పురందేశ్వరి లేదా నిర్మలా సీతారామన్ కు బీజేపీ పగ్గాలు ? ఢిల్లీలో కీలక చర్చలు..!
ఏపీలో నిన్న మొన్నటి వరకూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన సీనియర్ నేత దగ్గుబాటి పురందేశ్వరికి జాతీయ స్ధాయిలో కీలక పదవి దక్కబోతోందా ? రాష్ట్ర అధ్యక్షురాలి పదవి వదులుకున్న ఈ రాజమండ్రి ఎంపీకి ఇప్పుడు జాతీయ స్ధాయిలో పార్టీ పగ్గాలు అప్పగించేందుకు పావులు కదుపుతున్నారా ? ఆమెతో పాటు మరో కీలక నేత, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు మరికొందరు నేతలు ఆమెతో పోటీ పడుతున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా పదవీకాలం ఎప్పుడో ముగిసినా పొడిగిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో ఈ అత్యున్నత పదవికి అభ్యర్ధిని ఎంపిక చేసేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఈసారి మహిళా నేతలకు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి కట్టబెడితే ఎలా ఉంటుందన్న చర్చ జరుగుతోంది. దీని కోసం పార్టీలో ఉన్న సీనియర్ మహిళా నేతల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులోనూ ఏపీకి చెందిన దగ్గుబాటి పురందేశ్వరి పోటీలో ముందున్నారు.

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి తాజాగా గతేడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రాజమండ్రి నుంచి ఎంపీగా కూడా గెలిచారు. దీంతో ఆమెను కేంద్ర మంత్రిగా కూడా తీసుకుంటారని ప్రచారం జరిగింది. అయితే మోడీ, అమిత్ షా మదిలో పురందేశ్వరి విషయంలో ఇతరత్రా ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో ఆమె నిర్వహిస్తున్న అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. అయితే అంతకంటే పెద్ద పదవి ఇచ్చే ఆలోచనతోనే పురందేశ్వరిని తప్పించినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి ఈసారి మహిళను ఎంపిక చేసే అవకాశం ఉండటంతో దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు తమిళనాడుకు చెందిన నిర్మలా సీతారామన్, వానతీ శ్రీనివాసన్ ల పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. పురంధేశ్వరితో పోలిస్తే బీజేపీలోనే పుట్టిపెరిగిన నిర్మలా సీతారామన్ పట్ల మోడీ-షా మొగ్గు చూపుతున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది. అయితే నిర్మలా సీతారామన్ బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి చేపట్టేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే ఆమె గత ఎన్నికల్లో తమిళనాడు నుంచి ఎంపీగా పోటీ చేసేందుకే ఆసక్తి చూపలేదు. అయితే నిర్మలా సీతారామన్ కు పగ్గాలు అప్పగిస్తే వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అది తమకు పనికొస్తుందని బీజేపీ భావిస్తోంది.

బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి మహిళా నేతను ఎంచుకోవాలన్న నిర్ణయానికి ఆరెస్సెస్ కూడా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. తాజాగా ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా కూడా మహిళల్ని ఎంచుకుంటున్న వేళ బీజేపీ పగ్గాలు కూడా మహిళకు అప్పగిస్తే పార్టీకి కూడా సానుకూలంగా మారుతుందన్న అంచనాలున్నాయి. దీంతో త్వరలోనే ఈ ముగ్గురిలో ఒకరికి పగ్గాలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications