ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం: సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు, 2న విచారణ
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సమన్లు జారీ చేశారు. లిక్కర్ పాలసీలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి నవంబర్ 2న విచారణకు హాజరుకావాలని సూచించారు.
ఇదే కేసులో ఈ ఏడాది ఏప్రిల్‌లో కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు జారీ చేయగా.. విచారణకు హాజరైన విషయం తెలిసిందే. లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిన కొద్ది గంటల్లోనే ఈ సమన్లు జారీ చేయడం గమనార్హం.

అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు జారీ చేయడంపై మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పందించారు. ఆమ్ ఆద్మీ పార్టీని అంతమొందించడమే కేంద్రం లక్ష్యమని ఆరోపించారు. కేజ్రీవాల్ ను నకిలీ కేసులో ఇరికించి జైలుకు పంపే వరకు వదిలిపెట్టేలా లేరని వ్యాఖ్యానించారు.
కాగా, ఈ కేసుకు సంబంధించిన కొన్ని ఆధారాలను ఈడీ తమకు అందించినట్లు కోర్టు సోమవారం పేర్కొంది. లిక్కర్ స్కాంలో రూ. 338 కోట్ల నగదు బదిలీకి సంబంధించి ఈడీ కొన్ని ఆధారాలను చూపించినట్లు సుప్రీంకోర్టు తెలిపింది. కాగా, ఈ లిక్కర్ స్కాం కేసులో విచారణ పూర్తి చేసేందుకు ఈడీకి సుప్రీంకోర్టు 6 నుంచి 8 నెలల సమయం ఇచ్చింది. విచారణ నెమ్మదిగా సాగితే.. మూడు నెలల్లోపు మనీశ్ సిసోడియా మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హత పొందుతారని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.












Click it and Unblock the Notifications