వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో తగ్గుతున్న కేసులు, ఖాళీ అవుతున్న కోవిడ్ పడకలు: ప్రెస్ రివ్యూ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఏపీలో తగ్గుతున్న కేసులు

ఏపీలో కోవిడ్‌ పడకలు క్రమంగా ఖాళీ అవుతున్నాయి. బాధితుల సంఖ్య తగ్గడం, వ్యాధి నయమై ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జి అయ్యి వెళ్లేవారు పెరగడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఈనాడు ఒక కథనాన్ని ప్రచురించింది.

శనివారానికి 58 ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా బాధితులు అసలు లేరు. మరో 80 ఆసుపత్రుల్లో చికిత్స పొందే బాధితుల సంఖ్య ఐదులోపే ఉంది. 25 కోవిడ్‌ సంరక్షణ కేంద్రాల్లో బాధితులు అసలు లేరు. గత రెండు రోజులుగా సగటున పదివేల చొప్పున కేసులు నమోదవుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో శుక్రవారం 1,664 ఐసీయూ, 8,186 ఆక్సిజన్‌ పడకలు ఖాళీగా ఉన్నాయి. గత 24 గంటల్లో ఈ ఖాళీలు పెరిగాయి. కొద్దిరోజుల కిందట 95% వరకు పడకలు భర్తీ అయ్యాయి.

శనివారం మధ్యాహ్నానికి 1,174 ఐసీయూ, 8,164 ఆక్సిజన్‌ పడకలు చొప్పున ఖాళీగా ఉన్నాయి. శనివారం 406 టన్నుల ఆక్సిజన్‌ వినియోగించారు. కేంద్రం రాష్ట్రానికి రోజూ 590 టన్నుల ఆక్సిజన్‌ పొందే సౌకర్యాన్ని కల్పించింది. కోవిడ్‌ చికిత్సను అందించే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు రాష్ట్రంలో 550 వరకు ఉన్నాయి.

వీటిలో గుంటూరు జిల్లాలో 14, కృష్ణాలో 4, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో 6 చొప్పున, కర్నూలు, ప్రకాశం, కడప జిల్లాల్లో 4 చొప్పున ఆసుపత్రుల్లో బాధితులు లేరు. ఐదుగురిలోపు బాధితులున్న ప్రైవేటు ఆసుపత్రులు 88 ఉన్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా 135 కోవిడ్‌ సంరక్షణ కేంద్రాలున్నాయి. వీటిలో శనివారానికి 12,247 మంది చికిత్స పొందుతున్నారు. 25 చోట్ల బాధితులు లేరు. 15 కేంద్రాల్లో 10 మంది లోపు ఉన్నారు. 30 కేంద్రాల్లో 50 మంది లోపు ఉన్నారు. 500-1000 మధ్యన బాధితులున్న కేంద్రాలు 5 వరకు ఉన్నాయి. శనివారం మొత్తమ్మీద 3,247 మంది డిశ్ఛార్జి కాగా 1,248 మంది ఆసుపత్రుల్లో చేరారు.

అమార్త్యసేన్

భారత ప్రభుత్వం పేరు కోసం పాకులాడింది-నోబెల్‌ గ్రహీత అమర్త్యసేన్‌

భారత ప్రభుత్వ అయోమయ ధోరణి దేశంలో కోవిడ్‌ వినాశనం సృష్టించడానికి కారణమని ప్రముఖ ఆర్థిక వేత్త, నోబెల్‌ గ్రహీత అమర్త్యసేన్‌ పేర్కొన్నారని సాక్షి పత్రిక తెలిపింది.

దేశంలో కోవిడ్‌–19 వ్యాప్తిని కట్టడి చేయడం మాని, భారత ప్రభుత్వం పేరు సంపాదించడంపై దృష్టి పెట్టడం వల్లే ఈ దారుణ పరిస్థితులు దాపురించాయని ఆయన వ్యాఖ్యానించారు.

'అయోమయ వైఖరితో ప్రభుత్వం సరిగా స్పందించలేకపోయింది ఫలితంగా ఈ మహమ్మారిని దేశం ఎదుర్కోలేకపోయింది’ అన్నారని రాసింది.

'మంచి పనుల ద్వారా ఖ్యాతిని ఆర్జించడం మాని, కేవలం పేరును మాత్రమే ఆశించడం అనే మేథో అమాయకత్వం తగదు. కానీ, భారత్‌లో జరుగుతోందిదే’ అని ఆయన పేర్కొన్నారు.

సామాజిక అసమానతలు, ఆర్థిక వృద్ధి మందగమనం, పెచ్చుమీరిన నిరుద్యోగం వంటి వాటికి ఈ మహమ్మారి తోడైందని పేర్కొన్నారు. విద్యపై ఉన్న పరిమితుల కారణంగానే మహమ్మారిని పసిగట్టటంలోనూ, సరైన చికిత్సా విధానాలను అంచనా వేయడంలోనూ ఇబ్బందులు ఎదురయ్యాయని ఆయన చెప్పారని సాక్షి వివరించింది.

ఉచితంగా 57 పరీక్షలు

తెలంగాణ జిల్లా కేంద్రాల్లో కొత్త డయాగ్నస్టిక్‌ సెంటర్లు.. 57 వైద్య పరీక్షలు ఉచితం

తెలంగాణలోని 19 జిల్లా కేంద్రాల్లోని ప్రధాన ప్రభుత్వ దవాఖానల్లో సిద్ధమైన రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రాలను (డయాగ్నస్టిక్‌ సెంటర్లను) సోమవారం ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారని నమస్తే తెలంగాణ తెలిపింది.

ఒక్కో డయాగ్నస్టిక్‌ కేంద్రంలో 57 రకాల వైద్యపరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని తెలిపారు.

శనివారం వైద్యారోగ్యశాఖ అధికారులతో సమావేశంలో రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్న తీరును ముఖ్యమంత్రి కేసీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. వైద్యసేవలతోపాటు పలు అంశాలపై చర్చించారు.

గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 19 జిల్లా కేంద్రాల్లో రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని వైద్యాధికారులు తెలుపగా.. వాటిని సోమవారం ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యం అందిచేందుకు, అన్నిరకాల వైద్యసేవలను మరింతగా అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

వైద్యచికిత్సలో అత్యంత కీలకమైన రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రాలను (డయాగ్నస్టిక్‌ సెంటర్స్‌) 19 జిల్లాల్లో ఏర్పాటుచేయాలని నిర్ణయించడం రాష్ట్ర వైద్య చరిత్రలో గొప్ప సందర్భమని, ప్రభుత్వ వైద్యరంగంలో విప్లవాత్మకమని అన్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులతో సమన్వయం చేసుకుని నియోజకవర్గాల్లోని మెరుగైన వైద్యం అందేలా వ్యవహరించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

ప్రభుత్వం ప్రారంభించబోతున్న డయాగ్నోస్టిక్‌ కేంద్రాల్లో మొత్తం 57 రకాల వైద్యపరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

కరోనా పరీక్షలతోపాటు రక్త పరీక్ష, మూత్ర పరీక్ష, బీపీ, షుగర్‌, గుండె జబ్బులు, ఎముకల జబ్బులు, లివర్‌, కిడ్నీ, థైరాయిడ్‌ వంటి వాటికి సంబంధించిన ఎక్స్‌ రే, బయోకెమిస్ట్రీ, పాథాలజీకి సంబంధించిన పలు పరీక్షలు ఉంటాయని తెలిపారు.

సాధారణ పరీక్షలే కాకుండా, అత్యంత అరుదుగా చేసే ఖరీదుతో కూడుకున్న ప్రత్యేక పరీక్షలను కూడా పూర్తిగా ఉచితంగా చేసి వెంటనే రిపోర్టు ఇస్తారని సీఎం తెలిపారు. నిర్ధారించిన రిపోర్టులను రోగుల సెల్‌ఫోన్లకు మెసేజ్‌ల రూపంలో పంపించే ఏర్పాట్లను కూడా ప్రభుత్వం చేసిందని చెప్పారు.

డయాగ్నస్టిక్‌ కేంద్రాల్లో పరీక్షల కోసం ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న యంత్రాలన్నీ అత్యంత అధునిక సాంకేతికతతో, స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ టెక్నాలజీతో కోట్ల రూపాయల ఖరీదైనవని తెలిపారు.

ఇటువంటి పరీక్షా యంత్రాలు పెద్దపెద్ద కార్పొరేట్‌ దవాఖానాల్లో, గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌ వంటి ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ దవాఖానాలల్లో అందుబాటులో ఉంటాయని చెప్పారు. పేదలకు ఉచితంగా వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఖర్చుకు వెనుకాడకుండా వీటిని ఏర్పాటు చేసిందని తెలిపారు.

సోమవారం నుంచి ఆనందయ్య మందు పంపిణీ

కరోనా మందు పంపిణీని ఈ నెల 7(సోమవారం) నుంచి చేపట్టనున్నట్లు ఆనందయ్య ప్రకటించారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు మందుల కిట్లు పంపిణీ చేస్తామన్నారని ఆంధ్రజ్యోతి ఒక కథనంలో తెలిపింది.

సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి వెబ్‌సైట్ల ద్వారా కరోనా మందులు అమ్ముకొంటున్నారంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేసిన విమర్శలను, ఆనందయ్య మందు పంపిణీ చేయడం లేదంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు చేస్తున్న ప్రచారాలను ఆయన ఖండించారు.

ఈ మేరకు శనివారం సాయంత్రం ఆనందయ్య ఒక వీడియో విడుదల చేశారు. తాను మందు పంపిణీ చేయడం లేదని కొంతమంది చేస్తున్న ప్రచారం అవాస్తవమని, దానిని ఎవరూ నమ్మవద్దని కోరారు.

మందుల తయారీ జరుగుతోందని, సోమవారం నుంచి కచ్చితంగా పంపిణీ చేస్తామన్నారు. తొలుత తన సొంత నియోజకవర్గం సర్వేపల్లి పరిధిలోని ప్రతి ఇంటికి మందు పంపిణీ చేసిన తర్వాత ఇతర ప్రాంతాలపై దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

అన్ని జిల్లాల కలెక్టర్లకు కరోనా మందు కిట్ల పంపిణీని కూడా 7నుంచే మొదలు పెడతానన్నారు. మందు కోసం ఎవరూ నేరుగా కృష్ణపట్నం రావద్దని ఆయన విజ్జప్తి చేశారు.

మందును అధికార యంత్రాంగం ద్వారా అన్ని జిల్లాలకు పంపుతామని, అధికారుల నేతృత్వంలో పంపిణీ జరుగుతుందని స్పష్టం చేశారు. మందు తయారీ, పంపిణీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన క్రమంలో సాధ్యమైనంత ఎక్కువమంది ప్రజలకు సేవ చేసే అవకాశం దొరికిందన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Decreasing cases in AP, vacant Kovid beds: Press Review
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X