కేంద్రం అనూహ్య నిర్ణయం..! త్వరలో పార్లమెంట్ ప్రత్యేక భేటీ?
సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ తో దేశ రాజధాని ఢిల్లీ ఆందోళనలతో అట్టుడుకుతున్న వేళ .. విపక్షాలు, కాక్రోచ్ జనతా పార్టీ, విద్యార్ధి సంఘాలను ఎలా నియంత్రించాలో తెలియక సతమతం అవుతున్న కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక భేటీ (Special Parliament Session) నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. గతంలో పార్లమెంట్ లో నెగ్గించుకోలేక తాత్కాలికంగా పక్కనబెట్టిన కీలక బిల్లుల్ని మరోసారి తెరపైకి తీసుకురావడం ద్వారా ఢిల్లీ నిరసనల నుంచి ప్రజల దృష్టిని మళ్లించవచ్చని కేంద్ర పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం.
ఢిల్లీలో నిరసనలతో ఉక్కిరిబిక్కిరవుతున్న కేంద్రం.. పార్లమెంట్ ప్రత్యేక భేటీ నిర్వహణ ద్వారా లోక్ సభలో కీలక బిల్లులు ఆమోదింపజేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. లోక్సభలో మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లులను ఆమోదించుకోవడానికి అవసరమైన సంఖ్యాబలం తమ వద్ద ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అదే సమయంలో, ఓటింగ్ జరిగే పక్షంలో మద్దతును కూడగట్టుకునేందుకు ప్రతిపక్ష పార్టీలతో సంప్రదింపులు జరుపుతోంది. గతంలో ఏప్రిల్ 17న జరిగిన బడ్జెట్ సమావేశాల సమయంలో మోదీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. అప్పుడు నియోజకవర్గాల పునర్విభజన, లోక్సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయింది.

రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంటులో 2/3 వంతు ప్రత్యేక మెజారిటీ అవసరం. ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏ కూటమికి మెజారిటీ ఉన్నప్పటికీ, రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ (సుమారు 360 స్థానాలు) మాత్రం లేదు. ప్రస్తుతం లోక్సభలో 540 మంది సభ్యులు ఉన్నారు. అయితే, గత సమావేశాల తర్వాత ప్రభుత్వ బలం పెరిగింది. తృణమూల్ కాంగ్రెస్కు చెందిన 20 మంది ఎంపీలు, శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు అధికార పక్షంలో చేరారు.
ఈ బిల్లులకు మద్దతు కోరేందుకు కేంద్రం డీఎంకేతో చర్చలు జరుపుతోంది. తమిళనాడు ఎన్నికల అనంతరం కాంగ్రెస్తో విభేదించి ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చిన డీఎంకే ఈ బిల్లులకు ఏ మేరకు మద్దతిస్తుందో చూడాలి. దీంతో మరికొన్ని చిన్న ప్రతిపక్ష పార్టీలతో కూడా ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని సమాచారం. ఆగస్టు 13న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసినా ఇంకా అధికారికంగా ప్రోరోగ్ చేయలేదు. దీంతో ప్రభుత్వం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. అక్టోబర్ 26, 27 తేదీల్లో సంవిధాన సదన్ లో జరిగే 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్ను దృష్టిలో ఉంచుకుని, పార్లమెంట్ సమావేశ తేదీలను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీకి వారం ముందే నోటీసు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.














Click it and Unblock the Notifications
