• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దళిత్ పాంథర్: ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం ఎందుకు ముక్కలైంది, దళితుల పోరాటాల్లో దాని పాత్ర ఏంటి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

దళితులపై అఘాయిత్యాలు జరిగినప్పుడు తీవ్రంగా స్పందించడం, దెబ్బకు దెబ్బ తీయడమే లక్ష్యంగా ఏర్పడింది దళిత్ పాంథర్ మూవ్‌మెంట్. ఈ ఉద్యమం పుట్టి ఈ ఏడాదితో 50 ఏళ్లు నిండుతాయి.

48 సంవత్సరాల కిందట అంటే జనవరి 10, 1974న దళిత పాంథర్ ఫ్రంట్‌ ర్యాలీపై కొందరు దుండగులు రాళ్లు విసరడంతో భగవత్ జాదవ్ అనే ఉద్యమకారుడు మరణించారు.

భగవత్ జాదవ్ స్మారక దినం సందర్భంగా భారతదేశ సామాజిక చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దళిత్ పాంథర్ మూవ్‌మెంట్‌ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1972లో ఏర్పడిన దళిత్ పాంథర్‌కు నేపథ్యం తెలుసుకోవాలంటే అంతకు ముందు 16 ఏళ్లలో జరిగిన సంఘటనలను కూడా పరిశీలించాలి. 1956 నుండి 1972 వరకు జరిగిన పరిణామాలను అర్ధం చేసుకుంటే అసలు ఈ ఉద్యమం ఎందుకు మొదలైందో తెలుస్తుంది.

1956 డిసెంబర్ 6న భారతరత్న డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ కన్నుమూశారు. ఆయన మరణించిన పది నెలల తర్వాత అక్టోబర్ 3, 1957న, అంబేడ్కర్‌ స్థాపించిన షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్‌ను రద్దు చేసి రిపబ్లికన్ పార్టీని స్థాపించారు.

కొత్త పార్టీకి ఎన్. శివరాజ్ అధ్యక్షుడయ్యారు. అయితే ఈ పార్టీలో భయ్యాసాహెబ్ అంబేద్కర్, దాదాసాహెబ్ గైక్వాడ్, దాదాసాహెబ్ రూప్‌వతే, బీసీ కాంబ్లే మొదలైన నేతలు బాబాసాహెబ్‌తో కలిసి పని చేసినవారు. వీరంతా ఒక వర్గంగా ఉండేవారు.

ఏడాదిలోపే రిపబ్లికన్ పార్టీ 1958 అక్టోబర్ 3న రెండు వర్గాలుగా చీలిపోయింది.

దళిత ఉద్యమాలకు అంబేడ్కరే స్ఫూర్తి ప్రదాత

రిపబ్లికన్ పార్టీ పతనానికి తొలి అడుగులు

రిపబ్లికన్ పార్టీ లక్ష్యాలు, విధానాలు రూపొందించలేదంటూ బీసీ కాంబ్లేతోపాటు దాదాసాహెబ్ రూప్‌వతే, మరికొందరు నాయకులు బయటకు వచ్చారు. అలా రెండుగా చీలిన పార్టీ తర్వాత నాలుగైంది. ఆ తర్వాత ఐదుగా చీలిపోయింది.

ఇవికాక ఇంకా రిపబ్లికన్ పార్టీలో చాలా గ్రూపులు ఉన్నాయి. కొన్నాళ్ల తర్వాత కొందరు నేతలు కాంగ్రెస్‌లో చేరిపోయారు. మరికొందరు కమ్యూనిస్టులతో కలిశారు. ఈ వరస ఘటనలతో దళిత సంఘాలు నిరాశకు గురయ్యాయి.

అది స్వతంత్రం వచ్చిన తర్వాతి దశాబ్ధం. కొత్త వ్యవస్థ దళితులను చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. కొన్నిచోట్ల రాజ్యాంగం కల్పించిన హక్కులు దళితులకు చేరుకోలేదు, చేరుకోనివ్వలేదు. పైగా దళితులపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి.

బాబాసాహెబ్ లేకపోవడంతో తాము అనాథలుగా మారినట్లు దళిత సమాజం భావించడం మొదలు పెట్టింది.

ఇదే సమయంలో పెరుమాళ్ కమిటీ నివేదిక పార్లమెంటుకు చేరింది. ఇది పెను సంచలనం సృష్టించింది.

పెరుమాళ్ నివేదికలో ఏముంది?

దళితుల పై జరుగుతున్న అఘాయిత్యాల పై కేంద్ర ప్రభుత్వం 1965లో దక్షిణాదికి చెందిన ఎంపీ ఇళయ పెరుమాళ్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ తన నివేదికను 1970 జనవరి 30న కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.

అయితే, ఇందులో ఉన్న అంశాలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే, దీనిని పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఒక దశలో భయపడింది. చివరకు ప్రతిపక్షాల ఒత్తిడితో ఎట్టకేలకు పెరుమాళ్ నివేదికను ఏప్రిల్ 10, 1970న పార్లమెంటులో ప్రవేశ పెట్టింది.

''ఈ నివేదిక ఒక బాంబ్ బ్లాస్ట్‌లాంటిది. తమపై జరుగుతున్న అఘాయిత్యాలను తెలుసుకుని దళితులు కంపించిపోయారు'' అని జేవీ పవార్ అన్నారు. దళితులపై దౌర్జన్యాలకు సంబంధించి అనేక భయంకరమైన వాస్తవాలను, గణాంకాలను ఈ నివేదిక బైటపెట్టింది.

నీళ్లను తాకినందుకు దళిత మహిళను వివస్త్రగా మార్చి నడిపించడం, మంచి దుస్తులు వేసుకున్నందుకు గ్రామ పెద్దల ముందు కొరడాతో కొట్టడం, అత్యాచారాలు చేయడం, జననాంగాలపై వాతలు పెట్టడం, దళితులు తాగే నీటిలో ఉమ్మివేయడం లాంటి అనేక ఘటనను ఇళయ పెరుమాళ్ కమిటీ తన నివేదికలో పేర్కొంది.

ఈ రిపోర్టు సృష్టించిన కలకలం కొనసాగుతుండగానే, మహారాష్ట్రలో దళితులపై అఘాయిత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి.

1970 ప్రాంతంలో మహారాష్ట్రలో జరిగిన సంఘటనల్లో కొన్నింటిని 'దళిత్ పాంథర్: ఏక్ సంఘర్ష్' పుస్తకంలో నామ్‌దేవ్ ధసల్ ప్రస్తావించారు.

దళిత యువతకు ఆగ్రహం కలిగించే మరో ఘటన పుణె జిల్లాలోని ఇందాపూర్ తాలూకా బావ్డా గ్రామంలో జరిగింది. అక్కడ అంటరాని వారిని అగ్రకులాల నాయకత్వంలో ఉన్న గ్రామస్తులు బహిష్కరించారు.

ఈ ఘటనలో ప్రభుత్వం దోషులకు అండగా నిలుస్తోందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎందుకంటే, దళితులను బహిష్కరించిన షాహాజీరావు పాటిల్, ఆయన సోదరుడు శంకర్రావు బాజీరావు పాటిల్‌లు అప్పట్లో మహారాష్ట్ర మంత్రులుగా పని చేస్తున్నారు.

రాష్ట్ర మంత్రి శంకర్రావు పాటిల్ రాజీనామా చేయాలని డిమాండ్ వినిపిస్తున్న సమయంలోనే పర్భణీ జిల్లాలో మరో ఘటన జరిగింది.

మే 14, 1972న బ్రహ్మంగావ్‌లోని బౌద్ధవాడకు చెందిన ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి, వారి జననాంగాలపై ముళ్ల కంపతో కొట్టారు. సోపాన్ దాజీబా అనే వ్యక్తికి చెందిన బావిలో నీళ్లు తాగడమే ఈ మహిళలు చేసిన నేరం.

బ్రహ్మంగావ్ ఘటన తర్వాత గవాయి కుటుంబానికి చెందిన ఇద్దరు సోదరుల కళ్లు పోగొట్టిన ఘటన మరింత సంచలనం సృష్టించింది. ఇలా మహారాష్ట్ర అంతటా ఒకదాని తర్వాత ఒకటి సంఘటనలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో జరగుతున్న పరిణామాలపై దళిత యువత ఆందోళన వ్యక్తం చేసింది. ఆగ్రహంతో ఉన్న దళిత యువత ప్రతిస్పందనే దళిత్ పాంథర్ మూవ్‌మెంట్‌గా ఆవిర్భవించింది.

దళిత యూత్ ఫ్రంట్ నుండి దళిత్ పాంథర్ వరకు...

డెబ్బైలలో దళిత యూత్ ఫ్రంట్ వడాలాలోని సిద్ధార్థ్ విహార్ హాస్టల్‌లో పుట్టింది. బాబాసాహెబ్ స్థాపించిన పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ హాస్టల్ ఇది.

''ఈ హాస్టల్ ఉద్యమానికి కేంద్రం. ముఖ్యంగా ఈ హాస్టల్‌లో చాలామంది బాబాసాహెబ్ సైద్ధాంతిక భావజాలం పట్ల ఆకర్షితులు'' అని అర్జున్ డాంగ్లే రాశారు. ప్రముఖ రచయితగా పేరున్న డాంగ్లే మిలింటెంట్ దళిత్ యూత్ ఆర్గనైజేషన్ సభ్యుడు కూడా.

1972 మేలో పూణేలో బావ్డా గ్రామంలో దళితులపై బహిష్కరణ అంశం పై చర్చించేందుకు దళిత యూత్ ఫ్రంట్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

"రాజా ధాలే, భగవాన్ జరేకర్, వసంత్ కాంబ్లే, లతీఫ్ ఖటిక్, కాశీనాథ్ టుటారి, అనంత్ బచ్చావ్ సహా మరికొందరు అప్పుడు సిద్ధార్థ విహార్‌ హాస్టల్‌లో సమావేశం ఏర్పాటు చేశాం. యువక్ అఘాడీ(యూత్ అసోసియేషన్) ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి కార్యాలయం ముందు ర్యాలీ నిర్వహించాం. మేం మా వినతి పత్రాన్ని ముఖ్యమంత్రికి సమర్పించినప్పుడు, మీరు అక్కడికి(బావ్డా) వెళ్లి విషయం తెలుసుకుని ఒక రిపోర్ట్ ఇవ్వండని ముఖ్యమంత్రి మాకు సలహా ఇచ్చారు'' అని నామ్‌దేవ్ ధసల్ వెల్లడించారు.

''మేం ఎందుకు నివేదికలు ఇవ్వాలి? దగ్గర పోలీసులు, ఇతర యంత్రాంగం ఉంది. వాళ్లేం చేస్తారు?'' అని జేవీ పవార్ బీబీసీతో అన్నారు. జేవీ పవార్, నామ్‌దేవ్ ధసాలే మీటింగ్ తర్వాత దాదాపు ఒకే రకమైన ఆలోచన చేశారు.

దళితులపై జరుగుతున్న దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలన్న వాదన ఈ సమావేశం తర్వాత దళిత యువకుల్లో బలపడింది. ఇదే దళిత్ పాంథర్ ఉద్యమానికి ప్రాణం పోసింది.

దళిత్ పాంథర్ ఏం చేస్తారు?

'దళిత్ పాంథర్' అన్న మాట ఉచ్ఛరించినప్పుడే ఆ మాటలో ఒక ఆవేశం నిండి ఉంటుంది. అప్పటి పరిస్థితులు దళిత్‌ పాంథర్‌ రూపకల్పనకు దారి తీశాయి. ఇప్పటికీ దళిత్ పాంథర్ ఉద్యమానికి దళిత వర్గాల్లో పెద్ద ఎత్తున మద్దతు ఉంది.

అయితే, దళిత్ పాంథర్ అనే మాటను ఎవరు మొదట ఉపయోగించేవారన్న దానిపై భిన్న వాదనలున్నాయి. అమెరికాలోని బ్లాక్ పాంథర్ ఉద్యమం గురించి టైమ్ మేగజైన్‌లో వచ్చిన కథనాలను రాజా ధాలే తరచూ సమావేశాలలో ప్రస్తావించేవారని చెబుతారు. దానివల్లే దళిత్ పాంథర్ అనే పేరు వచ్చిందన్న వాదన ఉంది. అయితే, నామ్‌దేవ్ ధసల్ ఈ వాదనను ఖండించారు.

దళిత్‌ పాంథర్‌లో క్రియాశీలకంగా వ్యవహరించిన ప్రహ్లాద్‌ చెండావంకర్‌ మరో కథనాన్ని వినిపించారు. ఈ విషయంపై చెండావంకర్ రాసిన వ్యాసాన్ని శరణ్‌కుమార్ లింబాలే రాసిన దళిత్ పాంథర్ సంకలనంలో పొందుపరిచారు.

1971లో మహాద్‌లో బౌద్ధ సాహిత్య సమ్మేళనం జరిగింది. ఇక్కడ జరిగిన ఒక సెమినార్‌లో డాక్టర్‌ ఎం.ఎన్. వాంఖడే అమెరికాలోని నల్లజాతి సాహిత్యం గురించిన సమాచారాన్ని అందించారు. అప్పటికీ ఈ సమాచారం చాలామందికి కొత్త.

అమెరికాలో నల్లజాతీయులను, భారతదేశంలోని దళితులను పోలుస్తూ అక్కడి నల్లజాతి ప్రజలు ఎలా చైతన్య వంతులయ్యారో డా.వాంఖడే వివరించారు. ఆగ్రహంతో ఉన్న నల్లజాతీయులు ఏర్పాటు చేసుకున్న సంస్థ బ్లాక్ పాంథర్ అని, దళితులు కూడా ఈ మార్గంలో పయనించాల్సి రావచ్చని డాక్టర్ వాంఖడే అనేవారని చెండావంకర్ వెల్లడించారు.

అయితే ఆ సమయంలో 'దళిత్ పాంథర్' అనే పేరు ఎంతో పాపులర్ అయినా, అది ఎప్పుడు, ఎవరు సూచించారో నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు లేవని అర్జున్ డాంగ్లే రాశారు.

దళిత పాంథర్ పేరును నామ్‌దేవ్ ధసల్ లేదా జేవీ పవార్‌లలో ఎవరు సూచించినా, అది వారిద్దరి సొంతం కాదు. అది దళిత సమాజపు భావ వ్యక్తీకరణ. ఒక వర్గం ఏకాభిప్రాయాన్ని వెల్లడించే రూపం.

'బ్లాక్ ఇండిపెండెన్స్ డే' ర్యాలీ

1972 జూలై 9న ముంబయిలోని కామాఠిపురాలో దళిత్ పాంథర్ మొదటి బహిరంగ సభ జరిగింది. ఈ ర్యాలీకి హాజరయ్యే వారందరినీ దళిత్ పాంథర్ వ్యవస్థాపక సభ్యులుగా పరిగణించారు.

అయితే, 1972 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినం 25వ వార్షికోత్సవాన్ని 'బ్లాక్ ఇండిపెండెన్స్' గా జరుపుకోవాలని బ్లాక్ పాంథర్ సభ్యులు నిర్ణయించారు. ఇందుకోసం దళిత వాడలలో సభలు ప్రారంభమయ్యాయి.

భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున నల్లజెండాలు ఎగరేయాలని, నల్ల రిబ్బన్లు కట్టుకోవాలని దళిత్ పాంథర్ సభ్యులు పిలుపునిచ్చారు.

ఈ విషయం తెలిసిన వెంటనే 'సాధన' వారపత్రికకు చెందిన పాత్రికేయుడు డా.అనిల్ అవచాత్ ముంబైలోని సిద్ధార్థ్ హాస్టల్‌కు వెళ్లారు. ఈ ఉద్యమం గురించి వ్యాసాలు రాయాలని ఆయన దళిత్ పాంథర్ నేతలను అడిగారు. అయితే, ఏమాత్రం ఎడిట్ చేయకుండా ప్రచురించాలని వారు డిమాండ్ చేశారు.

అలా రాసిన వ్యాసాలలో రాజా ధాలే రాసిన 'కాలా స్వాతంత్ర్య దిన్' (బ్లాక్ ఇండిపెండెన్స్ డే ) బాగా ప్రాచుర్యం పొందింది. దళిత మహిళలపై అత్యాచారాలు చేసి, తర్వాత పోలీసులకు లంచాలు ఇచ్చి అగ్రవర్ణాల ప్రజలు కేసుల నుంచి ఎలా బయటపడతారో అందులో వివరించారు.

చాలామంది దళితులు ఈ వ్యాసం నుంచి స్ఫూర్తి పొందగా, దీనిపై విమర్శలు కూడా వినిపించాయి. తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో 'సాధన' ఎడిటర్ యదునాథ్ థాటే రాజీనామా చేయాల్సి వచ్చింది.

ఈ కథనం తర్వాత రాజ ధాలే అనే పేరు చాలామందికి తెలిసింది.

మరోవైపు, బ్లాక్ ఇండిపెండెన్స్ డే కు ముందు రోజు అంటే ఆగస్టు 14న ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో దళిత పాంథర్‌తో సహా 10-11 ప్రగతిశీల సంస్థలు సమావేశమయ్యాయి.

ఆగస్టు 14వ తేదీ రాత్రి 12 గంటలకు ఆజాద్ మైదాన్ నుంచి విధాన్ భవన్ వైపు పాదయాత్ర ప్రారంభమైంది.

ఉద్యమకారులు మాక్ అసెంబ్లీని నిర్వహించి దళితులపై జరుగుతున్న దౌర్జన్యాలను ప్రభుత్వం ఆపలేకపోయినందుకు నిరసన తెలిపారు.

దీని తరువాత కూడా దళిత్ పాంథర్ ఉద్యమం అనేక ఆందోళనలను ప్రారంభించింది. అఘాయిత్యాలు జరిగినట్లు తెలియగానే, ఆ ప్రాంతానికి చేరుకుని వారిని ఓదార్చే ప్రయత్నం చేయడం ఉద్యమ కార్యకర్తల బాధ్యతగా మారింది.

తర్వాత అనేక కార్యక్రమాలకు వీరు పిలుపునిచ్చారు. నిరుద్యోగానికి వ్యతిరేకంగా ఉద్యమాలు, శంకరాచార్యపై బూట్లు విసరడం, ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం వీటిలో కొన్ని.

వీరి ఒత్తిడితో, అంబేడ్కర్ సాహిత్యాన్ని ప్రచురించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఉద్యమ నేతలు తమ వాగ్ధాటితో ఎక్కువమందిని తమ ఉద్యమంవైపు ఆకర్షితులను చేసుకోగలిగారు.

దళిత్ పాంథర్ ఉద్యమంలో ముఖ్యమైన మైలురాయి సెంట్రల్ ముంబైలో జరిగిన ఉప ఎన్నికలు.

అమెరికాలో నల్లజాతీయులు సాగించిన బ్లాక్ పాంథర్ ఉద్యమం దళిత్ పాంథర్‌కు ప్రేరణగా చెబుతారు

'గ్రామాలలో దళితులనుబహిష్కరించే వారికి ముంబైలో బహిష్కరణ'

ఆర్డీ భండారి రాజీనామాతో ముంబై సెంట్రల్‌కు 1974 జనవరిలో ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. కాంగ్రెస్ నుంచి రాంరావ్ ఆదిక్, సీపీఐ(ఎం) నుంచి శ్రీపాద అమృత డాంగే కుమార్తె రోజా దేశ్‌పాండే, హిందూ మహాసభ నుంచి విక్రమ్ సావర్కర్‌లో పోటీ చేస్తుండగా, ప్రధానమైన పోటీ కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య నెలకొంది.

మహాత్మా ఫూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్‌కు దాదాపు పదేళ్ల పాటు అధ్యక్షుడిగా ఉన్న రాంరావు ఆదిక్‌ కు కాంగ్రెస్ సీటివ్వడానికి కారణంగా సెంట్రల్ ముంబైలో దళితులు ఎక్కువగా ఉండటమే.

రాంరావ్ ఆదిక్‌ కు రిపబ్లికన్ పార్టీతో పాటు శివసేన మద్దతు లభించింది. శివాజీ పార్క్‌లో జరిగిన శివసేన స్థాపన సమావేశంలో రాంరావు ఆదిక్‌ కూడా వేదికపైనే ఉన్నారంటే, ఆయనకు శివసేన నుంచి మద్ధతు ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

అయితే దళిత సమాజంలో పాపులర్ అయిన దళిత్ పాంథర్ ఎవరివైపు మొగ్గు చూపుతుందన్న దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.

జనవరి 5, 1974న డా.బాబాసాహెబ్ అంబేద్కర్ మైదానంలో దళిత్ పాంథర్ బహిరంగ సభ జరిగింది. దళితులపై పెరుగుతున్న కులవివక్షకు, ప్రభుత్వ నిష్క్రియకు నిరసనగా ఎన్నికలను బహిష్కరించాలని దళిత్ పాంథర్ నిర్ణయించింది.

గ్రామాల్లో తమను బహిష్కరిస్తున్న వారిని ముంబైలో తాము బహిష్కరిస్తున్నట్లు దళిత్ పాంథర్ నేతలు ప్రకటించారు.

వర్లీ అల్లర్లు- ఇద్దరు పాంథర్స్‌ మరణం

సెంట్రల్ ముంబై ఉపఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు దళిత్ పాంథర్ ప్రకటించిన తర్వాత, దళిత ఓట్లు తమకు పడవని, ఓటమి ఖాయమని కాంగ్రెస్‌కు అర్ధమైంది.

దళిత్ పాంథర్ నిర్వహిస్తున్న ఓ సమావేశంలో నామ్‌దేవ్ ధసల్ ప్రసంగిస్తుండగా శివసేన కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ''దొంగచాటుగా కాదు, ఎదురొచ్చి రాళ్లు విసరండి'' అంటూ నామ్‌దేవ్ సవాల్ చేయడం సమావేశాన్ని మరింత వేడెక్కించిందని సుబోధ్ మోర్ ఒక వ్యాసంలో రాశారు.

ర్యాలీ పై శివసైనికులు రాళ్లు రువ్వడంతో ఘర్షణ చెలరేగింది. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

వర్లీ, నైగావ్, బైకుల్లా, దాదర్, పరేల్ సహా మరికొన్ని దళితవాడల్లో కూడా అలజడి చెలరేగింది. చర్మకార కులానికి చెందిన పాంథర్ రమేష్ దేవ్రూఖ్కర్ పోలీసుల కాల్పుల్లో మరణించారు.

ఈ సంఘటన జరిగిన నాలుగైదు రోజుల తర్వాత జనవరి 10, 1974న దాదర్‌ లోని నైగావ్‌లో నిరసన ప్రదర్శన జరిగింది. ఊరేగింపు పరేల్ రోడ్ గుండా వెళుతుండగా, ర్యాలీపై కొందరు రాళ్లు రువ్వడంతో భగవత్ జాదవ్ అనే మరో పాంథర్ చనిపోయారు.

ఎవరో విసిరిన రాయి తలకు తగలడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. దళిత్ పాంథర్ మూవ్‌మెంట్‌కు చెందిన పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

1974 జనవరి 13న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధి రాంరావు ఆదిక్‌ను ఓడించి సీపీఐ (ఎం) అభ్యర్ధి రోజా దేశ్‌పాండే విజయం సాధించారు.

రిపబ్లికన్ పార్టీలో ఐక్యత

సెంట్రల్‌ ముంబైలో ఎన్నికల అనంతరం పోలింగ్‌ శాతం గణనీయంగా ఉంది. అర్జున్ డాంగ్లే తన పుస్తకం 'దళిత్ పాంథర్:అధోరెఖిత్ సత్య'లో ఈ సంఘటనను విశ్లేషించారు.

రోజా దేశ్‌పాండే గెలుపు కాంగ్రెస్‌తోపాటు రిపబ్లికన్ పార్టీ నేతలకు కూడా షాకిచ్చింది. ఎన్నికల్లో దళిత్ పాంథర్ వర్గం బలాన్ని వారు తప్పుగా అర్ధం చేసుకున్నారు.

తర్వాత కాంగ్రెస్ పార్టీ చొరవతో రిపబ్లికన్ పార్టీ ఏకమైంది. 1974 జనవరి 26న చైత్య భూమిలో రిపబ్లికన్ పార్టీ వర్గాలన్నీ ఐక్యమవుతున్నట్లు ప్రకటించాయి. అదే ఏడాది ఫిబ్రవరి 20న పెద్ద ర్యాలీ నిర్వహించాయి.

ప్రజలకు చేరువగా ఉండే పార్టీగా రిపబ్లికన్ పార్టీ పట్ల అంబేడ్కర్ వాదులు సానుకూలంగా ఉండేవారు. సహజంగానే ఈ ఐక్యత పట్ల అంబేడ్కరిస్టులు సంతోషం వ్యక్తం చేశారు. ఒకరకంగా ఇది దళిత్ పాంథర్ ఉద్యమానికి పెద్ద దెబ్బ.

దళిత్ పాంథర్ చీలిక

దళిత్ పాంథర్ చీలికకు ప్రధాన కారణం నామ్‌దేవ్ ధసల్ రూపొందించిన మేనిఫెస్టో. దళిత్‌ పాంథర్‌ను కమ్యూనిస్టు భావజాలం వైపు మళ్లించేందుకు నామ్‌దేవ్‌ ధసల్‌ ప్రయత్నిస్తున్నారని దళిత్ పాంథర్‌లోని ఒక వర్గం ఆరోపించింది.

రాజా ధాలే, నామ్‌దేవ్ ధసల్ మధ్య విభేదాలు మొదలయ్యాయి.పరిణామాలు నామ్‌దేవ్‌ ను విమర్శిస్తూ రాజా ధాలే వార్తా పత్రికల్లో కథనాలు రాసేదాకా వెళ్లిందని అర్జున్ డాంగ్లే రాశారు.

1974లో నాగ్‌పూర్‌లో జరిగిన సమావేశంలో నామ్‌దేవ్ ధసల్‌ ను దళిత్ పాంథర్ నుండి బహిష్కరిస్తున్నట్లు రాజా ధాలే ప్రకటించారు. అయితే, తన మేనిఫెస్టో అంబేద్కర్ స్థాపించిన ఇండిపెండెంట్ లేబర్ పార్టీ మేనిఫెస్టో తరహాలో ఉంటుందని నామ్‌దేవ్ ధసల్ వాదించారు.

"బౌద్ధ మతాన్ని అవలంబించే వారే పాంథర్ కావాలని రాజా ధాలే చెప్పిన రోజునే ఆ సంస్థ ఛాందసవాద పార్టీగా మారింది. బుద్ధుడు కూడా అలా చెప్పలేదు. ఆయన కాలంలోనే బౌద్ధమతంలో 60-70 వర్గాలు ఉండేవి. వారి మధ్య చర్చలు జరుగుతూ ఉండేవి'' అని ధసల్ అన్నారు.

''నామ్‌దేవ్ ధసల్ పై కమ్యూనిస్టుల ప్రభావం ఉన్నట్లే, రాజా ధాలే పై సోషలిస్టుల ప్రభావం ఉండేది'' అని అర్జున్ డాంగ్లే విశ్లేషించారు. ప్రొఫెసర్ ఎం.పి.రెగే సూచనల మేరకు రాజా ధాలే నడుచుకునే వారని, ఇదే దళిత్ పాంథర్స్ చీలిక కు కారణమని డాంగ్లే అభిప్రాయపడ్డారు.

1977 ఏప్రిల్ 10న దళిత పాంథర్ ఔరంగాబాద్‌లో కొత్తగా ఆవిర్భవించింది. ఈసారి దాని పేరు భారతీయ దళిత పాంథర్ అని పెట్టారు. ఈ సంస్థలో ప్రొ.అరుణ్ కాంబ్లే, రాందాస్ అథవాలే, గంగాధర్ గాడే, ఎస్.ఎం. ప్రధాన్, దయానంద్ మహస్కే వంటి నాయకులు ఉన్నారు.

కొత్తగా ఏర్పాటైన భారతీయ దళిత్ పాంథర్ 1977 ఆగస్టు 12న మరఠ్వాడాలోని విశ్వవిద్యాలయానికి డాక్టర్ అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీ ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న రాందాస్ అథవాలే సహా కొంతమంది కొత్త ఉద్యమకారులను వెలుగులోకి తెచ్చింది.

దళిత్ పాంథర్ కేవలం మూడు నాలుగు సంవత్సరాలు మాత్రమే చెక్కు చెదరకుండా ఉంది. చివర్లో అంతర్గత విభేదాలతో దెబ్బతింది. ఉన్న కొద్ది రోజుల్లోనే దళిత సంఘాల ఆత్మగౌరవ పోరాటానికి దళిత పాంథర్ ఎంతగానో స్ఫూర్తినిచ్చింది.

నేటికీ ఉద్యమాలు చేసే దళిత యువత దళిత్ పాంథర్ నుంచి ప్రేరణ పొందుతుంది.

దళిత్‌ పాంథర్‌ పతనం కారాదని చాలామంది ఆకాంక్షించారు. "ప్రతి ఒక్కరూ విజయంలో వాటా కోరుకుంటున్నారు, కానీ ఓటమిని పంచుకోవాలని ఎవరూ కోరుకోలేదు. దళిత్ పాంథర్ కేసు కూడా అలాంటిదే'' అని జేవీ పవార్ బీబీసీతో అన్నారు.

దళిత్ పాంథర్‌లో పరస్పర విరుద్ధమైన ఆలోచనలు, అభిప్రాయాలు ఉండవచ్చు. కానీ సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా దళిత్ పాంథర్ నిర్వహించిన పోరాటాన్ని ఎవరూ కాదనలేరు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Dalit Panther: Why did the uprising break up and what was its role in the Dalit struggle
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X