మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన ఈడీ: బెయిల్ విచారణకు ముందు రోజే ఘటన
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మరోసారి అరెస్టయ్యారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మరోసారి అరెస్టయ్యారు. సీబీఐ అరెస్టు చేసిన తర్వాత బెయిల్ మంజూరు కాకముందే మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాజాగా గురువారం సిసోడియాను అరెస్ట్ చేసింది. సిసోడియా ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. కాగా, సిసోడియాకు బెయిల్ మంజూరు విషయంలో శుక్రవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు జరగనున్నాయి.
ఈ సమయంలో సిసోడియాను ఈడీ అరెస్ట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత రెండు రోజులుగా తీహార్ జైలులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలో సిసోడియాను ఈడీ ప్రశ్నించింది. గురువారం కూడా విచారించిన ఈడీ.. ఆ తర్వాత అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. ఈ క్రమంలో శుక్రవారం సిసోడియాను ఈడీ కోర్టులో ప్రవేశపెట్టనుంది.

ఫిబ్రవరి 26న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ కోసం సిసోడియా మొదట సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషన్‌దారుకి ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టుల నుంచి రక్షణ పొందే అవకాశం ఉండగా.. నేరుగా సుప్రీంకోర్టుకు రావడమేంటని ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో ఆయన బెయిల్ కోసం ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు.
బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మార్చి 4న దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వానదలను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ క్రమంలో గురువారం సిసోడియాను ఈడీ అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఆప్ నేతలను జైల్లోనే ఉంచడం బీజేపీ లక్ష్యం: అరవింద్ కేజ్రీవాల్
మనీష్ సిసోడియాను ఈడీ అరెస్టు చేయడంపై ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. మనీష్ సిసోడియాను మొదట సీబీఐ అరెస్ట్ చేసింది. సీబీఐకి ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఎక్కడా వారికి డబ్బు దొరకలేదు. శుక్రవారం సిసోడియా బెయిల్ పిటిషన్ విచారణ ఉంది. ఆయన రేపు విడుదలయ్యేవారు. అందుకే ఈరోజే సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది. వాళ్ల లక్ష్యమంతా ఒక్కటే.. ఎట్టిపరిస్థితుల్లో మనీష్‌ను, ఆప్ నేతలను జైల్లోనే ఉంచాలి. రోజుకో కొత్త నకిలీ కేసును సృష్టిస్తుండటం ప్రజలు చూస్తున్నారని.. వారే సమాధానం చెబుతారు అని అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.












Click it and Unblock the Notifications