భార్య శవాన్ని భుజాలపై : అసలు నిజం వేరే! సంచలన వివరణ
భువనేశ్వర్ : చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో భార్య శవాన్ని 10కి.మీ భుజాలపై మోసుకెళ్లడం.. ఈమధ్యే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నిర్దయ భారతం అంటూ ఈ విషయంపై చర్చోపచర్చలు జరిగాయి. ఇంతగా చర్చనీయాంశమైన ఈ ఉదంతానికి సంబంధించి ఒడిశా ప్రభుత్వం ఇచ్చుకున్న వివరణ మరింత సంచలనం కలిగించేదిగా ఉంది.
భార్య మృతదేహానికి సంబంధించి మరణ ధ్రువీకరణ కూడా జరగముందే.. ఎవరికీ కనీస సమాచారం కూడా ఇవ్వకుండా.. మాంఝి తన భార్య శవాన్ని తీసుకెళ్లిపోయాడని ఒడిశా ప్రభుత్వం దీనిపై సమర్పించిన నివేదికలో పేర్కొంది. అధికారిక నిర్ధారణ లేకుండా మాంఝి తన భార్య శవాన్ని తీసుకెళ్లిపోయాడని, ఒకవేళ తన వద్ద డబ్బులు లేకపోయినా.. సీఎం సహాయ నిధి ద్వారానో లేక రెడ్ క్రాస్ సొసైటీ అందించే నిధి ద్వారానో సహాయం పొందే వెసులుబాటు ఉందని.. కానీ మాంఝీ ఎవరికీ చెప్పా పెట్టకుండా వెళ్లిపోవడం వల్లే..ఈ పరిస్థితి తలెత్తిందని ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంది.

ఆసుపత్రిలోని ఇతర రోగులు, కొంతమంది ప్రత్యక్ష సాక్ష్యులు ఇచ్చిన సమాచారం మేరకు కలహండి జిల్లా ముఖ్య వైద్యాధికారి ఒక నివేదికను రూపొందించారు. ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి అతాను సబ్యసాచి ఈ రిపోర్టును శుక్రవారం నాడు అసెంబ్లీలో చదివి వినిపించారు. ఇదే విషయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రఫుల్ ప్రభుత్వ స్పందన కోరగా.. రాతపూర్వక సమాధానం ఇచ్చింది ప్రభుత్వం. అందులో పై వివరాలన్నింటిని పొందుపరిచింది.
డెత్ కన్ఫర్మేషన్ చేయకముందే మాంఝి తన భార్య శవ తీసుకెళ్లిపోయాడని.. అప్పటికీ సమాచారం అందుకున్న సిబ్బంది అంబులెన్స్ ను పంపించారని వైద్యాధికారి తను రూపొందించిన నివేదికలో వెల్లడించారు. కాగా, ఈ ఉదంతానికి సంబంధించిన ఇప్పటికే స్టాఫ్ నర్సు రాజేంద్ర రాణాను డిస్మిస్ చేసింది ఒడిశా ప్రభుత్వం. అలాగే సెక్యూరిటీ సంస్థకు నోటీసులు మంజూరు చేశామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న మాంఝి కుటుంబానికి పలు స్వచ్చంద సంస్థలు విరాళాలు ప్రకటించాయి.












Click it and Unblock the Notifications