మారిపోతున్న లెక్కలు- ఆత్మరక్షణలో కేంద్రం..! ఫలించని మైండ్ గేమ్ ?
ఈ ఏడాది పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ముందు వరకూ కేంద్రంలో ఎన్డీయే సర్కార్ దుర్బేద్యంగా కనిపించింది. పార్లమెంట్ లో కీలకమైన డీలిమిటేషన్-మహిళా బిల్లుల్ని (Delimitation Bill) 2/3 వంతు మెజార్టీతో నెగ్గించుకోవడంలో వైఫల్యాలు, నీట్ పేపర్ లీకులతో రీటెస్టు పెట్టాల్సి రావడంతో పరిస్ధితి ఒక్కసారిగా మారిపోయింది. డీలిమిటేషన్ బిల్లును నెగ్గించుకోకుండా కేంద్రాన్ని అడ్డుకోవడంలో విపక్షాలు సక్సెస్ కాగా.. నీట్ అక్రమాలపై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కాక్రోచ్ జనతా పార్టీ సక్సెస్ అయింది. దీంతో కేంద్రానికి బీటలు వారడం ప్రారంభమైంది. దీంతో ఎందుకైనా మంచిదని పార్లమెంట్ ను ప్రోరోగ్ చేయకుండా ఆపిన కేంద్రం.. ఇప్పటికీ ఆ చక్రవ్యూహంలో నుంచి బయటపడలేకపోతోంది. దీంతో మరోసారి డీలిమిటేషన్ బిల్లును తెరపైకి తెస్తోంది.
20 మంది టీఎంసీ ఎంపీల్ని తమవైపుకు తిప్పుకోవడం, మరో ఆరుగురు శివసేన ఎంపీలు ఉద్ధవ్ కు గుడ్ బై చెప్పి షిండే సేనలో చేరడం, తమిళనాడు అసెంబ్లీ ఫలితాల తర్వాత విజయ్-కాంగ్రెస్ జత కట్టడంతో దూరమైన డీఎంకే తమకే మద్దతిస్తుందన్న అంచనాల్లో ఉన్న కేంద్రం.. డీలిమిటేషన్ బిల్లును ఎప్పుడైనా పార్లమెంట్ లో ప్రవేశపెట్టి నెగ్గించుకోవాలని భావించింది. కానీ ఎప్పుడైతే ఎస్ఐఆర్ వివాదాలతో డీఎంకే కూడా నష్టపోయిందో, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోసం ఇతర విపక్షాలతో కలిసి డిమాండ్లు చేయడం ప్రారంభించిందో అప్పుడు కేంద్రానికి పరిస్ధితి చేయిదాటిపోతోందని అర్దమైంది. దీంతో సాధ్యమైనంత త్వరగా పార్లమెంట్ ప్రత్యేక భేటీ పెట్టి డీఎంకే మద్దతుతో డీలిమిటేషన్ బిల్లు నెగ్గించుకోవాలని భావించింది.

కానీ ఇప్పుడు సీఈసీ వ్యతిరేక ఆందోళనల్లో చేరిన డీఎంకే.. కేంద్రానికి డీలిమిటేషన్ బిల్లుపై మద్దతిచ్చే పరిస్ధితుల్లో లేదు. అదే సమయంలో ఇప్పటివరకూ నమ్మకంగా ఉంటూ పలు బిల్లులకు మద్దతిస్తూ వచ్చిన బీజేడీ, వైఎస్సార్సీపీ కూడా ప్లేటు మార్చేశాయి. బీజేడీ అయితే ఏకంగా ఢిల్లీలో సీఈసీ వ్యతిరేక నిరసనల్లో పాల్గొనేందుకు ఎంపీల్ని పంపింది. ఇటు వైఎస్ జగన్ కూడా ఈసీల నియామక చట్టంపై నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు ఆ చట్టాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటే తప్ప జగన్ ఎన్డీయేవైపు ఉండే పరిస్ధితి లేదు. దీంతో డీఎంకే రాకపోగా.. ఉన్న వైసీపీ, బీజేడీ కూడా దూరం కావడంతో కేంద్రం పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోతోంది. దీంతో డీలిమిటేషన్ బిల్లును త్వరలో పార్లమెంట్ లో పెట్టి నెగ్గించుకుంటామంటూ లీకులు ఇస్తోంది. ఇదంతా సీఈసీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఢిల్లీ ఆందోళనల నుంచి దృష్టిమళ్లించే, వీలైతే విపక్షాల్ని చీల్చే కేంద్రం మైండ్ గేమ్ అని అర్దం కావడంతో డీఎంకే, వైసీపీ, బీజేడీ మాత్రమే కాదు ఇతర పార్టీలు కూడా దీనిపై స్పందించకుండా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాయి.













Click it and Unblock the Notifications
