వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిల్లీ అగ్నిప్రమాదం: 'నా గర్ల్ ఫ్రెండ్ మంటల్లో చిక్కుకున్నప్పుడు వీడియో కాల్ చేసింది.. కానీ, రక్షించలేకపోయా'

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
దిల్లీలో అగ్నిప్రమాదం

పశ్చిమ దిల్లీలోని సంజయ్ గాంధీ ఆస్పత్రి బయట రద్దీగా ఉంది. కొందరి కళ్లల్లో నీళ్లు, కొందరి కళ్లల్లో ప్రశ్నలు. వారి మధ్యలో ఒక యువకుడు అతికష్టం మీద కన్నీళ్లను ఆపుకుంటూ మౌనంగా నిల్చున్నారు.

"నా గర్ల్‌ఫ్రెండ్ కూడా మంటల్లో చిక్కుకుంది. తను నాకు వీడియో కాల్ చేసింది. నేను తనకు ధైర్యం చెబుతూ ఉన్నాను. మెల్లగా పొగ అంతటా వ్యాపించింది. ఆపై తన కాల్ కట్ అయింది" దుఃఖాన్ని అణుచుకుంటూ ఆ యువకుడు చెప్పారు.

తరువాత ఆ అమ్మాయి కనిపించలేదు. ఆమెకు ఏమైందో తెలీదు. సంజయ్ గాంధీ ఆస్పత్రి బయట ఆ యువకుడు వెయిట్ చేస్తున్నారు. ఆయన లాగే మరెన్నో కుటుంబాలు వారి ఆత్మీయుల ఆచూకీ కోసం అక్కడ పడిగాపులు కాస్తున్నాయి.

దిల్లీలో అగ్నిప్రమాదం

'అక్క లేకుండా మేమెలా బతకగలం?'

14 ఏళ్ల మోనీ, తన అక్క పూజ కోసం వెతుక్కుంటూ ఆస్పత్రికి వచ్చారు. మోనీ అక్క, 19 ఏళ్ల పూజ అగ్నిప్రమాదానికి గురైన భవనంలోని సీసీటీవీ కెమెరా తయారీ కంపెనీలో పనిచేస్తున్నారు.

"అగ్నిప్రమాదం గురించి వార్తల్లో తెలిసింది. వెంటనే పరిగెత్తుకుని ఇక్కడకు వచ్చాం. మా అక్క ఎక్కడుందో మాకు తెలీదు. సంజయ్ గాంధీ ఆస్పత్రిలో కనుక్కోమని చెప్పారు. ఇక్కడకు వచ్చాం" అని మోనీ చెప్పారు.

మోనీ వాళ్లక్క పూజ ఇంట్లో పెద్ద పిల్ల. ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.

"పొద్దున్న 9.00 గంటలకు ఆఫీసుకు వెళ్లింది. అక్కడ డేటా ఎంట్రీ పనిచేస్తుంది. అక్క దగ్గర ఫోన్ లేదు. అందుకే మాకు కాల్ చేయలేక పోయింది" అని మోనీ చెప్పారు.

పూజ మూడు నెలల క్రితమే ఈ ఉద్యోగంలో చేరారు. తండ్రి లేరు. దాంతో, ఇంటి భారమంతా ఆమె భుజాలపైనే పడింది. పూజ తల్లి అక్కడే ఉన్నారు. దుఃఖంతో ఆమె గొంతు పూడుకుపోయింది.

"అక్క లేకుండా మేమెలా బతకగలం?" అంటూ మోనీ కన్నీళ్లు పెట్టుకున్నారు.

దిల్లీలో అగ్నిప్రమాదం

'అత్తయ్య ఎక్కడుందో...'

నౌషాద్ తన మేనత్త కోసం వెతుకుతూ సంజయ్ గాంధీ ఆస్పత్రి చేరుకున్నారు. అగ్నిప్రమాదం గురించి తెలిసిన దగ్గర నుంచి ఆయన ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. కానీ, తన అత్త జాడ తెలియలేదు.

"సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి వెళ్ళాను. ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కి, రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి వెళ్లా. మా అత్త ఆచూకీ తెలియలేదు. ఇక్కడైనా తెలుస్తుందేమోనని వచ్చాను" అని చెప్పారు నౌషాద్

పంకజ్‌దీ ఇదే కథ. తన తమ్ముడు ప్రవీణ్ కోసం వెతుకుతున్నారు. చుట్టుపక్కల ఆస్పత్రులన్నీ వెతికారు. జాడ తెలియలేదు.

"మా తమ్ముడు ప్రవీణ్ గత ఎనిమిదేళ్లుగా ఆ కంపెనీలో గ్రాఫిక్ డిజైనర్‌గా పని చేస్తున్నాడు. అతడి గురించి మాకు ఎలాంటి సమాచారం లేదు" అని పంకజ్ చెప్పారు.

ప్రమాదం జరిగిన విషయం ఒక స్నేహితుడి ద్వారా పంకజ్‌కు తెలిసింది.

"మృతదేహాలను సంజయ్ గాంధీ ఆస్పత్రికి తరలించారని తెలిసింది. గుర్తింపు కొసం డీఎన్ఏ పరీక్ష చేయించాల్సి ఉంటుందని చెప్పారు" అని ఆయన అన్నారు.

'మా అమ్మాయి ఫోన్ రింగు అవుతోంది, కానీ... '

40 ఏళ్ల మోనీ కూడా అదే కంపెనిలో పనిచేస్తున్నారు. కూతురి ఆచూకీ తెలియలేదని ఆమె తల్లి చెప్పారు. అయితే, మోనీ ఫోన్ రింగు అవుతూనే ఉంది.

"నా కూతురి ఫోన్ రింగు అవుతోంది. కానీ ఎవరూ ఎత్తట్లేదు. నిచ్చెనలు, క్రేన్ సహాయంతో చాలామంది అమ్మాయిలను భవనం నుంచి కిందకు దించారు. ఒక వీడియో చూశాం.. అందులో మా అమ్మాయిని కూడా కిందకు దించినట్టు అనిపించింది. కానీ, తన ఆచూకీ తెలియట్లేదు. మా అమ్మాయి ఎక్కడుందో మాకు తెలీదు" అంటూ మోనీ తల్లి వాపోయారు.

ప్రమాదంలో చిక్కుకున్నవారిలో కొందరు తమ ఇళ్లకు సమాచారాన్ని అందించారు. కొందరు అది కూడా చేయలేకపోయారు.

దిల్లీలో అగ్నిప్రమాదం

'నా చెల్లి మంటల్లో చిక్కుకుపోవడం చూస్తూ కూడా ఏమీ చేయలేకపోయాను..'

నాంగ్లోయీలో ఉంటున్న 21 ఏళ్ల ముస్కాన్ కూడా ఆ సీసీటీవీ కంపెనీలో పనిచేస్తున్నారు. మంటలు చెలరేగిన వెంటనే ఆమె, తన సోదరుడు ఇస్మాయిల్‌కు ఫోన్ చేశారు.

ఇస్మాయిల్ పదిహేను నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ, తన చెల్లెలిని కాపాడలేకపోయారు. ముస్కాన్ ఎక్కడున్నారో, అసలు ఉన్నారో లేదో ఇస్మాయిల్‌కు తెలీదు.

"నేను అక్కడకు వెళ్లగానే, బిల్డింగ్ లోపల మా చెల్లి కనిపించింది. వెంటనే ఫోన్ చేసి వెనక దారి నుంచి బయటకు రమ్మని చెప్పాను. ఆ తరువాత, తనతో మాట్లాడలేదు" అని ఆయన చెప్పారు.

ఇస్మాయిల్‌, ఆయన కుటుంబ సభ్యులు ముస్కాన్ కోసం ఆస్పత్రులన్నీ తిరుగుతున్నారు. కానీ, ఆమె ఆచూకీ తెలియలేదు.

మంటలు చల్లారాక ఇస్మాయిల్‌ బిల్డింగ్ లోపలికి వెళ్లి తన చెల్లెలి కోసం వెతికారు. కానీ, ప్రయోజనం లేకపోయింది. ఆయనకు కూడా గాజు ముక్క గుచ్చుకుని చేతికి గాయమైంది.

"మేం తన కోసం వెతికి వెతికి అలిసిపోయాం. ఎలాంటి వివరాలూ తెలియలేదు. మా చెల్లి హ్యాపీ-గో-లక్కీ టైప్ అమ్మాయి. మూడేళ్లుగా ఇక్కడ పనిచేస్తోంది. తాను సంపాదిస్తూ తన కలలను నెరవేర్చుకుంటోంది. ఆమెకి ఏమీ కాకూడదని, తను మాకు దక్కాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం" అన్నారు ఇస్మాయిల్.

అగ్నిప్రమాదంలో చిక్కుకున్న వారిలో ఎక్కువమంది మహిళలే

అగ్నిప్రమాదం జరిగిన భవనంలో మహిళా ఉద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్లకి 12 వేల నుంచి 15 వేల రూపాయల జీతం వస్తోందని కుటుంబ సభ్యులు చెప్పారు.

మంటలు ఆరిపోయాక బీబీసీ బృందం భవనం లోపలికి వెళితే, డజన్ల కొద్దీ ఆడవాళ్ల చెప్పులు కనిపించాయి.

ఈ ఘటనలో కనిపించకుండా పోయినవారి కోసం దిల్లీ పోలీసులు ఒక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు జాడ తెలియని 19 మంది గురించి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. వారిలో నలుగురు పురుషులు, 15 మంది మహిళలు ఉన్నారు.

ప్రమాదంలో గాయపడిన వారి వివరాలను దిల్లీ పోలీసులు వెల్లడించారు. కానీ, మృతుల గుర్తింపు ఇంకా మొదలుపెట్టలేదు.

"చాలామంది శరీరాలు తీవ్రంగా కాలిపోయాయి. వారిని గుర్తించడానికి డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది" అని ఒక పోలీసు అధికారి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Delhi fire: 'My girlfriend made a video call when she was on fire,but could not be rescued'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X