అగ్నిపథ్ పై త్రివిధ దళాధిపతులతో రాజ్ నాథ్ భేటీ-రద్దుకు కాంగ్రెస్, ఆప్, టీఆర్ఎస్ డిమాండ్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సైనిక రిక్రూట్‌మెంట్ స్కీమ్ అగ్నిపథ్‌పై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ త్రివిధ దళాధిపతులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాలకు విస్తరించిన ఈ నిరసనల్లో ఒకరు మరణించారు. మరిన్ని రాష్ట్రాలకు ఈ నిరసనలు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై రాజ్ నాథ్ వారితో చర్చించారు.
ఇవాళ ఉదయం బీహార్‌లో ఈ వివాదాస్పద రిక్రూట్‌మెంట్ స్కీమ్‌కు వ్యతిరేకంగా పిలుపునిచ్చిన బంద్ లో పాల్గొన్న నిరసనకారులు పోలీసులతో ఘర్షణ పడ్డారు. అనేక వాహనాలకు నిప్పు పెట్టారు. నిన్న బీహార్‌లో 'అగ్నిపథ్'కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి, గుంపులు రైళ్లు, ఇతర ఆస్తులను తగలబెట్టడంతో, రాష్ట్రంలోని 18 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 325 మందిని అరెస్టు చేశారు.

తెలంగాణలో నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారులపై భద్రతా సిబ్బంది కాల్పులు జరపడంతో 24 ఏళ్ల యువకుడు రాకేష్ మృతి చెందడం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి ₹ 25 లక్షల పరిహారం, అలాగే కుటుంబంలోని అర్హులైన సభ్యునికి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ప్రకటించారు. బిజెపి పాలిత హర్యానాలోనూ బల్లభ్‌గఢ్‌లో వాహనాలపై రాళ్లు రువ్వడం, జింద్‌లో రైల్వే ట్రాక్‌లపై అడ్డంకులు కల్పించడం, రోహ్‌తక్‌లో టైర్లను తగలబెట్టారు.
మరోవైపు అగ్నిపథ్ పథకాన్ని వెనక్కితీసుకోవాలని కాంగ్రెస్, టీఆర్ఎస్, ఆప్ సహా పలు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. నిన్న సికింద్రాబాద్ స్టేషన్లో చోటు చేసుకున్న నిరసనల నేపథ్యంలో అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా ఇప్పటికే పోరాడుతున్న కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు అగ్నిపథ్ పై పిరుచుకుపడుతున్నాయి. నిన్న చనిపోయిన రాకేష్ అంతిమయాత్రలోనూ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై నిరసనకారులు రాళ్లు రువ్వడం కలకలం రేపింది. అయితే కేంద్రం మాత్రం అగ్నిపథ్ ను వెనక్కి తీసుకునే ప్రశ్నే లేదని చెబుతోంది.












Click it and Unblock the Notifications