రెండో డోసు విరామం పెరిగితే రెట్టింపు సమర్థతతో వ్యాక్సిన్ పనిచేస్తుంది: తాజా అధ్యయనాలు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశంలో సెకండ్ వేవ్‌లో మరింత వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో కరోనా వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని వైద్య నిపుణులు చెబుతున్నారు. భారత్ లాంటి అత్యధిక జనాభా గల దేశంలో వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తిగా కావాలంటే చాలానే సమయం తీసుకుంటుంది. దేశంలో అర్హులందరికీ వ్యాక్సిన్ వేసేందుకు సుమారు మూడు నెలలకుపైనే టైమ్ పడుతుందని సీరమ్ సీఈవో అదార్ పూనావాల ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

రెండు డోసుల మధ్య విరామం మంచిదే..
అయితే, తాజాగా, కేంద్ర వైద్యారోగ్య శాఖ మొదటి డోసు తర్వాత రెండో డోసు తీసుకునే కాలాన్ని పెంచడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కానీ, రెండో డోసు ఆలస్యం కావడం వల్ల వ్యాక్సిన్ మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు చెబుతున్నారు. మొదటి డోసుకు రెండో డోసుకు మధ్య కాలం ఎక్కువగా ఉంటే ప్రయోజనం ఉంటుందని, మరింత శక్తివంతంగా వ్యాక్సిన్ పనిచేస్తుందని స్పష్టం చేస్తున్నారు.

తొలి డోసు వేసుకుంటే రక్షణ..
అంతేగాక, ఎక్కువ మందికి తొలి డోసు టీకా వేగంగా అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని చెబుతున్నారు. కనీసం ఒక్క డోసు తీసుకున్నా కరోనా నుంచి కొంతైనా రక్షణ లభిస్తుందంటున్నారు. కాగా, మొట్టమొదటిసారి ఈ విధానం బ్రిటన్ అవలంభించింది. తొలుత దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చినా.. రెండో డోసు ఆలస్యం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని తెలిసి సమర్థించారు. మనదేశంలోనూ ఇటీవల కోవిషీల్డ్ రెండు డోసుల మద్య విరామాన్ని పెంచినప్పుడు కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి. కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య విరామాన్ని 12-16 వారాలకు పెంచిన విషయం తెలిసిందే.

రెండు డోసుల మధ్య విరామంతో వ్యాక్సిన్ సమర్థత రెట్టింపు
కానీ, రెండు డోసుల మధ్య విరామాన్ిన పెంచాలన్న నిర్ణయాన్ని ఇప్పుడు పలు శాస్త్రీయ అధ్యయనాలు సమర్థించడం గమనార్హం. రెండో డోసు ఆలస్యం కావడం వల్ల ప్రయోజనం ఎక్కువని చెబుతున్నాయి. రెండో డోసుల మధ్య వ్యవధిని రెండు లేదా మూడింతలు చేయడం వల్ల తొలి డోసుకు ప్రతిస్పందించడానికి రోగ నిరోధక వ్యవస్థకు అధిక సమయం లభిస్తుందని, దీంతో రక్షణశక్తి మరింత బలపడుతుందని అధ్యయనాలు తేల్చాయి. మొదటి డోసు వల్ల యాంటీబాడీల స్థాయిలు కూడా 20 శాతం నుంచి 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నాయి.

తక్కువ సామర్థ్యం ఉన్న వ్యాక్సిన్ డోసుల మధ్య విరామం ఎక్కువ వద్దు
తొలి డోసు వీలైనంత ఎక్కువ మందికి ఇవ్వాలని ప్రముఖ వైరాలజిస్ట్ గ్రెగరీ పోలండ్ సూచించారు. తొలి డోసు ద్వారా ఏర్పడ్డ యాంటీబాడీలు పరిపక్వత సాధించినకొద్దీ శరీరంలోని రక్షణ వ్యవస్థ బలపడుతుందని తాజా అధ్యయనాలు పేర్కొన్నాయి. అయితే, తక్కువ సామర్థ్యం ఉన్న వ్యాక్సిన్ల విషయంలో మాత్రం రెండు డోసుల మధ్య విరామం అవసరమైన మేరకు ఉండాలని స్పస్టం చేశాయి. రెండు డోసుల మధ్య విరామం ఎక్కువగా ఉంటే ప్రజల్లో రెండో డోసు తీసుకోవడంపై ఆసక్తి తగ్గే అవకాశం ఉందని, అలా జరగకుండా చూసుకోవాలని చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications