దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు: 4 నెలల్లో అత్యధిక కేసులు నమోదు
దేశంలో మరోసారి కరోనా వైరస్ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో 800 కరోనా కేసులు నమోదయ్యాయి.
న్యూఢిల్లీ: దేశంలో మరోసారి కరోనా వైరస్ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో 800 కరోనా కేసులు నమోదయ్యాయి. గత నాలుగు నెలల తర్వాత అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 5389కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 4.46 కోట్లకు చేరింది.
జార్ఖండ్, మహారాష్ట్రలో ఒక్కరు చొప్పున కరోనా బారిన పడి మరణించగా.. కేరళ రాష్ట్రంలో ఇద్దరు మృతి చెందారు. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో అత్యధిక వైరల్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదైనట్లు గణాంకాలు పేర్కొన్నాయి.

భారతదేశంలో రోజువారీ సగటు కొత్త కోవిడ్ కేసులు నెలలో ఆరు రెట్లు పెరిగాయి. ఒక నెల క్రితం (ఫిబ్రవరి 18) సగటు రోజువారీ కొత్త కేసులు 112 కాగా, ఇప్పుడు (మార్చి 18) 626కి పెరిగాయి. యాక్టివ్ కేసులు ఇప్పుడు మొత్తం ఇన్ఫెక్షన్‌లలో 0.01 శాతం ఉన్నాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం.. జాతీయ COVID-19 రికవరీ రేటు 98.80 శాతంగా నమోదైంది.
వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,58,161కి పెరిగింది. కరోనా కేసు మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద 220.64 కోట్ల డోస్‌ల COVID-19 వ్యాక్సిన్ పంపిణీ చేశారు. ఆకస్మికంగా పెరుగుతున్న వైరల్ ఇన్‌ఫెక్షన్‌ను నియంత్రించడంపై దృష్టి పెట్టాలని కేంద్రం ఆరు రాష్ట్రాలకు లేఖ రాసింది.
కేంద్ర ఆరోగ్య కార్యదర్శి బుధవారం మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటకకు.. పరీక్షలు, చికిత్స, ట్రాకింగ్, టీకాల పంపిణీ పెంచాలని సూచించింది. కరోనా కేసుల కట్టడికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications