వెంటాడుతున్న మద్యం
Arvind Kejriwal: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది ఢిల్లీ. ఫిబ్రవరి రెండో వారంలో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఇంకొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన షెడ్యూల్ వెలువడనుంది. షెడ్యూల్ రూపకల్పనపై కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు కసరత్తు సాగిస్తోన్నారు.
మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్నాయి ఢిల్లీ అసెంబ్లీలో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్.. 36. 2013లో దేశ రాజధానిలో జెండా పాతింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇఫ్పటివరకూ చెక్కు చెదరట్లేదా పార్టీ ఓటుబ్యాంక్. 1998లో చివరిసారిగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీని పాలించింది. 2013లో కాంగ్రెస్ ఇక్కడ అధికారాన్ని కోల్పోయింది.

అప్పటి నుంచీ ఈ రెండు పార్టీలను కాదని ఆమ్ ఆద్మీకే పట్టం కడుతూ వస్తోన్నారు ఢిల్లీ ఓటర్లు. భారీ మెజారిటీతో ఆప్ అభ్యర్థులను గెలిపిస్తూ వస్తోన్నారు. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌కు ఏ మాత్రం కొరుకుడు పడట్లేదు హస్తినాపురి. ఈ సారి ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నాయి ఈ రెండు పార్టీలు.
అదే సమయంలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికీ పక్కా వ్యూహాలను పన్నుతోంది అధికార ఆమ్ ఆద్మీ పార్టీ. వరుసగా మూడోసారి అధికారాన్ని అందుకోవడానికి ఉవ్విళ్లూరుతోంది. దేశ రాజధానిపై తనకు ఉన్న పట్టును నిరూపించుకోవడానికి శాయశక్తులా ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ క్రయంలో కేజ్రీవాల్ ఇదివరకే పాదయాత్రను చేపట్టిన విషయం తెలిసిందే.
ఈ పరిణామాల మధ్య కేజ్రీవాల్‌కు బిగ్ షాక్ తగిలింది. మద్యం పాలసీ కుంభకోణంలో ఆయనను విచారించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులకు అనుమతి లభించింది. ఈ మేరకు ఢిల్లీ లెప్టినెంట్ జనరల్ వినయ్ కుమార్ సక్సేనా ఈడీకి అనుమతులను మంజూరు చేశారు.

మద్యం పాలసీ రూపకల్పనలో పెద్ద ఎత్తున అవినీతి, మనీ లాండరింగ్ జరిగిందని, ఇందులో అరవింద్ కేజ్రీవాల్ ప్రమేయం ఉందనేది ఈడీ వాదన. ఆయనను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈ నెల 5వ తేదీన లెప్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి ప్రతిపాదనలను పంపించారు. తాజాగా వీటిపై ఆమోద ముద్ర వేశారు ఎల్జీ వీకే సక్సేనా.
దీనిపై ఆప్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. ఎల్జీ నిర్ణయంపై మండిపడుతోంది. అసెంబ్లీఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాజకీయంగా కక్షసాధింపు చర్యలు చేపట్టడంలో భాగంగా ఎల్జీ వీకే సక్సేనా ఈ ఈడీ ప్రతిపాదనలపై ఆమోదం తెలిపారని మండిపడుతోంది. అరవింద్ కేజ్రీవాల్, ఆప్‌ను అణగదొక్కి అధికారంలోకి రావాలని బీజేపీ తాపత్రయ పడుతోందని ఆరోపించింది.
మద్యం పాలసీ కుంభకోణం విచారణ రెండేళ్లుగా కొనసాగుతూ వస్తోందని, ఇప్పటివరకు 500 మందిని విచారించారని, 50,000 పేజీల డాక్యుమెంట్లను రూపొందించారని, 250 చోట్ల దాడులు సాగించారని అయినప్పటికీ- ఒక్క రూపాయిని కూడా రికవరీ చేయలేకపోయారని ఆమ్ తెలిపింది.












Click it and Unblock the Notifications