ఈ ఏడాదిలోనే టాప్ ఉష్ణోగ్రత, గత నాలుగేళ్లలో ఎప్పుడూ లేనంత వేడి
దేశ రాజధాని ఢిల్లీ ఎండ సెగతో అల్లాడిపోతోంది. శనివారం (ఏప్రిల్ 25) నగరంలో ఈ ఏడాదిలోనే అత్యధికంగా 42.8 డిగ్రీల రికార్డ్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 5.1 డిగ్రీలు అధికం కావడం గమనార్హం. వరుసగా మూడవ రోజు తీవ్రమైన వడగాల్పులు వీయడంతో జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. 2022 తర్వాత ఏప్రిల్ నెలలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదేనని వాతావరణ శాఖ వెల్లడించింది.
తీవ్రమైన ఎండల దృష్ట్యా భారత వాతావరణ శాఖ (IMD) శని, ఆదివారాలకు 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది. సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీలో 42.8 డిగ్రీలు, నమోదు కాగా, రిడ్జ్ ఏరియాలో ఏకంగా 44.5డిగ్రీలు వద్ద ఉష్ణోగ్రత రికార్డైంది. అయానగర్ (43.2డిగ్రీలు), లోధి రోడ్ (42.6డిగ్రీలు) వంటి ప్రాంతాల్లో కూడా భానుడు భగభగలాడుతున్నాడు. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 2.5డిగ్రీలు ఎక్కువగా (25.2డిగ్రీలు) నమోదు కావడంతో రాత్రి పూట కూడా వేడి తగ్గడం లేదు.

త్వరలో ఉపశమనం.. వరుణుడి రాక!..
ఎండలతో సతమతమవుతున్న ఢిల్లీ వాసులకు వాతావరణ శాఖ ఒక తీపి కబురు అందించింది. సోమవారం నుంచి బుధవారం వరకు నగరంలో వాతావరణం మారే అవకాశం ఉంది. ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చని అంచనా వేస్తున్నారు. దీనివల్ల వచ్చే వారం చివరి నాటికి గరిష్ట ఉష్ణోగ్రతలు 38-40డిగ్రీలుకి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
కాలుష్య కోరల్లో రాజధాని..
ఒకవైపు ఎండలు మండిస్తుంటే, మరోవైపు గాలి నాణ్యత (AQI) క్షీణించడం ఆందోళన కలిగిస్తోంది. శనివారం సాయంత్రానికి గాలి నాణ్యత సూచీ 243గా నమోదై 'Poor' (తీవ్రమైన) కేటగిరీలో నిలిచింది. అయితే, వచ్చే వారం వీచే గాలులు, వర్షం కారణంగా కాలుష్య స్థాయిలు తగ్గి గాలి నాణ్యత మెరుగుపడే అవకాశం ఉందని ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అంచనా వేస్తోంది.














Click it and Unblock the Notifications