జోతిష్కుడితో భవిష్యత్తు చెప్పించుకున్న మోడీ?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రముఖ జోతిష్కుడు బెజాన్ దరువాల ను కలిసినట్లు వెలుగు చూసింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ భవిష్యత్తు చెప్పించుకున్నారని వెలుగు చూడటంతో బీజేపీ నాయకులు ఇరకాటంలో పడ్డారు.
నరేంద్ర మోడీ చేతుల్లో దేశ భవిష్యత్తు, దేశ ప్రగతి ఎలా ఉంటుందో తాను జోస్యం చెప్పానని బెజాన్ దరువాల మీడియాకు చెప్పారు. ఇదే సమయంలో నరేంద్ర మోడీ తన చేతిని బెజాన్ దరువాలకు చూపిస్తున్న ఫోటోలను కొన్ని మీడియా చానెళ్లు ప్రసారం చేశాయి.
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఓ తాంత్రికుడిని కలిసి వీడియోను బీజేపీ నాయకులు యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. బీహార్ ఎన్నికలలో ఓడిపోతాననే భయంతో నితీశ్ కుమార్ తాంత్రికుడిని కలిశాడని నరేంద్ర మోడీ ఆరోపించారు.

ఈ విషయంపై ఎన్నికల ప్రచారంలో మోడీ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మీద విమర్శలు గుప్పించారు. బీహార్ ను అభివృద్ది చెయ్యడానికి తాంత్రికులు, మాంత్రికులు అవసరం లేదని నరేంద్ర మోడీ అన్నారు. 18వ శతాబ్దపు దృక్పథంతో ఉన్న ఈ నేతలతో బీహార్ అభివృద్ది అవుతుందా అని ప్రశ్నించారు.
అయితే ఇదే సమయంలో నరేంద్ర మోడీ ఓ ప్రముఖ జ్యోతిష్కుడిని కలవడం బీజేపీ నేతలను కలవరపెడుతున్నది. నరేంద్ర మోడీ జ్యోతిష్కుడిని కలవడం వివాదాస్పదం అయ్యే అవకాశం ఉందని కొందరు బీజేపీ నాయకులు అంటున్నారు. ఈ విషయాన్ని బీహార్ ఎన్నికలలో ఆయుధంగా చేసుకోవాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.












Click it and Unblock the Notifications