తాలిబన్లపై కేంద్రం ఫస్ట్ రియాక్షన్-ఆప్ఘన్ లో కోరుకుంటోంది ఇదే-రాజ్ నాథ్ సింగ్ ప్రకటన
ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం స్ధానంలో పగ్గాలు చేపట్టిన తాలిబన్లు తమ పాలనలో పరిస్ధితి ఎలా ఉండబోతోందన్న దానిపై సంకేతాలు ఇస్తున్న వేళ.. కేంద్రం తొలిసారిగా అక్కడి పరిణామాలపై స్పందించింది. ముఖ్యంగా భారత్ లో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు తాలిబన్లు ప్రకటిస్తున్న నేపథ్యంలో కేంద్రం స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆప్ఘనిస్తాన్ పరిణామాలపై తొలిసారి స్పందించిన రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఇవాళ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆప్ఘన్ లో మారిన పరిస్ధితులు సరిహద్దు తీవ్రవాదనికి ఉపయోగపడకుండా చూడటమే తమ కర్తవ్యమని రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. దీంతో ఆప్ఘన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తమ వైఖరిని కుండబద్దలు కొట్టినట్లయింది. ఆఫ్ఘన్ లో తాలిబన్ల పాలన రాకతో అంతర్జాతీయ తీవ్రవాద సంస్ధలు, గ్రూపులు వారితో చేతులు కలపబోతున్నాయన్న వార్తల నేపథ్యంలో రాజ్ నాథ్ సింగ్ ప్రకటన కేంద్రం వైఖరిని స్పష్టం చేసింది.

కాబూల్ లో పరిస్ధితుల్ని కేంద్రం నిశితంగా గమనిస్తోందని, అక్కడి ఘటనల్ని ఎవరూ (పాకిస్తాన్, చైనా) తమకు అనుకూలంగా మల్చుకోకుండా చూడటం తమ ముందున్న బాధ్యత అని రాజ్ నాధ్ సింగ్ తెలిపారు. ఆప్ఘనిస్తాన్ లో భారతీయుల భద్రత తమకు చాలా ముఖ్యమని, అదే సమయంలో అక్కడి పరిస్దితుల్ని విదేశీ శక్తులు తమకు అనుకూలంగా వాడుకుని భారత సరిహద్దుల్లో తీవ్రవాదాన్ని ఎగదోయనీయకుండా కేంద్రం చర్యలు చేపడుతోందన్నారు. మరోవైపు తూర్పు లఢఖ్ లో గతేడాది చోటు చేసుకున్న ఉద్రిక్తతల్ని ప్రస్తావిస్తూ చైనా అన్ని ఒప్పందాలు ఉల్లంఘించి దాడులు చేసినా భారత్ మాత్రం ఏకపక్షంగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని రాజ్ నాథ్ సింగ్ గుర్తుచేశారు.
ఆప్ఘనిస్తాన్ లో తాజాగా చోటు చేసుకుంటున్న బాంబుదాడులు, భారతీయుల్ని తాలిబన్లు టార్గెట్ చేయొచ్చన్న భయాల నేపథ్యంలో కేంద్రం సంయమనం పాటిస్తోంది. కాబూల్ తో పాటు ఆప్ఘనిస్తాన్ గడ్డపై ఉన్న భారతీయులందరినీ తరలించడం పూర్తయ్యాకే తాలిబన్ల విషయంలో ఓ నిర్ణయం తీసుకునేందుకు కేంద్రం వ్యూహరచన చేస్తోంది. అయితే ఆ లోపు ఆప్ఘన్ పరిస్ధితులపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు భారత్ భవిష్యత్ వ్యూహాలకు ఓ సంకేతంగా భావించవచ్చని నిపుణులు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications