చివరి రోజు: తారాస్ధాయికి చేరిన ఆరోపణలు, బీజేపీకి డేరా బాబా మద్దతు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆఖరి రోజైన గురువారం ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ పార్టీల మధ్య వాడి వేడిగా ఆరోపణలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ అభ్యర్ధుల ఓట్లను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆమ్ఆద్మీ పార్టీ ఆరోపించింది.
వివరాల్లోకి వెళితే... శనివారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ పార్టీకి చెందిన నాయకులు డబ్బులు పెట్టి ఓటర్లను కొనడానికి ప్రయత్నాలు చేస్తుందని ఆప్ పార్టీ నేత అశుతోష్ ఆరోపించారు.
ఓటర్లకు బీజేపీ అభ్యర్ధులు డబ్బులు, మద్యం, మాంసాహారం పంచిపెడుతున్నారనీ, వారిని ప్రలోభపెడుతోందని మండిపడ్డారు. ముఖ్యంగా దిగువ మధ్య తరగతి పేదవాళ్ల ఓటరు గుర్తింపు కార్డులను తమ ఆధీనంలోకి తీసుకుందని ఆరోపించారు.

బీజేపీ ఓటర్లను డబ్బులతో మభ్యపెట్టి ఓట్లను వేయించుకుందామని చూస్తున్నట్లు తమ వద్ద పూర్తి సమాచారం ఉందని ఆయన స్పష్టం చేశారు. సర్వే పోల్స్ అన్ని కూడా ఆమ్ ఆద్మీ పార్టీకే అనుకూలంగా ఉండటంతో.... బీజేపీ అభ్యర్ధులు విజయం సాధించేందుకు అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారని ఆప్ నేతలు ఆరోపించారు.
బీజేపీకి మద్దతు ప్రకటించిన డేరా బాబా గుర్మీత్ సింగ్
ఫిబ్రవరి 7న ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గుర్మీత్ రాం రహీమ్ సింగ్ నేతృత్వంలోని డేరా సచ్ఛా సౌదా బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా పొలిటికల్ అఫైర్స్ విభాగానికి చైర్మన్‌గా ఉన్న గుర్మీత్ రాం రహీమ్ సింగ్ మాట్లాడుతూ శనివారం జరుగనున్న ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.
డేరా సచ్ఛా సౌదాకు ఢిల్లీతోపాటు సరిహద్దు రాష్ర్టాలైన హర్యానా, పంజాబ్‌లో సుమారు 20 లక్షలకు ఫాలోవర్స్ ఉండగా.... ఒక్క ఢిల్లీలోనే 12 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. గత సంవత్సరం హర్యానాలో జరిగిన ఎన్నికల్లో డేరా మద్దతుతో బీజేపీ మొదటిసారిగా స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని పొలిటికల్ వింగ్ ఉపాధ్యక్షుడు అమన్‌దీప్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications