ఢిల్లీలో నమోదైన ఓటింగ్ శాతం ఎంతంటే?
ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్ బుధవారం సాయంత్రం 6 ముగిసింది. కాగా, 60.10 శాతం ఓటింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా వివిధ రాజకీయ పార్టీల నేతలు, వివిధ రంగాల ప్రముఖులు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటుహక్కు వినియోగించుకున్నారు.
రాష్ట్రపతి ద్రౌపదిముర్ము రాజేంద్రప్రసాద్ కేంద్రీయ విద్యాలయంలో ఓటు వేశారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, విశ్రాంత సీజేఐ డీవై చంద్రచూడ్, కేంద్రమంత్రులు జైశంకర్, హర్ దీప్‌సింగ్‌పూరీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ తన భర్త రాబర్ట్ వాద్రా, కుమారుడితో కలిసి వెళ్లి ఓటువేశారు.

మాజీ సీఎం కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం అతిశీ, ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్, మాజీమంత్రి సత్యేంద్రజైన్ తన సతీమణితో కలిసి వెళ్లి ఓటుహక్కు వినియోగించుకున్నారు. మయూర్‌విహార్‌లో బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా తన సతీమణితో కలిసి ఓటువేశారు. కాగా, 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో 62.59శాతం ఓట్లు పోలయ్యాయి. 2024 పార్లమెంటు ఎన్నికల్లో 56శాతం ఓటింగ్ నమోదైంది.
కాగా, ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు 699 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఢిల్లీలో మొత్తం 1.56 కోట్ల మంది ఓటర్లు ఉండగా, భారత ఎన్నికల సంఘం 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. బీజేపీ 68 స్థానాల్లో, ఆ పార్టీ మిత్రపక్షాలు జేడీయూ, లోక్‌జనశక్తి రాం విలాస్ పాసవాన్ పార్టీ ఒక్కో స్థానంలో పోటీ చేశాయి. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు.
మరోవైపు, ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో పలు మీడియా, సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెలువరించాయి. ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలను గమనిస్తుంటే అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష బీజేపీల మధ్య హోరాహోరీ పోరు జరిగినట్లు తెలుస్తోంది. అయితే, మెజార్టీ పోల్స్ మాత్రం ఈసారి భారతీయ జనతా పార్టీ దేశ రాజధానిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని చెబుతున్నాయి. కాగా, అసలైన ఫలితాలు ఫిబ్రవరి 8న వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications