాటిల్(టిఆర్ఎస్)లు శుక్రవారం ఎంపీలుగా ప్రమాణం చేశారు.












Click it and Unblock the Notifications