డేంజర్ బెల్స్ : 96 దేశాల్లో డెల్టా వేరియంట్, రానున్న రోజుల్లో మరింత ఉధృతి : డబ్ల్యూహెచ్ఓ
కరోనా మహమ్మారి యొక్క డెల్టా వేరియంట్, కనీసం 96 దేశాలలో గుర్తించబడిందని, ఇది ఇప్పటివరకు గుర్తించిన వేరియంట్లలో అత్యంత వ్యాప్తి చేయగల వేరియంట్ అని రానున్న రోజుల్లో ఈ వేరియంట్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది . వ్యాక్సిన్స్ తీసుకోని వారిలో ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం డెల్టా వేరియంట్ గురించి చాలా ఆందోళన ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

96 దేశాలలో డెల్టా వేరియంట్ వ్యాప్తి
డెల్టా వేరియంట్ కనుగొనబడిన దేశాల సంఖ్య ఇప్పుడు 100 కి చేరుకుంటుందని, ఇది రాబోయే నెలల్లో మరింత ప్రబలంగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా కనుగొనబడిన ఈ వేరియంట్ ఇప్పుడు 96 దేశాలలో కనుగొనబడిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.డెల్టా వేరియంట్‌ను మొదట భారతదేశంలో గుర్తించగా, ఇప్పటివరకు గుర్తించిన వేరియంట్లలో డెల్టా అత్యంత ప్రమాదకరమైందని ఆందోళన వ్యక్తం అవుతుంది.

రోజురోజుకీ డెల్టా బారిన పడుతున్న ప్రపంచ దేశాలు
గత వారంతో పోల్చితే, ఈ వేరియంట్ ఇప్పుడు మరో 11 రాష్ట్రాలకు వ్యాపించింది.డెల్టా వేరియంట్ ఆల్ఫా వేరియంట్ కంటే 55 శాతం ఎక్కువ వ్యాప్తి చెందుతుందని పేర్కొంది డబ్ల్యూహెచ్ వో. ఇది మొదట ఇండియాలో కనిపించిన వేరియంట్ అని, ఇప్పుడు యూకేలో 90 శాతం కేసులు డెల్టా వేరియంట్ కేసులేనని వెల్లడించింది . జూన్ 29, 2021 నాటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ తన కోవిడ్ -19 వీక్లీ ఎపిడెమియోలాజికల్ అప్‌డేట్‌లో, 96 దేశాలు డెల్టా వేరియంట్ కేసులను నివేదించాయి, అయితే ఈ వేరియంట్‌లను గుర్తించడానికి అవసరమైన సీక్వెన్సింగ్ సామర్థ్యాలు పరిమితంగా ఉన్నాయని పేర్కొంది. ఈ వేరియంట్ తీవ్రంగా ప్రభావం చూపించే వేరియంట్ అని పేర్కొంది.

వేరియంట్లు అన్నిటినీ డామినేట్ చేసి అధిక విస్తరణ చెయ్యనున్న డెల్టా
ప్రపంచవ్యాప్తంగా కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థకు డెల్టా కొత్త ముప్పుగా పరిణమిస్తున్నందున, స్థానికీకరించిన నియంత్రణ చర్యలను ఎక్కువ కాలం కొనసాగించాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వైరస్ ల యొక్క పెరిగిన ఆందోళనకర వైవిధ్యాల నేపధ్యంలో ఎక్కువ కాలం పాటు చర్యలు నిర్వహించాల్సిన అవసరం ఉందని, ఇదే సమయంలో వ్యాక్సినేషన్ కూడా యుద్ధ ప్రాతిపదికన సాగాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వైరస్ యొక్క ఆల్ఫా, బీటా, గామా మరియు డెల్టా వేరియంట్లలో, డెల్టాను ప్రపంచ ఆరోగ్య సంస్థ వేరియంట్లలో అత్యంత ప్రసారం చేయగలదిగా గుర్తించింది.

96 దేశాలలో డెల్టా వైరస్ కేసులు.. రాబోయే రోజుల్లో మరింత ఉధృతి
తాజా డబ్ల్యూహెచ్‌ఓ గణాంకాల ప్రకారం, ఆల్ఫా వేరియంట్ కేసులు 172 దేశాలలో, 120 దేశాలలో బీటా , 72 దేశాలలో గామా మరియు 96 దేశాలలో డెల్టా వైరస్ కేసులు ఉన్నాయని వెల్లడించారు. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో కరోనా డెల్టా వేరియంట్ మరింత విజృంభిస్తుంది అని, చాలా దేశాలలో డెల్టా వేరియంట్ ను గుర్తించడం కష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. చాలామంది ఆసుపత్రుల పాలు కావడానికి, అలాగే మరణాలకు డెల్టా వేరియంట్ ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. ప్రస్తుతమున్న వేరియంట్లు అన్నింటిని రానున్న రోజుల్లో డెల్టా అధిగమిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications