‘ప్రభుత్వం నెలకు 6లక్షల రేప్‌లకు అనుమతిస్తోంది’
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జీబీ రోడ్‌లో ఉన్న వ్యభిచార గృహాల్లో జరుగుతున్న కార్యకలాపాలు అత్యాచారంతో పోలుస్తూ ఢిల్లీ మహిళా కమిషన్(డిసిడబ్ల్యూ) ఛైర్ పర్సన్ స్వాతీ మలివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యభిచారం సమాజానికి మచ్చవంటిదన్నారు.
ఢిల్లీలోని జీబీ రోడ్డు రెడ్‌లైట్ ఏరియాలో ప్రతినెల పంపిణీ అవుతున్న కండోమ్‌ల సంఖ్యను మంగళవారం ఆమె ప్రస్తావించారు. ఢిల్లీలో ప్రతినెల ఆరు లక్షల కండోమ్‌లు పంపిణీ అవుతున్నాయంటే.. ప్రభుత్వం ఆరు లక్షల అత్యాచారాలకు అనుమతిస్తున్నట్లేనని ఆమె అన్నారు.
సెక్స్ వర్కర్లలో చాలామంది మైనర్లు ఉన్నారన్నారు. వ్యభిచారాన్ని ప్రజలు సైతం ఆమోదించడం ఘోరమని ఆమె అన్నారు. వ్యభిచారం పట్ల సమాజ దృక్ఫథం తనను నిరాశ పరుస్తున్నదని ఆమె పేర్కొన్నారు.

‘జీబీ రోడ్డుకు వెళ్లి అక్కడి పరిస్థితి చూసి వచ్చిన తర్వాత నేను ఎంతో మందితో మాట్లాడాను. రెడ్ లైట్ ఏరియాను మూసేస్తే అత్యాచారాల సంఖ్య పెరుగుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ విధమైన మైండ్‌సెట్ ఉండటం దురదృష్టకరం' అని ఆమె అన్నారు.
హ్యూమన్ ట్రాఫికింగ్‌ను నివారించే దిశగా ఎన్జీవో సంస్థలు, కేంద్రంతో కలిసి పని చేస్తామని స్వాతీ మలివాల్ తెలిపారు. ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవడం వల్ల దీనిని నిర్మూలించవచ్చని ఆమె పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications