బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం-ఏపీ, తమిళనాడులో కుండపోత-చెన్నైలో రెడ్ అలర్ట్
బంగాళాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారిపోయింది. దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడులోని తీర ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అలాగే మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో రాబోయే రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు తప్పవని వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేస్తోంది. అల్పపీడన ప్రభావంతో చెన్నైతో పాటు తమిళనాడులోని ఎనిమిది జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. మొత్తం 11 జిల్లాల్లో భారీ వర్షాలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
Recommended Video

బంగాళాఖాతంలో అల్పపీడనం
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఏపీ, తమిళనాడు రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది. చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా 170 కి.మీ, పుదుచ్చేరికి తూర్పున 170 కి.మీ దూరంగా ఇది కేంద్రీకృతమై ఉంది. ఇవాళ సాయంత్రానికి పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలను దాటి చెన్నై చుట్టూ చేరుతుందని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఇరు రాష్ట్రాలలోనూ భారీ వర్షాలు తప్పడం లేదు. దీంతో వాతావరణ విభాగం ఇరు రాష్ట్రాలకూ భారీ వర్ష హెచ్చరికలు జారీ చేస్తోంది.

తమిళనాడుపై తీవ్ర ప్రభావం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మూడు వైపులా సముద్రం కలిగిన తమిళనాడు రాష్ట్రంపై అల్పపీడనం విరుచుకుపడుతోంది. దీంతో రెండు రోజులుగా అక్కడ వాతావరణం పూర్తిగా మారిపోయింది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సాధారణ జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కోస్తా తీర ప్రాంతాల్లో ఉన్న జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా పూర్తిగా జనజీవనం స్తంభించింది. భారీ వర్షాలతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుండగా.. రవాణాకూ అంతరాయం ఏర్పడుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో స్టాలిన్ సర్కార్ అప్రమత్తంగా ఉంటూ పరిస్ధితిని సమీక్షిస్తోంది.

చెన్నైతో పాటు 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్
భారీ వర్షాల కారణంగా తమిళనాడులో చాలా ప్రాంతాలు ముంపుబారిన పడుతున్నాయి. 11 జిల్లాలపై వర్షాల ప్రభావం ఎక్కువగా ఉందని ప్రభుత్వం తెలిపింది. అలాగే చెన్నైతో పాటు తిరువల్లూరు, రాణిపేట, వెల్లూరు, సాలెం, కల్లకురుచ్చి, తిరుపట్టూరు, తిరువణ్ణమలై జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం ఇక్కడ అదనపు సహాయక బృందాలను పంపడంతో పాటు జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఆయా జిల్లాల్లో ఇప్పటికే స్కూళ్లకు, ప్రభుత్వ కార్యాలయలకూ సెలవులు కూడా ప్రకటించారు. జనం అప్రమత్తంగా ఉండాలని, బయటికి రావొద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తోంది.

ఏపీలోనూ కుండపోత
ఏపీలోనూ తీర ప్రాంతాలు అల్పపీడన ప్రభావంతో అల్లాడుతున్నాయి. నిన్నటి నుంచే వాతావరణం పూర్తిగా మారిపోయింది. తీర ప్రాంతాల్లో ఉన్న జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతంలో ఉన్న జిల్లాల్లోనూ నిన్నటి నుంచే ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ పరిస్ధితి మరీ దారుణంగా మారిపోయింది. పలు జిల్లాల్లో వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమ గ్రామాలకు భారీ వర్షాలతో రాకపోకలు నిలిచిపోతున్నాయి. మిగతా కోస్తా జిల్లాల్లోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావం రాబోయే రెండు రోజుల పాటు ఉండొచ్చని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications