ఢిల్లీ వాయు కాలుష్యం: కేంద్రం కీలక నిర్ణయం, ఆ వాహనాలపై నిషేధం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాయు కాలుష్య నియంత్రణకు నాలుగో దశ కింద కఠిన చర్యలు ప్రకటించింది. ఢిల్లీలో అత్యవసర సేవలను అందించే వాహనాలు మినహా వాయు కాలుష్య ట్రక్కులు, నాలుగు చక్రాలు, నాలుగు చక్రాల కమర్షియల్ వాహనాల ప్రవేశంపై నిషేధం విధించింది.
మరోవైపు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సీఎన్జీ, ఎలక్ట్రిక్, బీఎస్ 6 వాహనాలను రాజధాని ప్రాంతంలోకి అనుమతించాలని సూచించింది. హైవేలు, రోడ్లు, ఫ్లైఓవర్లు, ఓవర్ బ్రిడ్జిలు, పవర్ ట్రాన్స్ మిషన్, పైప్ లైన్లు తదితర పబ్లిక్ ప్రాజెక్టులతోపాటు అన్ని రకాల నిర్మాణం, కూల్చివేత కార్యకలాపాలపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కాలుష్య నియంత్రణకు అన్ని అత్యవసర చర్యలు అమలు చేయాలని ఢిల్లీ, రాజధాని ప్రాంతం పరిధిలోని రాష్ట్రాలను కోరింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో, మిగితా సిబ్బంది ఇంటి నుంచి పనిచేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. కాగా, ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో మూడు నగరాలు భారత్‌లో ఉన్నాయి. ఈ జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ అగ్రస్థానంలో ఉండటం గమనార్హం.
మరోవైపు, దేశ రాజధానిలో కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. పలు ఫైరింజిన్లు పరిస్థితి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో నీటిని పిచికారీ చేస్తున్నారు. కాగా, ఆదివారం గాలి నాణ్యత సూచి 'అతి తీవ్రమైన కేటగిరీ'కి మరోసారి చేరడం గమనార్హం. రాత్రిపూట గాలులు మరీ నెమ్మదిగా వీస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొందని అక్కడి అధికారులు చెబుతున్నారు. కాగా, కాలుష్య తీవ్రత నేపథ్యంలో ఢిల్లీలోని ప్రాథమిక పాఠశాలలను నవంబర్ 10వ తేదీ వరకు మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications